ఒకప్పుడు ఇద్దరూ స్నేహితులు. మునుపు బద్ద శత్రువులు. నేడు అసెంబ్లీలో వెటకార కలయిక. ఇది మాసీ సీఎం వైఎస్‌ జగన్, ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు వ్యవహారం. అసెంబ్లీ ఏమి జరిగిందంటే..


అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మానసికంగా వేదించడంతో పాటు, సభలో అందరూ హేళనగా నవ్వుకునేలా చేశారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు. ఒకప్పుడు వీరిద్దరూ స్నేహితులు. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచారు. తర్వాత ఏమి జరిగిందో కానీ వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే స్టేజీకి వెళ్లారు. జగన్‌ ప్రభుత్వంలో రఘురామకృష్ణమ రాజుపై కేసు నమోదు చేయగా.. గత ఐదేళ్ల కాలం జగన్‌ కేసులో బెయిల్‌ను రద్దు చేయించేందుకు రఘురామకృష్ణమరాజు కోర్టు మెట్లు ఎక్కి దిగుతూనే ఉన్నారు. ఇంతలో 2024 సార్వత్రిక ఎన్నికలు రావడం, రఘురామకృష్ణమ రాజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం, ఆ పార్టీ అభ్యర్థిగా ఉండి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగి పోయాయి.

సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. జగన్‌ అసెంబ్లీ హాల్లోకి రాగానే ఆయన భుజంపై చేయి వేసి ఏవో రెండు మాటలు మాట్లాడారు రఘురామకృష్ణమరాజు. సభలో జగన్‌ కనిపించగానే హాయ్‌ జగన్‌ అంటూ పలకరింపుతో రఘురామ వెటకారం మొదలైంది. రోజూ అసెంబ్లీకి రావాలి జగన్‌ అని అన్నారు. వెంటనే స్పందించిన జగన్‌ రెగ్యులర్‌గా వస్తాను. మీరే చూస్తారుగా అంటూ తనదైన శైలిలో రఘురామకృష్ణరాజుకు సమాధానం చెప్పారు. జగన్‌ చేతిలో చేయి వేసిన రఘురామకృష్ణమరాజు.. నీవు అధికారంలో ఉండగా.. నన్ను ఎంతగా వేధించావో, నాకిప్పుడు అధికారం వచ్చింది.. నేను ఇప్పుడు ఊరుకుంటానా అన్నట్లు జగన్‌ ముఖం వైపు చూశారు రఘరామకృష్ణమరాజు. తనకు జగన్‌ పక్కనే సీటు వేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను రఘురామ కోరారు. వెంటనే కేశవ్‌ నవ్వుతూ తప్పనిసరిగా అని చేయి ఊపుతూ లాబీలో నవ్వుకుంటూ వెళ్లి పోయారు.
వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ, చేతులు కలుపుకోవడాలు, ఒకరిని ఒకరు చూసుకోవడాలు, వెటకారంగా మాట్లాడుకోవడాలు అన్నీ అసెంబ్లీలో సోమవారం నవ్వులాటగా మారాయి. పైకి కొందరు నవ్వితే, మనసులో మరి కొందరు నవ్వుకున్నారు. మొత్తమ్మీద రఘురామకృష్ణమరాజు, జగన్‌ కలయిక, కరచాలనాలు, సంభాషణలు సోమవారం అసెంబ్లీలో ఒకింత నవ్వులు పుట్టించగా, మరో వైపు ఇరువురి మధ్య నెలకొన్న పగ, ప్రతీకారాలను బహిర్గతం చేసివిగా ఉన్నాయి.
Next Story