ఒక పూట పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన చేయనున్నారు. తిరిగి సాయంత్రానికి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.


గురువారం అర్థరాత్రి వరకు తిరుపతి తొక్కిసలాట ఘటనపై బిజీ బిజీగా గడిపిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు శుక్రవారం వేర్వేరు పర్యటనలు చేయనున్నారు. సీఎం చంద్రబాబు గుంటూరు వెళ్లనుండగా, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం తన నియోజక వర్గమైన పిఠాపురంలో పర్యటించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12లకు గుంటూరులో నరెడ్కో, ప్రాపర్టీషో కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత అక్కడ నుంచి అమరావతి సచివాలయంకు చేరుకుంటారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు మీద అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలపై సాయంత్రం సమీక్షిస్తారు.

మరో వైపు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఒక పూట సుడిగాలి పర్యటన చేయనున్నారు. పర్యటనకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక పూట పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు. గత కొన్ని రోజుల క్రితం ఈ రోడ్డు మీద ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ మెగా ఈవెంట్‌ సందర్భంగా వచ్చి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ రహదారి గుంతల్లో పడి మరణించారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించి, ఆ గుంతలు, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పవన్‌ కల్యాణ్‌ పరిశీలిస్తారు. అక్కడ నుంచి పిఠాపురం నియోజక వర్గం పరిధిలోని కుమారపురంకు వెళ్తారు. ఇక్కడ గోకులాకు పవన్‌ కల్యాణ్‌ ప్రారంభోత్సం చేస్తారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలను నిర్మించారు. తర్వాత ఓ పాఠశాలలో నిర్వహించే సంక్రాంతి సంబురాలకు హాజరు కానున్నారు. పిఠాపురం పాత బస్టాండ్‌ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో వీటిని నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత పిఠాపురంలోనే బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొని తర్వాత రాజమండ్రికి రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడ నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్తారు.
Next Story