ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్భంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడు తిరువళ్లూరు కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్‌ను ఢీకొట్టింది.
తమిళనాడులో శుక్రవారం అర్థరాత్రి ఈ రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 19 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని మూడు కోచ్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. మరో నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సహాయ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో తగలబడ్డ కోచ్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు ఫైరింజన్లతో అదుపు చేశారు. బోగిల్లో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. గాయపడిన ప్రయాణికులను సమీప హాస్పిటల్‌కు తరలించారు. సిగ్నల్స్ సమస్య కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ రైలు మైసూరు – దర్భంగ మధ్య నడుస్తుంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి–పుదుచ్చేరి మెము, పుదుచ్చేరి–తిరుపతి, డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ –తిరుపతి, తిరుపతి – డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌లు, అరక్కం–పుదుచ్చేరి మెము, కడప–అరక్కోణం మెము, డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్– తిరుపతి మెము, తిరుపతి – డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము, అరక్కోణం–తిరుపతి మెము, తిరుపతి–అరక్కోణం మెము, విజయవాడ–డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్, సూళ్లూరుపేట–నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్, నెల్లూరు–సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.
Next Story