తిరుమల : శ్రీవాణి ట్రస్టుపై ఎవరి దారి వారిదే
x

తిరుమల : శ్రీవాణి ట్రస్టుపై ఎవరి దారి వారిదే

తిరుమలలో ప్రక్షాళన అనేది అందరి ప్రతిన. ఆ ట్రస్ట్ రద్దు చేస్తామని చైర్మన్ అంటున్నా, ఆ అధికారి ఏమి చేశారు? ఏమి జరిగింది.


తిరుమలలో ప్రక్షాళన దిశగా అడుగులు పడ్డాయి. టీటీడీ పాలక మండలి కూడా కొలువైంది. మరో ఐదు రోజుల్లో మొదటి భేటీకి అధికారులు అజెండా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టీటీడీలో శ్రీవాణి ట్రస్టు వ్యవహారంపై మళ్లీ చిచ్చు రగిలే విధంగా కనిపిస్తోంది. ఈ ట్రస్టును రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ గా తన పేరు ప్రకటించిన మరుసటి రోజే టీవీ5 బీఆర్. నాయుడు ప్రకటించారు. తాజాగా అదనపు సీహెచ్. వెంకయ్య చౌదరి తిరుమలలో ఆ ట్రస్టు ద్వారా రోజుకు 900 మందికి టికెట్ల జారీ చేయడానికి వీలుగా సదుపాయాన్ని విస్తరించారు. ఇది టీటీడీ చైర్మన్ ఆలోచనలకు విభిన్నంగా ఉందని భావిస్తున్నారు. కాగా,



పేరు ప్రకటించగానే..

శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని చైర్మన్ గా బాధ్యతలు తీసుకోకముందే టీవీ5 బీఆర్ నాయుడు విస్పష్టంగా ప్రకటించారు. ఈ ట్రస్టును వైసీపీ ప్రభుత్వ కాలంలో దుర్వినియోగానికి పాల్పడింది. నిధులు దారిమళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. తాను బాధ్యతలు తీసుకున్న తరువాత అమలు చేసే అజెండా కూడా జేబులో ఉందని ఆయన బీఆర్ నాయుడు ప్రకటించారు. అందులో విజిలెన్స్ నివేదిక అందిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయడమే అన్నారు. ఈ ట్రస్టులో " అక్రమాలు జరిగాయనే అపోహ ఉంది" అని కూడా వ్యాఖ్యానించారు.
ప్రమాణస్వీకారం తరువాత..
టీటీడీ చైర్మన్ గా ఈ నెల ఆరో తేదీ టీవీ5 బిఆర్. నాయుడు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల అన్నమయ్య భవన్ లో అధికారులతో పరిచయం కార్యక్రమం తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. " శ్రీవాణి ట్రస్టు రద్దు విషయంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు" అంటూ ఆయన స్వరంలో మార్పు కనిపించింది. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత రెండు రోజుల కిందట ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు.
వాస్తవానికి
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోకముందే తిరుమల జరిగిన వ్యవహారాలపై టీవీ5 అధిపతిగా బీఆర్. నాయుడు సమగ్రమైన అవగాహన ఉంది. ఆయన ఏమన్నారంటే.. "తిరుమలకు సంబంధించి అన్ని విషయాలు గమనిస్తుంటాం. చిత్తూరు వ్యక్తిగా మా ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమమైనా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చేవాళ్లం" అని ఈ ప్రాంత ప్రజల జీవనశైలిని వివరించారు. గత ఐదేళ్లుగా సాగిన వ్యవహారాలు చూస్తూనే ఉన్నా, అందుకే స్వామిదర్శనానికి వెళ్లలేదు. ఐదేళ్ల తరువాత కొండ ఎక్కబోతున్నా" అని అధ్యక్ష బాధ్యతలు తీసుకోకముందు చెప్పారు. పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశాక ఏమి చేయబోయేది కూడా ఆయన చెప్పారు. " గంటలోపు సామాన్య భక్తుడికి దర్శనం కల్పించాలి. టీటీడీ భూములపై అధ్యయనానికి కమిటి, శ్రీవాణి ట్రస్టు రద్దు. గతంలో మాదిరే శ్రీవారి దర్శనానికి టోకెన్లు ఇచ్చే పద్ధతి మళ్లీ అమలు చేయడం" వంటి అంశాలను విస్పష్టంగా ప్రకటించారు. కాగా,
భిన్నంగా ఏర్పాట్లు

తిరుమలలో శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆఫ్ లైన్ లో టికెట్ల జారీ మరింత సులభం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. గోకులం సమావేశమందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ బుధవారం ఉదయం టీటీడీ సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈఓ రాజేంద్ర, వీజీఓ సురేంద్ర, ఏఈవో కృష్ణయ్య, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వయంగా భక్తుల వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు. దీనిపై అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ఏమటన్నాంటే " గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడడం గమనించాం. అందుకే ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశాం. అని తెలిపారు.
రోజుకు 900 టికెట్లు

