తిరుపతి లడ్డూ: సీఎంకి జై కొట్టిన టీటీడీ, బాబును చీల్చిచెండాడిన జగన్
x

తిరుపతి లడ్డూ: సీఎంకి జై కొట్టిన టీటీడీ, బాబును చీల్చిచెండాడిన జగన్

లడ్డూ వివాదంపై ఒకే రోజు మూడు ప్రెస్ మీట్లు... ఎవరి వాదన వారిదే! మధ్యలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నివేదిక కోరడం గమనార్హం.


తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ముసిరిన వివాదం పూటకో మలుపు తిరుగుతోంది. ఒకే రోజు మూడు ప్రెస్ మీట్లు, రెండు నివేదికలతో వేడెక్కింది. పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ పాలక మండలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడువైపు నిలిచింది. కల్తీ పరీక్షా సౌకర్యాలు టీటీడీకి లేకపోవడంతో నెయ్యి సరఫరాదారులు దోపిడీకి పాల్పడ్డారని ప్రకటించింది. మరో మాజీ ప్రధాన అర్చకులు, ఆలయ గౌరవ సలహాదారు రమణదీక్షితులు కల్తీ నిజమే అయిఉండవచ్చునంటూ పరోక్షంగా చంద్రబాబును సమర్థించగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. చంద్రబాబు తన రాజకీయం కోసం పవిత్ర దేవాలయ ప్రసాదాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. మరోపక్క, కేంద్రప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ వ్యవహారమై తక్షణమే నివేదికను పంపాల్సింది ఆదేశించారు.

