
Y.V. Subba Reddy
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డికి ఉచ్చు బిగిస్తున్న సీబీఐ సిట్
టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం, 13 లేదా 15వ తేదీన విచారణకు హాజరవుతానన్న సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసు విచారణ మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరిన టీటీడీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారణకు ఈరోజు(మంగళవారం) పిలిచింది. సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని గంటలుగా ధర్మారెడ్డిని సీబీఐ డీఐజీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు ధర్మారెడ్డిని విచారించనున్నారు సిట్ అధికారులు.
వైసీపీ అధికారంలో ఉండగా టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయంలో విచారణకు ఆయన హాజరయ్యారు. ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నెయ్యి కల్తీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ఆయన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది.
రేపు(బుధవారం) కూడా ధర్మారెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే, సిట్ విచారణ నుంచి బయటకు వెళ్లారు ధర్మారెడ్డి. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడటానికి ఆయన వచ్చారు. ఆ సమయంలో ధర్మారెడ్డికి శ్రీవారి లడ్డూ ఇచ్చేందుకు ప్రయత్నించారు జనసేన నేత కిరణ్ రాయల్. ఆయన శ్రీవారి లడ్డూని ధర్మారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేయగా లడ్డూ తీసుకోకుండా అక్కడ నుంచి ఆయన వెళ్లినట్లు తెలిసింది.
కల్తీ నెయ్యి కేసులో విచారణకు హాజరు కావాలని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బా రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 13వ తేదీన లేకపోతే 15వ తేదీన హాజరవుతానని సమాధానం ఇచ్చారు సుబ్బారెడ్డి. తాను లక్నోకు వెళ్తున్నందున 15వ తేదీన విచారణకు హాజరవుతానని సుబ్బారెడ్డి సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న గతంలోనే అరెస్టు చేశారు. అప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్ర కోణాలను సిట్ ప్రస్తావించింది. 2022 టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించారు. నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశారు. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు భోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ డెయిరీపై అనర్హత వేటు వేసేలా చిన్నఅప్పన్న కుట్రకు తెరలేపారు. డెయిరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. డెయిరీపై అనర్హతవేటు వేసేలా అజ్ఞాతవ్యక్తులతో పిటిషన్లు వేయించారు. చిన్నఅప్పన్న కుట్రతో భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను టీటీడీ నిలిపివేసింది. ఆ స్థానంలో ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థ ప్రవేశించి.. రూ.138 ఎక్కువ కోట్ చేసింది. పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకుంది. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను సిట్ 24వ నిందితుడిగా చేర్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డిని విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
Next Story

