
నిరసనలతో దద్దరిల్లిన ‘జగనన్నకు చెబుదాం’
ప్రజల సమస్యల మీద విన్నపాలను సేకరించి వాటి తక్షణ పరిష్కారినికి ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం నిరసనలతో బెడిసికొడుతున్నదా
-జువ్వాల బాబ్జీ
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఆయుధాగారం (Naval Armament Depot:NAD) కోసం భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరుతూ వంకా వారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారి గూడెం,రమనక్కపేట గ్రామాలనుండి గిరిజనులు ప్లకార్డులు పట్టుకుని ‘జగనన్నకు చెబుదా రా’ కార్యక్రమంలో నిరసన తెలిపారు. జగనన్నకు చెబుదాం అనేది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమం. ఇది గత ఏడాది మే నెల నుంచి అమలులో ఉంది. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని వివిధ మండల కేంద్రాలలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుంటారు.
ఇందులో భాగంగా ఈ రోజు, ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండల కేంద్రము లో "జగనన్నకు చెబుదాం"రా కార్యక్రమం జరిగింది. అయితే, కార్యక్రమం ముందుకు ప్రభుత్వాన్ని సవాల్ చేసే ప్రశ్న ఎదురయింది. అందేంటే, తమ భూముల్లో ఆయుధాగారం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జీలుగుమిల్లి మండల రైతులు వ్యతిరేకిస్తున్నారు. వారంతా ఈ రోజు పెద్ద ఎత్తున సమావేశం దగ్గరకు వచ్చారు. నిరసన తెలిపారు.
నిరసన కారులను లోపలకు వెళ్లకుండా గేటు బయట పోలీస్ లు అడ్డుకున్నారు.
ఆయుధాగారం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నగిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించిన తెల్లం రామక్రిష్ణ , సరియం రామ్మోహన్, మడకం వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆయుధాగారం తమ జీవనోపాధి ధ్వంసం చేస్తున్నదని, దీనిని తమ భూముల్లో ఏర్పాటు చేయవద్దని కోరారు. ఈ మండలంలోని గిరిజన రైతుల భూములకు ఒక వైపు పోలవరం నిర్వాసితుల పునరావాసం, మరొక వైపునుంచి ఆయుధాగారం ముప్పుగా మారుతున్నాయని అన్నారు.
‘‘బాగా సాగులో ఉన్న 1196 ఎకరాలను వ్యవసాయ భూమిని కర్మాగారం కోసం సేకరిస్తున్నారు. దీనివల్ల తాము జీవనోపాధి కోల్పోతాము, పెసా చట్ట ప్రకారం మేము దానిని వ్యతిరేకిస్తున్నాం,’’ అని వారు చెప్పారు.
నిరసన కారులకు మద్దతుగా గిరిజన సంఘాలు తో పాటు సి. పి. ఐ.( యం) మరియు న్యూడెమోక్రసీ పార్టీ నేతలు పాల్గొని కలెక్టర్ ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేస్తే గిరిజనులకు కలిగే నష్టం గురించి వివరించారు.
నిరసన కారులతో కలెక్టరు గారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ పట్ల వ్యతిరేకిస్తూ పేసా (Panchayat (Extension to Scheduled Areas) Act 1996) ప్రకారం గిరిజనులు చేసిన తీర్మానాన్ని పరిగణ న లోకి తీసుకుంటామని తెలిపారు.
ఆయుధకర్మాగారానికి వ్యతిరేకంగా పోరాటం
ఆయుధ కర్మాగారం వద్దంటూ గిరిజనులంతా ఒక ఏడాదిగా ఆందోళన చేస్తున్నారు. వామపక్ష పార్టీలు కూడా ఈ గిరిజనులకు మద్దతు నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయుధ కర్మాగారం పేరిట సర్వే పూర్తి చేసింది. దీనితో తమ భూములను ప్రభుత్వం తీసుకుంటుందనే ఆందోళన గిరిజన ప్రాంతాల్లో తీవ్రమయింది. గిరిజన ప్రాంతంలో ఆదివాసీల హక్కులను కాపాడాల్సింది పోయి వారిని నిరాశ్రయుల్ని చేస్తే ప్రయత్నం జరుగుతూ ఉందని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ప్రకారం 1/70, పేసా గిరిజన చట్టాలను కాపాడాలి. పోలవరం ప్రాజెక్టు, జల్లేరు రిజర్వాయరు ప్రాంతాల్లో ఇప్పటికే గిరిజనులు తమ భూములను, జీవితాలను త్యాగం చేశారు. గ్రామ సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా ప్రభుత్వాలు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నాయని గిరిజన నేతలు విమర్శిస్తున్నారు.
పోలవరం నిర్వాసితుల గోడు
తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో నిర్వాసితులైన, జంగారెడ్డి గూడెం మండలం లోని చల్లా వారిగుడెం పునరావాస కాలనీ లో ఉంటున్న ప్రజలు తమకు ఇంతవరకు చట్ట ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదని,వెంటనే ఇవ్వాలని కలెక్టరు గారికి విన్నవించారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, మాకు ఆర్&ఆర్.ప్యాకేజీ ఇవ్వాలని లేదంటే ప్రభుత్వమే తమను ముంపు గ్రామాలకు వెనక్కు పంపించి వేయాలని డిమాండ్ చేశారు. దానికి కలెక్టరు గారు ఫిబ్రవరి నెలలో మీకు రావాల్సిన ఆర్&ఆర్.ప్యాకేజీ డబ్బులు వేస్తారని తెలిపారు.
నిజానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం ,ప్రజల వద్దకు అధికారులు వచ్చి అందరూ అధికారుల సమక్షం లో దరఖాస్తు లు తీసుకొని వాటిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేస్తారు.వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తారు. అయితే ఇటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది ప్రజలు దరఖాస్తు లు తీసుకొని వాటిపై ఏ విధమైన చర్యలు తీసుకోవటం లేదని ఎన్నో కాగితాలు పెట్టా మని , అయినా ఫలితం లేదని, టి.నర్సాపురం మండలం గంగినీడుపాలెం గ్రామం నుండి వచ్చిన గిరిజనులు వాపోయారు.2004 సం. నుండి మేము సాగు చేసుకుటున్న అటవీ పోడు భూములకు,ఆర్. ఓ. ఎఫ్.ఆర్. చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని ఎన్నో సార్లు దరఖాస్తు లు చేశామని ప్రభుత్వ అధికారులు, వచ్చి సర్వే నిర్వహించారు.కానీ పట్టాలు ఇవ్వలేదని చెప్పారు.
అటవీ పోడు భూముల సమస్య లను జువ్వాల బాబ్జీ జాయింట్ కలెక్టర్ బి. లావణ్య కు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు లక్ష్మీ ప్రసన్న కుమార్ , బి. లావణ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ , సూర్య తేజ, ఐ. టి. డి. ఏ. ప్రాజెక్ట్ అధికారి, ఇంకా జంగారెడ్డి గూడెం ఆర్. డి. ఓ.పోలవరం డి. యస్. పి. జీలుగుమీల్లి తహశీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, లు పాల్గొన్నారు.