తిరుమల శ్రీవారి లడ్డూ ధర తగ్గిందన్న వార్తల్లో వాస్తవమెంత!
x

తిరుమల శ్రీవారి లడ్డూ ధర తగ్గిందన్న వార్తల్లో వాస్తవమెంత!

తిరుమల శ్రీవారి లడ్డూ ధర తగ్గిందా? సేవా టికెట్ల ధరలు కూడా తగ్గించారా? దీనిపై టీడీపీ ఏమంటోంది.


తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి భక్తులు తహతహలాడుతారు. లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. ఇంతటి ప్రాధాన్యత శ్రీవారి ప్రసాదాలకు ఉంది. అయితే లడ్డూ ధర, రూ.300 టికెట్ ధరను కూడా సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తగ్గించుకుని ప్రచారం జరుగుతోంది. అందులో ప్రస్తుతం రూ.50 ఉన్న లడ్డూను ఇకపై రూ.25 రూపాయలకు, రూ.300 ఉన్న దర్శనం టికెట్‌ను రూ.200కు తగ్గించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై టీటీడీ యంత్రాంగం స్పందించింది. ఎందుకంటే.. ఈ తగ్గింపులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ పీఆర్ఓ తలారి రవి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలరావును టీటీడీ ఈఓగా నియమించారు. తిరుమలలో యాత్రికుల వసతి, దర్శనం, అన్నప్రసాదాలు, క్యూ లైన్ల క్రమబద్దీకరణ వంటి అంశాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు తిరుమలలో లడ్డూ ప్రసాదం, రూ.300 దర్శనం టికెట్ ధరను తగ్గించారని ప్రచారం చేశారు. దీనిపై టీటీడీ తీవ్రంగా స్పందించింది.

‘‘శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ధరలను తగ్గించినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ప్రత్యేక దర్శనం కోసం దళారీలను సంప్రదించొద్దు. ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమాలలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొన్ని టికెట్లు కేటాయించడం జరిగింది’’ అని టీటీడీ తన ప్రకటనలో వివరించింది.

అంతేకాకుండా ‘‘భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉన్నది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. అయితే కొందరు దళారులు సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేస్తామని, అందుకోసం ధర కాస్త ఎక్కువ అవుతుందని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అటువంటి వారిని గుర్తించి, వారిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి దళారీల మోసపూరిత మాటలు నమ్మి ఎవరూ మోసపోకండి’’ అని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ.

ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనునిత్యం సుమారు 60-90 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. సామాన్య భక్తుల ద్వారా తిరుమల శ్రీవారికి హుండీ కానుకల రూపంలో రూ.3 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల ఆదాయం లభిస్తుంటుంది. వీరందరికీ అవసరమైన లడ్డూలన్నీ అందుబాటులో ఉంచే విధంగా టీటీడీ పోటులో కార్మికులు శ్రమిస్తుంటారు. దాదాపు 308 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లో దళారీ వ్యవస్థను నియంత్రించడం కోసం 2009 ప్రాంతంలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో రూ.25 లడ్డూ ధరను రూ.50లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇదే ధరకు లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంది.

Read More
Next Story