తిరుమలలో 17 నుంచి తిరుప్పావై, మాడభూషి శ్రీధర్ చెబుతున్న విశేషాలు
x

తిరుమలలో 17 నుంచి తిరుప్పావై, మాడభూషి శ్రీధర్ చెబుతున్న విశేషాలు

డిసెంబర్ 16 నుంచి 30 రోజులపాటు తిరుప్పావై గా శ్రీ వేంకటేశ్వరుడు వింటాడు. తరుప్పావై అంటే ఏమిటి? ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ చెబుతున్న విశేషాలు


తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా తిరుప్పావై గురించి ప్రొఫెపర్ మాడభూషి శ్రీధర్ వివరిస్తున్నారు.


గోవిందునికి మేలు కొలుపు

తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు 30 రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. తిరుప్పళ్లియజిచ్చి అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పాశురాలు విన్న తరువాత శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున, మొత్తం 30 వింటాడు. గోదా గీత గోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంధ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి.

photo source: TTD

పొద్దున్నే తిరుప్పావై పారాయణాలు, సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలు ప్రబోధాలు. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వందల మంది వైష్ణవాచార్యులు. మహిళా శిరోమణులు తిరుప్పావై అర్థ తాత్పర్యాలను వివరిస్తూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలలో విస్తృ తంగా తిరుప్పావై పారాయణాలు జరుగుతాయి. ఈ 30 గీతాలను కర్ణాటక శాస్త్రసంగీతకారులు కీర్తనలుగా పాడారు. నాట్యకీర్తనలుగా కూడా పాశురాలు భాసిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా కొన్ని వందల చోట్ల తిరుప్పావై కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. ఈ సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మికోద్యమం.

దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు, బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దాశరథి రంగాచార్యులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఈ పాశురాలను తెలుగులోకి అనువదించారు. జీయర్ స్వామి,శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి, కందాడై రామానుజాచార్య వంటి చాలామంది పండితులు, వేదాంత వేత్తలు తిరుప్పావై అర్థ విశేషాలను అద్భుతంగా వివరించారు. ఇది చాలా గొప్ప వైష్ణవ భక్తి సాహిత్యంగానే కాకుండా, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా కూడా తిరుప్పావై గొప్పకావ్యంగా సంభావిస్తున్నారు.

ఇది గోదోపనిషత్

అది తిరుప్పావై. అంటే సిరినోము. గోపికలను పిలిపించి రప్పించి శ్రీరంగనాథుడిని పూజించి, ఆ నోము ఫలించి శ్రీరంగంలో రంగనాథుడితో లీనమై వెళ్లిపోయిన వారు గోదమ్మ (గోదాదేవి).

తిరుప్పావై ఉపనిషత్తుల సారాంశం. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషద్ అని వర్ణించినట్టే గోదాదేవి తిరుప్పావైని ‘గోదోపనిషత్’ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయంలోనే పఠించాలి. కనుక తిరుప్పావైని కూడా సూర్యాస్తమయం తరువాత అనుసంధానించకూడదని అంటారు. ఓంకారానుసంధానంతో వేదాల అధ్యయనం ఆరంభమవుతుంది. ఓంకారంతోనే ముగిసిపోతుంది.

అందమైన తమిళ కవిత

శంగత్తమిళ్ అంటారు. అంటే అందమైన తమిళ భాష. ధనుర్మాసం సూర్యమానంలో తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. చాంద్రమానంలో తెలుగువారు లెక్కించే మార్గశీర్ష మాసంలో మొదలవుతుంది. ఆమె రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచే నెల ఇది. శంగత్తమిళ్ భాషలో ముప్పదుం అంటే 30 అందమైన తమిళంలో అష్టపాదాల కవితలు. కేవలం ఎనిమిది పాదాల్లో గోద ఎంత అర్థం గుమిగూర్చారో తెలుసుకుంటే ఆ కావ్యం గొప్పతనం అర్థమవుతుంది. పదం పదంలో కథ కనిపిస్తుంది. కథ వలె ఉంటుంది కాని కథ కాదు. కథను గుర్తుకు తెచ్చే పదం. పురాణాల ప్రస్తావన ఉంటుంది కాని పురాణం కాదు. కీలకమైన సంఘటనలవి. రామాయణ ఘట్టాలూ వస్తాయి. భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి.

కాని ఆ విస్తారమైనపురాణాలు పునరుల్లేఖన ఉండదు. భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కాని సిద్ధాంత తత్వ గ్రంధం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధన, సాధన, ఒక పిలుపు, వ్రతం, ఆరాధన, కలిసి ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. 700 పద్యాల భగవద్గీత ఉపనిషత్ సారం అయితే ఉపనిషత్తుల సారం ఈ 30 కవితల గోదోపనిషత్తు.

