సారీ చెబితే చచ్చిపోయిన భక్తులు లేచొస్తారా..


తమ వారిని కోల్పోయి బోరుమంటున్న వారి నెత్తిన రాయితో మోదినట్లుంది టీటీడీ పాలక మండలి వ్యవహారం. బాధలో ఉన్న వారికి కాస్త మనసు కుదుట పడేలా చేయాలంటే ఓదార్పు అవసరం. లేదంటే వారి వేదన ఇంకా పెరుగుతూనే ఉంటుంది. శుక్రవారం తీసుకున్న పాలక మండలి నిర్ణయాలు అభినందించాల్సినవే. కానీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన ఒక వ్యాఖ్యను మాత్రం భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ‘క్షమాపణ చెబితే చచ్చిపోయిన భక్తులు లేచి రారు కదా? అని వ్యాఖ్యానించారు. అయితే తప్పు జరిగిందని చెప్పటం విశేషం.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డిమాండ్ ను పరిశీలిస్తే చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు లు తప్పకుండా చనిపోయిన భక్తుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. చెబితే తప్పేముంది, నేను కూడా భక్తులందరికీ క్షమాపణ చెప్పాను. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి కాబట్టి. ఆ బాధ్యత పాలక మండలి మరిచింది. చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులంతా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆయన మాటపై స్పందించిన టీటీడీ చైర్మన్ పై విధంగా వ్యాఖ్యానించారు.

ఈ ప్రత్యేక సమావేశం కూడా పాలక మండలి వారంతకు వారు నిర్ణయాలు ప్రకటించి భక్తులను శాంతింప చేసేందుకు కాదని తేలిపోయింది. ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించాలని ఆదేశించినందున నిర్వహిస్తున్నామని చైర్మన్ చెప్పటం విశేషం. పాలక మండలి అస్తవ్యస్థ నిర్ణయాలు తీసుకోకుండా మొదటి నుంచి వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం ఇచ్చిన టోకెన్స్ ఎలా ఇచ్చారో ఒకసారి మననం చేసుకుని ముందుకు అడుగులు వేసి ఉంటే ఈ తప్పులు జరిగేవే కాదు.

భక్తులందరినీ రాత్రంతా మునిసిపల్ పార్క్ లో ఉంచేందుకు నిర్ణయం తీసుకోవడమే పాలక మండలి చేసిన పెద్ద తప్పు. అక్కడ ఇన్ చార్జ్ లు ఉన్నారు. వారు తప్పు చేశారని తప్పించుకునేందుకు పాలక మండలి ప్రయత్నిస్తే దానిని భక్తులు ఎవ్వరూ సమర్థించే పరిస్థితి లేదు. తొమ్మిదో తేదీ ఉదయం టోకెన్లు ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఎప్పటి లాగే భక్తులు టీటీడీ వారు తిరుపతిలో నిర్మించిన భవనాలో ఉంటే తెల్లవారు ఝామున వచ్చి తీసుకునే వారు అలా కాకుండా అనాలోచిత నిర్ణయాలు భక్తుల ప్రాణం మీదకు తెచ్చాయి. నిజానికి అధికారులను, ఉద్యోగులను ఎందుకు నిందించాలి. పాలక మండలి తీసుకునే నిర్ణయాలను వారు కేవలం అమలు చేసే వారు మాత్రమే అనే విషయం గుర్తిస్తే చాలు.

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్ కు నేను స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యంతోనే ఈ విధమైన వ్యాఖ్య చేసినట్లు తనను తాను సమర్థించుకునేందుకు టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ద్వారా ప్రకటన విడుదల చేయించారు. పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారేమోననే భయం కూడా ఈ ప్రకటనలో కనిపించింది. ముందుగా మేమే ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పామని ఆ ప్రకటనలో తెలిపారు.

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సమావేశంలో చేసిన కామెంట్ దారుణమైంది. భక్తులను ఓదార్చాల్సిన చైర్మన్ వారి మనసులు మరింత బాధించే విధంగా చచ్చిపోయిన భక్తులు లేచొస్తారా? అనటం ఎంత అమానవీయం అని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జి రాంబాబు అన్నారు.

శ్రీ వెంకటేశ్వరస్వామి పై భక్తి ఉన్నట్లైతే చైర్మన్ బీఆర్ నాయుడు చనిపోయిన భక్తుల కుటుంబాల వారి ఇంటింటికీ వెళ్లి క్షమాపణ చెప్పాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ అన్నారు. ఒక వైపు బాధలో ఉన్న వారిని మరింత బాధపడే విధంగా మాట్లాడటం సామాజిక స్పృహ ఉన్న చేయాల్సిన పనికాదన్నారు.

చైర్మన్ చేసిన కామెంట్ పై టీటీడీ సభ్యులు, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి కామెంట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పెడరల్ నుంచి ఫోన్ చేశానని, నా పేరు పలానా అని, మీకు మాట్లాడే సమయంలేకుంటే వాట్సాప్ లో కామెంట్ ఇచ్చినా తీసుకుంటామని మెసేజ్ చేసినా ఆయన స్పందించలేదు.

Next Story