ఏర్పాట్ల పరిశీలకు మంత్రుల బృందం పర్యటించనుంది. ఈ నెల 23న సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో శ్రీశైలం శైవ క్షేత్రం శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుమల తిరుపతి తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకుండా చూసేందుకు ముందస్తు జాగత్త్రలు చేపట్టింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ మేరకు శ్రీశైలం దేవాలయ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మరో వైపు ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రుల బృందం కూడా పర్యటన చేయనుంది. ఆరుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక టీమ్‌ సోమవారం శ్రీశైలం దేవాలయ పర్యటన చేయనున్నారు. గత జనవరిలో తిరుమల తిరుపతి తొక్కిసలాట చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనంకు సంబందించిన టికెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాటల్లో ఐదుగురు భక్తులో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే వైకుంఠ ద్వార దర్శనంకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు పర్యవేక్షణ లోపించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందనే వాదన బలంగా వినిపించింది. నాడు అధికారులు కానీ, మంత్రులు కానీ వెళ్లి పర్యవేక్షణ చేసి ఉండి ఉంటే ఆ దుర్ఘటన చోటు చేసుకునేది కాదనే విమర్శలు నాడు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శైవ క్షేత్రంలో ఏర్పాట్ల పరిశీలనకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసదా, హోం మంత్రి వంగలపూడి అనిత, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు మరో మంత్రి బీసీ జనార్థన్‌ రెడ్డి శ్రీశైలం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
ఇదిలా ఉంటే మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 23న స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే ఇది వరకు ప్రభుత్వం తరఫున మంత్రులు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించే వారు. ఈ సారి మాత్రం సీఎం చంద్రబాబే స్వయంగా శ్రీశైలం దేవాలయాన్ని వెళ్లి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలకు స్వయంగా సీఎం చంద్రబాబు వస్తుండటంతో అటు జిల్లా యంత్రాంగం, ఇటు ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, పవిత్ర స్నానం ఆచరించాక మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో పాటుగా శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Next Story