సరిగ్గా ఈ వివాదం ముదురుతున్న సమయంలోనే నెయ్యిని సరఫరా చేసిన ఆల్ఫా కంపెనీ తాము సరఫరా చేసినపుడు నెయ్యి బాగానే ఉందని, ఆ తర్వాతే ఏదో జరిగిందన్న అనుమానం వచ్చేలా ఒక రిపోర్టును విడుదల చేయగా ఎన్డీడీసీ నుంచి వచ్చిన నివేదికను టీటీడీ ఇ.వో. శ్యామరావు మీడియాకు వివరించారు. మొత్తం మీద భక్తుల నమ్మకమే పునాదిగా సాగాల్సిన స్వామి వారి ప్రసాదం రాజకీయ రంగు పులుముకునే సూచనలు కనిపిస్తున్నాయి.
జూలై 17న ఎంపిక చేసిన శాంపిల్స్‌లో ఎద్దు కొవ్వు, పందికొవ్వు నమూనాలు ఉన్నట్టు ఎన్.డి.డి.సీ. లేబొరేటరీ పరీక్షల్లో గుర్తించినట్లు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు చెప్పారు. "టీటీడీ వద్ద ల్యాబ్ లేకపోవడం, పరీక్ష కోసం ఇతర లాబ్ లపై ఆధారపడటం వల్ల నాణ్యత లోపించింది" అన్నారు. శాంపిల్స్‌లో పంది కొవ్వు ఉన్నట్లు ఒక ల్యాబ్ లో తేలిందని చెప్పడంతో చంద్రబాబు చేసిన ఆరోపణలకు బలం చేకూరింది. "నాలుగు నివేదికల్లో ఒకే విధమైన ఫలితాలు వచ్చాయి. దీంతో సరఫరాలను నిలిపివేశాం. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టింగ్‌ లో పెట్టాం. చట్టపరమైన చర్యలను ప్రారంభించాం" అన్నారు శ్యామలరావు. అంటే దీనర్థం ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన కాంట్రాక్టరుతో ఒప్పందం కుదిరే నాటికి వైసీపీ ప్రభుత్వం నియమించిన వారు టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు. దాంతో ఆ వైపు కూడా చర్యలు తప్పేలా లేవు అని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ వ్యవహారమై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించక తప్పలేదు. రాజకీయ లబ్ధి కోసం మతపరమైన సెంటిమెంట్‌లను ఉపయోగించుకోవడంలో చంద్రబాబు దిగజారారని విమర్శించారు. టీటీడీ వ్యవస్థలను ప్రశంసించాల్సింది పోయి ఆలయ ప్రతిష్టను,భక్తుల సెంటిమెంటును దెబ్బతీసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే వ్యవహరించడం దివాలాకోరు రాజకీయంగా అభివర్ణించారు. మొత్తం మీద లడ్డూ చుట్టూ చెలరేగిన వివాదం వేడెక్కింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు లడ్డూలలో కల్తీ విషయాన్ని ప్రస్తావించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేపనూనెలతో కూడిన నాసిరకం నెయ్యిని వాడారని, అందుకు ఆనాటి టీటీడీ పాలకవర్గం అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో దుమారం చెలరేగింది. గుజరాత్‌లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నుంచి నివేదికలను తెప్పించారు. ఆ సంస్థ నిగ్గుతేల్చిన విషయాలు నెయ్యిలో కల్తీని సూచిస్తున్నాయి. చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వై.వి. సుబ్బారెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. దేవుడి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని చంద్రబాబును కోరారు. మరో నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్సార్ సీపీ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఈ వివాదంపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటైన తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రతపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వైసీపీ తరఫు న్యాయసలహాదారు కూడా ఈ వ్యవహారమై సీబీఐ దర్యాప్తు కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఆరోపణలు నిజమని రుజువైతే అది తీవ్రమైన నేరమే అవుతుంది.
సరిగ్గా ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీపై కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివేదిక కోరారు.
ఆల్ఫా కంపెనీ ఏం చెబుతోంది?
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి వివాదంలో ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కంపెనీ అత్యధికంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా.. టీటీడీకి అత్యధికంగా ఈ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది. అల్ఫా కంపెనీ బటర్ ఆయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి ఆలయ పోటుకు సరఫరా చేసేదని తెలుగుదేశం ఆరోపించింది. టెండర్లలో ఒక ధర కోట్ చేస్తే, రివర్స్ టెండర్లలో మరింత తక్కువకు కోట్ చేసి టెండర్లను దక్కించుకున్నట్లు తేలింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టెండర్లలో కేజీ నెయ్యి రూ. 610 కిగానూ.. రివర్స్ టెండర్లలో రూ. 424కి మాత్రమే సరఫరా చేస్తామని ఆ కంపెనీ అంగీకరించింది. అంటే కేజీకి రూ.190కిపైగా తగ్గింపు ఇచ్చి టెండర్లు పొందింది. 2022లోనూ ఇలాగే చేసింది. టెండర్లలో రూ. 414 కు కోట్ చేసి.. రివర్స్ టెండర్లలో రూ. 337 కు కోట్ చేసి దక్కించుకున్నట్లు రికార్డుల్లో ఉంది. దీంతో ఆల్ఫా కంపెనీ చుట్టూ వివాదం అల్లుకుంది.
అయితే ఈ కంపెనీ కల్తీ నెయ్యి ఆరోపణలను తోసిపుచ్చింది. తాము ముమ్మాటికీ నిఖార్సైన నెయ్యినే సరఫరా చేశామని సెప్టెంబర్ 20న ఒక ప్రకటన చేసి ప్రస్తుత టీటీడీ ఇవో వాదనను ఖండించడం గమనార్హం.
భక్తుల విశ్వసనీయత, ఆలయ పవిత్రతను పణంగా పెట్టి సాగుతున్న ఈ వివాదానికి ఎటువంటి ముగింపు దొరుకుతుందో ఇంకా స్పష్టం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాదనను ఆలయ పాలకవర్గం సమర్ధిస్తుండంతో ఎవరో ఒకరిపై వేటు పడుతుందా ? లేక నిష్పక్షపాత దర్యాప్తు కోసం సీబీఐ ని ప్రభుత్వమే ఆశ్రయిస్తుందా అనేది మున్ముందు గాని తేలదు.
Read More
Next Story