టీటీడీ చైర్మన్ కు, ఈవో కు మధ్య సమన్వయం లేదు. అందువల్లే ఇటువంటి సంఘటనలు జరిగాయి. అయితే వీరిలో ఎవరిపై చర్యలు ఉంటాయి?


తిరుపతి ఘటన విషాదం టీటీడీ పాలక మండలికి ఛాలెంజ్ లాంటిది. ఇంతటి ఘోరం ఎప్పుడూ శ్రీవారి భక్తులకు జరగలేదు. ఈనెల 8న జరిగిన తొక్కిసలాటలో ఏపీలోని ఉత్తరాంధ్రకు చెందిన వారు నలుగురు చనిపోతే తమిళనాడుకు చెందిన వారు ఇద్దరు చనిపోయారు. కారణాలు ఏమైనా ఇందుకు పూర్తి బాధ్యత టీటీడీ పాలక మండలి వహించాల్సి ఉంటుంది. ఆస్పత్రి వద్ద రోదనలు, వేదనలు, భక్తుల్లో తీవ్ర ఆందోళనలు ఒక్క పక్క ఉంటే ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరైతే సమన్వయంతో పనిచేయాలో వారే సంయమనం కోల్పోయి మాట్లాడుకోవడం, అది కూడా ముఖ్యమంత్రి ఎదురుగానే జరగటం ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అసహనానికి గురిచేసింది.

ఈవోపై చైర్మన్ ఫిర్యాదు

‘చైర్మన్‌ అనే గౌరవం కూడా చూపడం లేదు. ఏ చిన్న విషయం కూడా నాతో చర్చించడం లేదు. మీరైనా కాస్త చెప్పండి’ అని చంద్రబాబుకు చైర్మన్ బీఆర్‌ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరి మధ్య రగడ మొదలైంది. సీఎం ముందే వాదనకు దిగారు. దీంతో సీఎం ఇద్దరినీ వారించి వార్నింగ్ ఇచ్చి తరువాత మిగిలిన విషయాలు మాట్లాడారు. ఇప్పుడు జరిగిందేమిటి? మీరు మాట్లాడేదేమిటి? అంటూ సీఎం ఆగ్రహించడంతో వారి మధ్య మాటల యుద్ధం ఆగింది.

నాయుడు చైర్మన్ అయిన తరువాత జరిగిన రెండో మీటింగ్ లోనే చైర్మన్ కు, ఈవోకు మధ్య స్పర్థలు ఉన్నాయనేది స్పష్టమైంది. ఎందుకంటే మొదటి మీటింగ్ లో చేసిన తీర్మానాలను చదివి వినిపించిది ఈవో శ్యామలరావు. రెండో మీటింగ్ లో చేసిన తీర్మానాలు శ్యామలరావు ఎందుకు వెల్లడించలేదని పాలక మండలిలోని కొందరు తెలిసిన వారిని ప్రశ్నిస్తే వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో భక్తుల బాగోగుల కంటే పాలకవర్గం, అధికారుల మధ్య గొడవలపై దృష్టి సారించేందుకే ప్రభుత్వానికి సరిపోతోందనేది ఎవరికైనా అర్థమవుతుంది.

నీకేం చెప్పడం లేదు.. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా..

చైర్మన్ నాయుడు సీఎంకు ఈవోపై ఫిర్యాదు చేయగానే ఈవోకు కోపం వచ్చింది. నీకేం చెప్పడం లేదు. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా అంటూ ఆగ్రహంతో అన్నారు. దీంతో చైర్మన్, ఈవో మధ్య వాదులాట మొదలైంది. సీఎం ఒక్క నిమిషం పాటు వీరి వాదులాట విని ఆశ్చర్య పోయారు. ఆ సమయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుంటూ మనందరి బాస్ ముందే మీరు ఇష్టం వచ్చినట్లు వాదులాటకు దిగారు. పద్దతేనా? అంటూ ఈవోను మందలించారు. శ్రీవాణి ట్రస్టులో అంశాలు ఏమైనా ఉంటే నోట్‌ రూపంలో ఇవ్వండి. ఇక్కడెందుకు ప్రస్తావిస్తున్నారు అని అభ్యంతరం తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అందరి నోర్లు మూయించారు.

తొమ్మిది ఉదయం భక్తులను రమ్మంటే సరిపోయేది..

వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల కోసం మునిసిపల్ పార్కులో రోజంతా భక్తులను ఉంచే బదులు అందరూ రాత్రి నిద్రపోయి తొమ్మిది తెల్లవారు ఝామున టోకెన్ల కోసం రావాలని చెప్పి ఉంటే సరిపోయేదని, అలా కాకుండా అధికారులు మూర్ఖంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పట్టణంలో దేవస్థానానికి సంబంధించిన ఎన్నో భవనాలు భక్తులు తలదాచుకునేందుకు ఉన్నాయి. ఆ భవనాలు కాదని ఎందుకు మునిసిపల్ పార్కులో ఉంచి గేట్ వెయ్యాల్సి వచ్చిందనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. పర్యవేక్షకులుగా ఉన్న పోలీస్ అధికారి కానీ, టీటీడీ అధికారి కానీ ఈ చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించలేదనే చర్చ కూడా ఉంది.

అందుకే పోలీస్ అధికారులను ప్రథమ నిందితులుగా పేర్కొంటూ అర్బన్ జిల్లా ఎస్పీని ముందుగా బదిలీ చేశారు. ఎస్పి సుబ్బరాయుడు సీఎంవోతో నేరుగా యాక్సెస్ పెట్టుకుని స్థానిక నాయకులను లెక్క చేసే వారు కాదని, ఎమ్మెల్యేలకు కనీస విలువ ఇచ్చే వారు కాదని, అందువల్ల ఆయనను బదిలీ చేయాల్సిందేననే డిమాండ్ ముందు నుంచీ ఉందని తెలుగుదేశం పార్టీ వారే చెబుతున్నారు. ఆయన ఖర్మ కాలి ఈ సంఘటన సుబ్బరాయుడును ఇక్కడి నుంచి పంపించేందుకు ఉపయోగపడిందని పలువురు అంటున్నారు. ఈవోతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి సమన్వయం చేసుకుని ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

ఈవోను బాధ్యుడిని చేయక తప్పటం లేదా?

పాలక మండలి తప్పుడు నిర్ణయాల వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందనే విమర్శ ఉంది. అయితే చైర్మన్ తో సమన్వయంగా వ్యవహరించడంలో ఈవో శ్యామలరావు ఫెయిల్ అయ్యారని సీఎం భావించినట్లు సమాచారం. అందువల్ల సంఘటనకు ప్రధానంగా సమన్వయ లోపం కారణం అని, అందుకు ఈవో బాధ్యత వహించాల్సి ఉంటుందనే కారణం చూపించి ఈవోను అక్కడి నుంచి బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పైగా ఈవో కాని, చైర్మన్ కానీ నేరుగా సీఎంవోతో సంబంధాలు ఉన్న వారు కావడంతో ఎవరికి వారు ఇగో ఫీలింగ్ లో ఉన్నారనే చర్చ కూడా ఉంది. అందువల్లనే నీకెంతో నాకంత అనే అహంతోనే ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితికి వచ్చారని టీటీడీ పాలకవర్గం వారే చెబుతున్నారు.

ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న వారి విషయంలో ఎటువంటి చర్చ లేదు. జేఈవో గౌతమిని బదిలీ చేశారంటే.. అందులో ఒక లాజిక్ ఉంది. దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల దర్శనాలకు సంబంధించిన అధికారాలన్నీ జేఈవో వద్దనే ఉంటాయి. దర్శనాలు ఎలా చేయించాలి. దర్శనాల కోసం వచ్చే వారికి ఎటువంటి హాని జరగకుండా ఎలా చర్యలు తీసుకోవాలనే అంశంలో ముందు జేఈవోనే చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జేఈవో పట్టీపట్టనట్లు వ్యవహరించారనే కారణంతో ఆమెను బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి అయిన శ్రీధర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయం స్పష్టమైంది. ఎస్పితో ఆయన ఎందుకు టచ్ లోకి వెళ్లలేదు. ఆయన ఆలయ అధికారులను, ఎస్పీని సమన్వయం చేయటంలో కీలక పాత్ర తీసుకోవాలి. అలా కాకుండా వ్యవహరించి నందునే ఆయనపై కూడా బదిలీ వేటు పడింది.

చైర్మన్ బిఆర్ నాయుడుకు ఎటువంటి ఢోకాలేదు

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఎటువంటి ఢోకా లేదు. ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశం లేదు. సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయనకు వచ్చిన ఢోకా ఏమీ లేదనేది స్పష్టమైంది. పైగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం ముందు ఈవో శ్యామలరావును మందలించారు తప్ప నాయుడు గురించి ఒక్క మాట కూడా అనలేదు. అందువల్ల పాలక మండలి ఎన్ని తప్పులు చేసినా ముఖ్యమంత్రి రక్షించే బ్యాచ్ లో ఉన్నందున ఎవ్వరూ చేయగలిగింది లేదు.

Next Story