శ్రీవాని ట్రస్టు ద్వారా రోజుకు 900 టికెట్ల జారీకి ఏర్పాట్లు చేశామని అడిషనల్ ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. రూ. 10,500 చెల్లించిన వారికి ఈ టికెట్ దక్కుతుంది. ఇందులో రూ.. 10 వేలు ట్రస్టుకు వెళుతుంది. మిగతా రూ.500కు శ్రీవారి దర్శనానికి వీఐపీ టికెట్ మంజూరు చేస్తారు. " ఈ కేంద్రం ద్వారా నిమిషంలో టికెట్ జారీ చేస్తున్నాం. గతంలో మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేది" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వివరించారు. తిరుపతి, తిరుమలలో ఉన్న ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
శ్రీవాణి ట్రస్టు వివాదం ఏమిటి?
శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవారి ట్రస్టు) (Sri Venkateswara Aalayaala Nirmanam Trust -SRIVANI) అనేది దళిత, బీసీ, గిరిజన , మత్స్యకార కాలనీల వారికి ఉపయోగకరమైంది. ఆ ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశారు.
శ్రీవారి దర్శనానికి ఈ ట్రస్టు కేంద్రంలో రూ. 10,500 చెల్లిస్తే వీఐపీ టికెట్ దక్కుతుంది. రూ.500 టికెట్ ధర. అందులో రూ. 10 వేలు ట్రస్టుకు వెళుతుంది. ఆ నిధులు ట్రస్టుకు వెళతాయి. ఈ నిధులతో దళిత గిరిజన, మత్స్య కార కాలనీల్లో ఆలయాల నిర్మాణం , పాతవాటిని జీర్ణోద్ధరణ చేయడానికి వినియోగిస్తారు.
2018 ఆగస్టు 28 : అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ట్రస్టుకు రూపకల్పన చేసింది. ఆ తరువా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కల్పోయిన విషయం తెలిసిందే.
2019: వైసీపీ అధికారంలోకి రాగానే అదనపు ఈఓగా వచ్చిన ఏవీ. ధర్మారెడ్డి ఈ ట్రస్టుకు మరింత బలం చేకూర్చారు.
2024 : ఎన్నికలు జరగానికి ముందు వరకు 1,450 కోట్ల రూపాయాలు ట్రస్టుకు జమ అయ్యాయి. ఆ నిధులతో 176 ఆలయాలను 350 కోట్లతో పురాతన ఆలయల జీర్ణోద్ధరణ, 1853 ఆలయాలు దేవాదాయ శాఖ, 320 ఆలయాలు సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా నిర్మాణాలు సాగిస్తున్నారు. పుదుచ్చేరిలో 139 కోట్లతో ఆలయాల పునరుద్ధరణకు కేటాయించినట్లు గత పాలక మండలి సభ్యులు మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే,
నివేదిక రాకుండానే...
అధికారంలోకి రాకముందు నుంచే టీడీపీ కూటమి నేతలు శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించారు." ఈ నిధులు వైసీపీ పెద్దలు దారి మళ్లించారు" అనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. అంతర్గత విచారణ జరిగింది. నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందలేదు.
ఎన్నో ట్రస్టులు ఉండగా ..
టీటీడీలో అనేక ట్రస్టులు ఉన్నాయి. మళ్లీ " ఇంతటి వివాదాస్పదన ట్రస్టు ఎందుకు" అనేది చైర్మన్ బీఆర్. నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం. అందుకే నివేదిక అందిన తరువాత ఈ ట్రస్టు రద్దుపై సమీక్షించి, నిర్ఱయం తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, గతంలో తిరుమల అదనపు ఈఓగా ఏవీ. ధర్మారెడ్డి సర్వంతానే అన్నట్లు వ్యవహరించి, జాడ లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వంలో కూడా టీటీడీకి అదనపు ఈఓగా కేంద్ర సర్వీసుల నుంచి సీహెచ్. వెంకయ్య చౌదరిని తీసుకుని వచ్చారు. ఈయన కూడా అకస్మాత్తుగా " తిరుమలలో దర్శనానికి వెళ్లని వారికి ఆధార్ కార్డుపై రెండు లడ్లు మాత్రమే" అని నిర్ణయం తీసుకోవడం ద్వారా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఇదిలా ఉంటే,
టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు శ్రీవాణి ట్రస్టు చేయాలననే పట్టుదలతో ఉన్నారు. ఆ ట్రస్టు కేంద్రాలను విస్తృతం చేయడం ద్వారా అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తన పని చేసుకుని పోతున్నారు. అంటే విజిలెన్స్ విచారణ ఏమీ తేల్చలేదు. ఈ పరిస్థితుల్లో శ్రీవాణి ట్రస్ట్ సవ్యంగా ఉందనే ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ ఎలామారుతుందో వేచిచూడాలి.
Read More
Next Story