తిరుపతిలో భుకబ్జాలు ఆపి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి...
తిరుపతి సమీపంలో కొండలు గుట్టు తవ్వేసి భూములను కబ్జా చేస్తూంటే కడుపు మండిన ఇళ్లు లేని పేదలు చీరెలు, గోతాలతో గుడారాలు వేసుకుని ఇంటి స్థలం ఆక్రమించుకున్నారు
రేణిగుంట మండలం కరకంబాడి ప్రాంతంలో వందల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని, అధికార పార్టీ నాయకులు యధేచ్ఛగా అమ్ముకుంటున్నారని .భూ కబ్జాలను అరికట్టి, గత పది రోజులుగా కరకంబాడి గుట్టలపై పడిగాపులు కాస్తూ, అధికారుల నిర్ణయంకై వేచి ఉన్న నిరు పేదలకు ఇంటి స్థలాలను చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి డిమాండ్ చేశారు.
కరకంబాడి గ్రామ పరిధిలో వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని గత కొంతకాలంగా ఖద్దరు పెద్దలు దోచేస్తున్నారు. ఈ భూముల్లో మైనింగ్ కార్యక్రమాలు అక్రమంగా జరుగుతున్నాయి. కొండలను సైతం తవ్వేసి పూర్తిగా ఆక్రమించి దందా చేస్తున్నా. రెవెన్యూ వారు ఇటువైపు చూడటమే లేదు.ఈ ప్రభుత్వ భూములు తమ కళ్లెదుటే కబ్జాకావడం తో కడుపు మండిన తిరుపతి నగరం, కరకంబాడి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేదలు పెద్ద సంఖ్యలో పోగై గుట్ట స్థలాన్ని ఆక్రమించారు ఆఖరికి కొండపైకి సైతం వెళ్లి చీరలు, దారాలు, ప్లాస్టిక్ గోతాలతో హద్దులను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. దీనిని బట్టి ఇల్లు లేని సమస్య తిరుపతి లో ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. వీరిలో అర్హులైన వారందరికి ఇప్పటికైనా ఇంటి స్థలాలు కేటాయించాలని ఆయన కోరారు.
చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలీచాలని ఆదాయాలతో అల్లాడిపోతున్న కార్మికులు, కష్టజీవులు అత్యంత పేదలైన ప్రజలకు ఇంటి స్థలాలను ఇవ్వాలని ఆయన కోరారు.