తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును ఆ పదవి నుంచి తప్పిస్తూ టిటిడి పాలకమండలి తీర్మానించింది.


( ఎస్‌.ఎస్‌.వి భాస్కర్‌ రావ్‌)

వయోపరిమితి ప్రామాణికంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న కొదరు అర్చకులను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. అందులో ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు కూడా ఒకరు. అయితే వైఎస్‌ఆర్సిపి అధికారం లోకి రాగానే రమణ దీక్షితులుకు గౌరవ స్థానం ఇస్తూ అర్చకునిగా నియమించింది. అదే ప్రభుత్వంలోనే ఆయనకు ఉద్వాసన పలకడం విశేషం.
ఈవో ధర్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యం..
శ్రీవారి నిత్య కైంకర్యాలు, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పై ఆయన చేసిన వీడియో వైరల్‌ కావడంతో, రమణ దీక్షితులును గౌరవ ప్రధాన అర్చకుని పదవి నుంచి తొలగిస్తూ, టీటీడీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో సోమవారం జరిగిన పాలకమండలిలో తీర్మానం చేశారు. ఈ విషయాన్ని టిటిడి చైర్మన్, భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయన్నారు.
చంద్రబాబు జమానాలో ఒకసారి..
టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ అర్చకుల పదవీ విరమణపై 2018 మే 16న జరిగిన పాలక మండలిలో.. పదవీ విరమణ వయస్సును నిర్ణయించి, ఆ వయస్సు దాటిన వారిని పదవీ విరమణ చేయవలసిందిగా ఉత్తర్వులను జారీ చేసింది. అప్పుడు రమణ దీక్షితులతో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయారు. నలుగురు ప్రధాన అర్చకులతో పాటుగా ఇంకొంతమంది అర్చకులు పదవీ విరమణ చేశారు. ఆ తరువాతి కాలంలో కూడా అదే అనవాయితీ కొనసాగింది. అయితే 2018లో టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులను, వయసు మళ్లిన వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు వయోభారం వల్ల స్వామి వారికైంకర్యాలు చేయలేరనే ఉద్దేశంతో పాలకమండలి కోర్టు తీర్పును అమలు చేయలేదు.
వైయస్సార్సీపి ప్రభుత్వంలో నియామకం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పాలకమండలి ఆ అర్చకుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. టిటిడి నిర్ణయంతో గతంలో రిటైర్‌ అయిన రమణదీక్షితులు తిరిగి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో విధుల్లో చేరారు.
అనుచిత వ్యాఖ్యలతో వివాదం
తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాల్లో లోటుపాట్లు ఉన్నాయని ఆరోపించడంతోపాటు, టీటీడీ ఈవో క్రిస్టియన్‌ అని కూడా గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగాయని టీటీడీలో చాలామంది క్రిస్టియన్లు ఉండడమే పెద్ద సమస్య అని తీవ్రమైన ఆరోపణలు చేసిన వీడియో వైరల్‌ కావడం తెలిసిందే. ఈ వీడియోలోని అంశాలు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ బీసీయూ అధినేత రామచంద్ర యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు రామచంద్ర యాదవ్‌ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గతంలో కూడా రమణ దీక్షితులు టీటీడీపై అనేక సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ అదే తరహాలో రమణ దీక్షితులు నుంచి ఆరోపణలు పునరావృతం కావడంతో స్పందించిన టిటిడి అధికారులు ప్రస్తుత ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ద్వారా వివరణ ఇప్పించారు. అదే సమయంలో రమణ దీక్షితులు ట్విట్టర్‌ వేదికగా ‘ఆ మాటలు తనవి కావు. టీటీడీ యంత్రాంగం పట్ల తనకు అపార గౌరవం ఉంది’ అని వివరణ ఇచ్చారు.
టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పై చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సోమవారం జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో రమణ దీక్షితులను తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుని బాధ్యత నుంచి తప్పిస్తూ తీర్మానం చేశారు.
Next Story