తిశ్రీకృష్ణుడే చెప్పిన వ్రతం

శ్రీ కృష్ణుడుండేటి అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చి అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి ఏం చేద్దాం అని గోపగోపీజనం అడిగారు. ఆదుకోమన్నారు. దీనికేదైనా వ్రతముంటే చేద్దాం అని గోపకులంలో పెద్దవారు సూచించారట. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో ఈ వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలు వివరించారు. మన వ్రతం పెందల కడ మొదలవుతుంది. కనుక మీరంతా తెల్లవారు ఝామున రావాలి సుమా అని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడా గోవిందుడు. దాంతో మొదలైంది ఈ కావ్య కథావస్తువు.

మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్నఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రిగడిపారు. తెల్ల వారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య, కనుక ముందే లేచి అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన.

నాలాయిరం అంటే

తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగువేల కవితలను నాలాయరమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవైద్యం తరువాత సాగే మంగళా శాసనం. నాలాయిర ప్రబంధ పారాయణం తిరుప్పావై తో ముగుస్తుంది. అంటే ప్రణవనాదంతో ముగుస్తుందని అర్థం. ద్రావిడ (తమిళ) ప్రబంధపారాయణానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణభేదంలేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అనుసరించవచ్చు.

తులసీ వనంలో అవతరించినదామె గోదమ్మ

శ్రీవైష్ణవ సంప్రదాయంలో గోదా దేవి ఒక భక్తి విప్లవ నాయిక. అంతే కాదు. గోదా (మరో పేర్లు ఆండాళ్, ఆముక్త మాల్యద) పూవులు తురిమి బాగుందను చూసుకుని సరే ఇప్పుడిస్తాను అని గోదాదేవి పూవులను వటపత్రశాయికి సమర్పించింది. గోదాదేవి అత్యంత భక్తులైన 12 ఆళ్వార్ లలో ఒకే ఒక్కరు మహిళ. తమిళ భాషలో ఆమెను శూడి(చూటి)క్కొడుత్త (ఈ తమిళ పదానికి, ‘ఆముక్త మాల్యద’ అనే సంస్కృత పదానికి ‘‘ధరించి ఇచ్చిన’’ అని అర్థం) అని వివరణ.

తండ్రి పూలు కోసి, తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూఉంటే తనూ నేర్చుకున్నది గోద. తండ్రి నోటినుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణుకథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. ఆ తులసీ మాల కోదై పూమాలల ద్వారా శ్రీ విల్లి పుత్తూరులోని మూలమూర్తి వటపత్రశాయికి ప్రేమసందేశాలు పంపింది. ఆ కథల్లో అన్ని అవతారాలలో ఉన్న నారాయణుడు రంగనాథుడి రూపంలో ఆమెకు మరింత నచ్చినాడు. శ్రీరంగంలోని పూలరంగడికి మనసిచ్చింది. ఆయనే తన ప్రియుడనీ భర్తఅని బంగారు కలలు కన్నది. వటపత్రశాయిలో రంగడిని చూసుకున్నది. తండ్రీ అల్లినా తానే అల్లినా సరే ఆ పూలమాలలను ముందు తను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తిచెందిన తరువాతనే మూలమూర్తికి పూలబుట్టను పంపేది. ఆమాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది.

ఓరోజు పెరియాళ్వార్ కు తాను తీసుకుని పోయిన పూమాలలలో అమ్మాయి శిరోజం కనిపించింది. శుధ్దిలో లోపం వచ్చిందని బాధపడి ఆ మాలలను స్వామికి సమర్పించకుండానే వచ్చి శిరోజం ఎందుకు వచ్చిందో తెలుసుకుని కూతురిని మందలించాడు విష్ణు చిత్తుడు. మహా అపరాధం జరిగిందనిమదన పడ్డారాయన.

ఆ రాత్రి విష్ణుచిత్తుడికి విష్ణువే కలలో కనిపించి కోదై తాను ధరించిబాగుందో లేదో చూసుకుని బాగుందనుకుని ఇచ్చిన మాల అంటేనే తనకు ఎంతో ప్రియమని కనుక గోదమ్మ ధరించి విడిచిన ఆ మాలలనే తనకు రోజూ సమర్పించాలని నారాయణుడు కోరుతాడు.

విష్ణుచిత్తునికి తన చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోద ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఇక గోద తన కూతురు కాదు తనకు కన్నతల్లి ఆండాళ్ (అంటే నను గన్న తల్లి అని అర్థం) అనీ అర్థమైంది. అప్పడినుంచి విష్ణుచిత్తులు వారు ఆమెను ఆండాళ్ అనే పిలిచేవారు. (మనం కూడా కన్న కూతురిని బంగారు తల్లి అనీ మా అమ్మే అనీ అనుకుంటాం కదా).

ఇక గోదమ్మవారు మాలలు ధరించి బాగోగులు చూడడం, బాగున్నాయని ఆమె అన్నవే వటపత్రశాయికి పంపడం ఆనవాయితీ మారింది.

