రాష్ట్రంలోని నియోజకవర్గానికి ఆరు ఆలయాల వంతున వెయ్యి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందిస్తాం అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఇది దళితగోవిందానికి కొనసాగింపుగానే ఉంది.
వైసీపీ ప్రభుత్వంలో శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణ ట్రస్టు (Srivani Trust for the Construction of Sri Venkateswara Temples Srivani) దళిత, గిరిజన, మత్స్యకారుల కాలనీల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధుల సేకరణకు టీటీడీ ద్వారా శ్రీకారం చుట్టారు. దీనికోసం 2018 ఆగస్టులో శ్రీవాణి ట్రస్టు ఏర్పాటుకు టీటీడీ బోర్డులో 338 తీర్మానం ద్వారా ఆమోదించారు. ఇది 2019 అక్టోబర్ నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్రస్టు ద్వారా రోజుకు రెండు వెల టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచింది. 400 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేస్తున్నారు.
శ్రీవాణి టికెట్ ద్వారా శ్రీవారి దర్శనం కావాలనుకునే యాత్రికుడు రూ. 11,500 చెల్లించాలి. అందులో రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తారు. మిగతా రూ. పది వేలు ట్రస్టుకు జమ అవుతుంది. ఈ నిధులతో దళిత, గిరిజన, మత్స్యకారుల కాలనీల్లో నిర్ణీత స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు, 15, 20 లక్షల వరకూ టీటీడీ బోర్డు నిధులు మంజూరు చేస్తోంది.
2025 జూలై నెలలో జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ లో ఇసుక, సిమెంట్, ఇనుము ధరలు పెరిగిన కారణంగా ప్రతి స్లాబ్ బడ్జెట్లో రూ. ఐదు లక్షలు అదనంగా మంజూరుకు బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలోని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పూర్తయిన 320 ఆలయాలకు టీటీడీ నుంచి మైక్ సెట్ అందించాలని నిర్ణయించినట్లు కూడా ఆయన వెల్లడించారు.
"దళితవాడల్లో కావాల్సింది. గుడులు కాదు. బడులు అవసరం. దళిత, గిరిజనులకు అక్షరజ్ణానం పెంచుకునే అవకాశం కల్పించండి మహాప్రభో" అని ఆర్పీఐ అంజయ్య డిమాండ్ చేశారు.
"దళిత ఆదివాసీలను అర్చకులను చేయడానికి గుండు గీయించి, గోచీ కూడా పెట్టించారు. మరి జంజెం ( యజ్ణోపవీతం) ఎందుకు ఇవ్వలేదు. ఇవన్నీ కాదు సార్... అణగారిన వర్గాలను జ్ణానవంతులను చేయడానికి పాఠశాలలు ప్రారంభించండి. మెరుగైన చదువు అందించండి" అని ఆర్పీఐ అంజయ్య డిమాండ్ చేశారు.
వెయ్యి కోట్ల నిధులు
శ్రీవాణి ట్రస్టు అందుబాటులోకి వచ్చిన 2019లోనే 26.25 కోట్ల రూపాయలు విరాళంగా జమ అయింది. 2020 లో 70.21 కోట్లు, 2021లో 176 కోట్లు నిధులు సమకూరాయి. ఈ ట్రస్టుపై విమర్శలు చెలరేగడంతో 2023 జూన్ 23వ తేదీ మాజీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి శ్వేతపత్రం ప్రకటించారు.
"జూన్ 31 నాటికి 860 కోట్ల రూపాయలు జమ అయింది. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు 93 కోట్ల రూపాయలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఒకో ఆలయానికి రూ. పది లక్షల వంతున 2,273 ఆలయాల నిర్మాణం, దేవాదాయ శాఖలోని 1953 ఆలయాలు, ఏపీ, తెలంగాణా, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని 127 ఆలయాలకు 139 కోట్లు కేటాయించాం" అని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
శ్రీవాణి ట్రస్టుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే జమ అయినట్లు టీటీడీ అధికారవర్గాల సమాచారం.
"ఈ సొమ్ముతో మత మార్పిడులను నివారించే ప్రధాన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోని దళితవాడల్లో ఐదు నుంచి ఆలయాల నిర్మిస్తాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ప్రకటించారు.
దీనిపై సీపీఎం నేత కందారపు మురళీ ఏమంటారంటే..
"ఇదొక అంటరానితనం మినహా మరొకటి కాదు. టీడీపీ కూటమిలో భాగమైన టీటీడీ పాలక మండలి కూడా బీజేపీ అజెండాను అమలు చేస్తోంది. అని మురళీ వ్యాఖ్యానించారు.
"దళితులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలకు రావద్దు. వారి వాడలోనే ఆలయానికే పరిమితం కావాలి" అనే స్పష్టంగా చెబుతున్నట్లే ఉందని మురళీ ఆరోపించారు.
టీటీడీ చైర్మన్, తిరుపతి ఈఓ, తిరుమల జేఈఓగా దళిత, ఆదివాసీలను నియమించకుండా, మతం పేరుతో ఈ తరహా దాడి సరైంది కాదని మురళీ అభిప్రాయపడ్డారు.
టీటీడీ పాలక మండలిలో దళితులకు నామమాత్ర ప్రాధాన్యత దక్కుతోంది. పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిన దళితులకు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మాల సామాజికవర్గానికి చెందిన యాదయ్యకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్. రాజు (మాదిగ), కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి (మాల) మాత్రమే అవకాశం దక్కింది. అన్ని పదవువులకు రిజర్వేషన్లు పాటిస్తున్న ప్రభుత్వం టీటీడీలో ఆరుగురు ఎస్సీలు, నలుగురు ఎస్సీలకు అవకాశం ఇవ్వడం లేదని ఆర్పీఐ అంజయ్య ప్రశ్నించారు.