తిరుమల:వైసీపీ నిర్ణయాలు సమీక్షిస్తాం...  కొలువైన టీటీడీ బోర్డు
x
తిరుమలలో టీటీడీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ నాయుడుకు ప్రసాదాలు అందిస్తున్న ఈఓ శ్యామలరావు

తిరుమల:వైసీపీ నిర్ణయాలు సమీక్షిస్తాం... కొలువైన టీటీడీ బోర్డు

టీటీడీ చైర్మన్ గా టీవీ5 బిఆర్ నాయుడు, 18 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని వారు అంటున్నారు.


తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) 54వ చైర్మన్గా టీవీ5 అధిపతి బి. రాజగోపాల్ నాయుడు (BR naidu tv5) బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు కొందరు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సగం మంది సభ్యుల తోపాటు ఎక్స్- అఫీషియో సభ్యులుగా ఉన్న అధికారులు కూడా హాజరు కాలేదు. కాగా, ఈ కార్యక్రమానికి ప్రతినిధులందరూ, సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు.


శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల కొంతమంది సభ్యులు మీడియాతో మాట్లాడారు. "సామాన్య భక్తుల సేవ చేసే భాగ్యం దక్కింది" అన్నారు. " తిరుమలలో ప్రక్షాళన చేసే దిశగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అపసవ్య పరిస్థితులను సమీక్షిస్తాం" అని ప్రకటించారు. ఇలా ఉండగా,

టీటీడీ బోర్డు సభ్యులుగా 25 మంది, నలుగురు అధికారులను ఎక్స్ -అఫీషియో మెంబర్లుగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది. టీటీడీకి అందిన ఆ జీవో, బోర్డు సెల్ ల్డ్ కు చేరింది. సభ్యుల ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఖరారైంది. ఆ మేరకు.. ముందుగా అందించిన సమాచారంతో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు బోర్డు సెల్ కు సమాచారం అందింది. ఇందుకోసం టీటీడీ యంత్రాంగం తిరుమలలో ఏర్పాట్లు చేసింది. అంతకంటే ముందు టీటీడీ సభ్యుల వివరాలతో లెటర్ హెడ్లు తయారీని పూర్తి చేశారు.
బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం

టీటీడీ చైర్మన్ టీవీ5 బిఆర్. నాయుడు తోపాటు కొంతమంది సభ్యులు బుధవారం తెల్లవారుజామున 7.15 గంటలకు శ్రీవారి ఆలయం లోని బంగారు వాకిలి వద్ద, ఉన్న జయవిజయుల ద్వారం సమీపంలో ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ నేలపైపే పరదాలు పరచడం ద్వారా సభ్యులందరితో ఈఓ శ్యామలరావు ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి భూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకోగా, మహద్వారం వద్ద టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

ప్రమాణస్వీకారం అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. చైర్మన్ బీఆర్ నాయుడును ఈఓ శ్యామలరావు శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం, టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అందించారు.
సభ్యుల ప్రమాణస్వీకారం
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా దేవాదాయశాఖ సెక్రటరీ సత్య నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖరగౌడ్, జాస్తి పూర్ణసాంబశివరావు, ఎంఎస్.రాజు, నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగ శ్రీ,, ఆనంద్ సాయి, జానకి దేవి తమ్మిశెట్టి, ఆర్.ఎన్.దర్శన్, ఎం.శాంతారామ్, ఎస్.నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్ ప్రమాణం స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవోలు లోకనాథం ప్రశాంతి, భాస్కర్ ఆలయంలో ఏర్పాట్లు చేయగా, సభ్యులతో టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు మరో బోర్డు పి.రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు.
కుటుంబసభ్యులతో హాజరు..
టీటీడీ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన టీవీ5 బిఆర్ నాయుడు ఏకంగా సుమారు 48 మంది కుటుంబ సభ్యులతో హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే, మిగతా సభ్యులు కూడా చాలామంది కుటుంబ సభ్యులతోనే వచ్చారు. శ్రీవారి ఆలయ నిబంధనల ప్రకారం వారంతా విఐపి టికెట్లు కొనుగోలు చేసే వచ్చినట్లు తెలిసింది.
రేపు ఇద్దరూ..
టీటీడీ పాలకమండలిలో చివరిగా స్థానం దక్కించుకున్న తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భాను ప్రకాష్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. "ఆ రోజు ముహూర్తం బాగుంది. అందుకే ఆరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేస్తా" అని భాను ప్రకాష్ రెడ్డి _ ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు. మరో సభ్యురాలు సుచిత్ర ఎల్లా కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
తిరుమల పక్షాళన.. తప్పిదాల సమీక్ష
టీటీడీ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల్లో కొందరు తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
కొనసాగింపు : నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తన భర్త నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలిసి వచ్చారు. ఆమె మాట్లాడుతూ,
"మళ్లీ తనకు శ్రీవారి చెంత సభ్యురాలిగా సేవ చేసే భాగ్యం లభించింది. ఇది తనకు లభించిన వరం" అన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆమె టీటీడీ మాజీ చైర్మన్లు వైవి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సారధ్యంలోని కమిటీలో కూడా సభ్యురాలిగా పనిచేశారు.
తప్పులపై సమీక్ష : తిరుమలలో సీఎం చంద్రబాబు ఆశించిన ప్రక్షాళన దిశగా పనిచేస్తాం అని బోర్డు మరో సభ్యుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు వ్యాఖ్యానించారు. " తిరుమలలో గత ప్రభుత్వం సాగించిన అన్యాక్రాంతాలు, అపసవ్య పరిస్థితిలను సమీక్షిస్తాం" ఎంఎస్.రాజు ప్రకటించారు. " గత ప్రభుత్వంలో పేదలకు దేవుడని దూరం చేసే కుట్రలు జరిగాయి. ఆ పరిస్థితి ఎదురుకాకుండా తప్పులను సమీక్షిస్తాం" అని ఎమ్మెల్యే రాజు తెలిపారు.
ఎన్ఆర్ఐ : బోర్డులో స్థానం దక్కించుకున్న ప్రవాసాంధ్రుడు జాస్తి సాంబశివరావు మాట్లాడారు. "శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రవాస ఆంధ్రులకు తిరుమలలో మంచి దర్శనం సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తా" అని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే భారతీయులకు సేవలు అందించే భాగ్యం దక్కింది అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా,
9న ఇంకొందరు ప్రమాణస్వీకారం
ముహూర్తబలాన్ని చూసుకున్న ఇంకొందరు సభ్యులు తిరుమల ఆలయంలో ఈనెల 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడానికి టిటిడి కి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వారిలో ప్రభుత్వం నియమించిన వారిలో ఆరుగురు సభ్యులతో పాటు మరో ముగ్గురు అధికారులు కూడా ఉంటారని తెలుస్తోంది.
Read More
Next Story