Tirupati Stampede-CM Chandrababu | తిరుపతి ఘటన: ఐదుగురు అధికారులపై వేటు
బైరాగిపట్టెడ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ముగ్గురిని బదిలీ వేటు వేశారు. మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు.జుడిషియల్ విచారణకు ఆదేశించారు.
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించారు. అనంతరం టీటీడీ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. టీటీడీ, జేఈఓ సీవీఎస్ఓ, తిరుపతి ఎస్పీని బదిలీ చేశారు. డీఎస్పీ, గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు జారీకి తిరుపతిలో ఎనిమిది కేంద్రం ఏర్పాటు చేశారు. అందులో బైరాగి పట్టేడులోని హైస్కూల్ వద్ద, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసన్ కౌంటర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 35 మంది గాయపడి తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తిరుపతిలో సీఎం
తిరుపతిలో జరిగిన దుర్ఘటన పై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి స్పందించారు. గురువారం ఉదయం ఆయన అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 కు తిరుపతికి చేరుకున్నారు. దుర్ఘటన జరిగిన బైరాగిపట్టెడలోని హైస్కూల్ తో పాటు సమీపంలోని పద్మావతి పార్కులో ప్రతి ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. సుమారు రెండు గంటల పాటు ఆయన ఆసుపత్రిలోనే రోగులు మధ్య గడిపి అందరికీ ధైర్యం చెప్పారు.
సుదీర్ఘ సమీక్ష
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన తర్వాత మొదటిసారి టీటీడీ పరిపాలన భవనానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు రాష్ట్ర మంత్రులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్, అధికారులతో సుదీర్ఘంగా గంట పాటు సమీక్షించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ముగ్గురిపై బదిలీ వేటు..
భారీ సంఖ్యలో వచ్చిన యాత్రికులను టోకన్లు జారీ చేసే కేంద్రాల వద్ద నియంత్రించడం తోపాటు భద్రత చర్యలు తీసుకోవడంలో జరిగిన లోపాలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇందులో భద్రతా వైఫల్యాన్ని ప్రధానంగా గుర్తించిన సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ప్రకటించారు.
తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు,టీటీడీ అధికారులను సమన్వయం చేయడంలో జేఈవో గౌతమి విఫలమయ్యాురు. భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు సిబ్బందిని సమన్వయం చేయడంలో బాధ్యత లేకుండా వ్యవహరించారని టిటిడి సివిఎస్ఓ శ్రీధర్ (ఐపీఎస్ అధికారి) పై బదిలీ వేటు వేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, బైరాగిపట్టెడ వైకుంఠ దర్శన టోకన్లు జారీ చేసే కేంద్రం వద్ద భద్రతా చర్యలతో పాటు, ముందు జాగ్రత్తలు చేసుకోవడంలో బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ డిఎస్పి రమణ కుమార్, కీలకపాత్ర నిర్వహించిన, టిటిడి గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మృతుల కుటుంబాలకు ఉద్యోగం
బైరాగిపట్టెడ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారని సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. వారిలో విశాఖపట్నంకు చెందిన ఎస్ లావణ్య, శాంతి, బాబు నాయుడు, రజిని, తమిళనాడులోని కోయంబత్తూర్ చెందిన నిర్మల, సేలం సమీపంలోని మెట్టూరు ప్రాంతానికి చెందిన మల్లికా మృతి చెందిన వారిలో ఉన్నారని వెల్లడించారు. ఆ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి టీటీడీ నుంచి 25 లక్షల రూపాయల పరిహారం అందించడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా వారి కుటుంబంలో ఒక్కొక్కరికి ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడానికి అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశారు.
గాయపడిన ఇద్దరికీ కాస్త సీరియస్ గా ఉందని, వారిలో ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు పరిహారం కూడా చెల్లించడానికి సీఎం చంద్రబాబు టిటిడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన 30 మంది బాధితులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు పరిహారం చెల్లించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని సమీక్షలోనే టిటిడి అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వారి సంకల్పం గొప్పది
తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనే కోరిక బలీయంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. రెండు గంటల పాటు ఆసుపత్రిలో ఉన్న బాధితులను ప్రతి ఒక్కరిని పలకరించానని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోరుకున్న 35 మందికి రెండు రోజుల్లో తిరుమల శ్రీవారిని ప్రత్యేక దర్శనం చేయించడంతోపాటు వారందరిని క్షేమంగా స్వగ్రామాలకు చేర్చేందుకు టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Next Story