చరిత్రలో మహావీరుడు, సాహితీ వేత్త శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదారంగనాథుల ప్రణయైక్య కావ్యానికి ఆముక్త మాల్యద అని పేరు.(ఈ తమిళ పదానికి, ‘ఆముక్త మాల్యద’ అనే సంస్కృత పదానికి ‘‘ధరించి ఇచ్చిన’’ అని అర్థం) 30 పద్యాలు పాడి ఇచ్చినారు కనుక ‘‘పాడికొడుత్త నాచ్చియార్’’ అని మరో పేరుకూడా వచ్చింది.



గోదమ్మ దొరికిన ఈ క్షేత్రమే శ్రీవిల్లిపుత్తూరు

సీత వలె గోదమ్మ ఎక్కడినుంచి వచ్చారో తెలియదు. జన్మ లేదు. భూమినుంచి పుట్టిన వారు ఇద్దరూ. సీత భూమినుంచి కనపడింది. చివరకు ఆ భూమిని చీల్చుకని లోపలికి వెళ్లిపోయింది.ఇక గోద నెలరోజుల పాటు దీక్ష వహించి శ్రీ వ్రతం, (సిరినోము, కాత్యాయనీ వ్రతం, తిరుప్పావై) పాటించింది. తాను రాధ అయితే తోటి బాలికలు గోపికలు, విల్లిపుత్తూరే బృందావనం, వ్రేపల్లె, అక్కడ ప్రవహించే నదే యమునానది, వటపత్రశాయే క్రిష్ణయ్య, మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకున్న భాగవత కథలు, ఉపనిషద్ సూత్రాలు, వేదసార వాక్యాలే పాశురాలు. వరిచేలు, తుళ్లిపడే చేపలు, చిలుకలు, కొంగలు, ఆవులు దూడలు, మల్లె పొదలు, తులసీ వనాలు అన్ని బృందావనానికి ప్రతిబింబాలే. తొందరగా లేవవేం తల్లీ, లేచినా తలుపు తీయవా, తలుపు తీసినా లోపలికి రానీయవేమిటి అంటూ కొద్దిగా కోపం చూపే కలహాలు, మందలింపులు, అంతలోనే కలిసిపోయే స్నేహాలు ఇవన్నీ ఆమె పాశురాల్లో ఆశువుగా కురిసాయి. ఒక్కో పాశురం అర్థం తెలిసి చదువుతూ ఉంటే ఆనాటి యమునా తీర విహారి రాసలీలలు చూస్తున్నట్టు తోస్తుంది.



గోదమ్మ దొరికిన చిన్నారి చోటు ఇది


భాగవత భావగత కథాకథనాలను కళ్లకు కట్టే దృశ్యకావ్యం తిరుప్పావై. వ్రతం పూర్తికాగానే ఫలం సిద్ధించింది. రంగడు శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో కన్పించి పల్లకీని శ్రీవిల్లిపుత్తూరుకు పంపి గోదను విష్ణుచిత్తులవారిని తీసుకొని రమ్మన్నాడు. గోదను వివాహం చేసుకున్నాడు. గోద రంగనాథునిలో లీనమైంది. గోదాదేవి కథ ఒక అద్భుతం. ఇది ఎనిమిదో శతాబ్దంలో జరిగిన దివ్య చరిత్ర.

శ్రీరంగనాథుని ప్రేమించిందనడానికి ప్రమాణం ఏమిటి? ఇది రసరమ్యమైనకాల్పనిక సాహిత్యం ఆనాటి నవల అనే వారూ ఉన్నారు. కాదు కాదు ఇది ఆమె ప్రేమకథ, భక్తి ప్రేమగా పరిణమించి, పరిమళించి, శ్రీరంగనితో పరిణయానికి దారితీసిన గాధ అనడానికి ప్రమాణం గోదాదేవి పదిహేనేళ్లప్రాయంలో రచించిన మరో కావ్యం ‘‘నాచ్చియార్ తిరుమొళి‘‘ (అంటే నాయకి రచించిన పవిత్రగీతాలు అని అర్థం).

రంగనాథుని వలచిన గోదాదేవి తన వలపు రంగరించి రంగనికి పంపిన ప్రేమలేఖలు, తన భావావేశ అనురాగ సందేశాలు, పెంచుకున్న ఆశలు, సడలని ఆశయాలు, అప్పుడప్పుడూ అలకలు, చిన్న చిన్న కోపాలు ఇందులోని 143 పాశురాలలో వ్యక్తమవుతాయి.అదొక ప్రణయ కావ్యం. నాచ్చియార్ తిరుమొళి గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత ప్రేమకావ్యమైతే, తిరుప్పావై ఆమెను సశరీరంగా రంగనాథునిలో విలీనంచేసిన మహాద్భుత మోక్షమార్గం. రెండు కావ్యాలూ భక్తిని పరమాత్మపట్ల సమర్పణ భావాన్ని, రంగని వెతుక్కునే తాపత్రయాన్ని వివరిస్తాయి. మోక్షగాములందరికీ అనుసరణీయ మార్గాలను చూపుతాయి.


Read More
Next Story