శ్రీవారి సన్నిధిలో 'అన్న' దోపిడీ
తిరుమలలో ఆహారభద్రతపై టీటీడీ దృష్టి సారించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లపై చర్యలకు సిద్ధమైంది.
తిరుమలలో ఆహారభద్రతపై టీటీడీ దృష్టి సారించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లపై చర్యలకు సిద్ధమైంది. హోటళ్లలో అపరిశుభ్రత, నాణ్యతాలోపంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ గురువారం తిరుమలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు, ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రతపై తనిఖీలు చేశారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళిపోయినట్లు వారు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉండడాన్ని గమనించారు.
భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట
రైడ్స్ అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ... కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారని, యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఇ- మెయిల్ ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్‌ఎస్‌డి బృందంతో కలిసి హోటల్‌ను ఆకస్మికంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్‌లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
తిరుమలలోని హోటల్స్ పరిశుభ్రమైన, రుచికరమైన ఆహార ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో, భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు ఈవో తెలియజేశారు. హోటల్ లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని శ్యామలరావు చెప్పారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్ మాట్లాడుతూ.. తనిఖీలలో ఈ హోటల్‌లో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలను పాటించనట్లు తెలిందన్నారు. హోటల్‌లో కుళ్ళిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మా తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు. ఇక్కడి వంటగదిని వెంటనే మూసివేస్తామని, క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, హోటల్ పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మొబైల్ ల్యాబ్ ప్రారంభం:
తనిఖీల అనంతరం ఈవో శ్యామలరావు, ఎఫ్‌ఎస్‌డి డైరెక్టర్‌తో కలిసి మొబైల్ ల్యాబ్, "ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్"ను ప్రారంభించారు. ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు. దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు.
కాగా, ఈ తనిఖీల్లో ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్ విజయ లక్ష్మి, ఎలక్ట్రికల్ డీఈ రవిశంకర్ రెడ్డి, రెవెన్యూ ఏఈవో చౌదరి, తిరుపతి జిల్లా ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహియుద్దీన్, పశ్చిమ గోదావరి జిల్లా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్ పాల్గొన్నారు.