కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. అప్రమత్తమైన ఆంధ్ర
x

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. అప్రమత్తమైన ఆంధ్ర

భారీ వర్షాల దెబ్బకు దేశంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు నీరు సమృద్ధిగా అందాయి. ఈ వరద ప్రభావం డ్యామ్‌లపై అధికంగా ఉంది.


భారీ వర్షాల దెబ్బకు దేశంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు నీరు సమృద్ధిగా అందాయి. ఈ వరద ప్రభావం డ్యామ్‌లపై అధికంగా ఉంది. ఇందుకు తుంగభద్ర డ్యామ్ దగ్గర జరిగిన ఘటనే నిదర్శనం. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గింది కదా అని.. ఎత్తిన గేట్లను మూసేద్దామని ఆలోచించారు అధికారులు. అదే విధంగా గేట్లను మూసేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇంతలో 19వ నెంబర్ గేట్ ఒక్కసారిగా ఊడి నది ప్రవాహానికి కొట్టుకు పోయింది 69 ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అధికారులు చప్తున్నారు. చెన్‌లింగ్ తెగిపోవడమే గేట్ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణమై ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే గేటు మరమ్మతుల పనులపై ఫోకస్ పెడతామని అధికారులు చెప్తున్నారు. ఇందుకోసమే మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తినట్లు వెల్లడించారు.

పరిశీలించిన మంత్రి

తుంగభద్ర డ్యామ్ గేటు ఊడి కొట్టుకుపోయిందన్న వార్త తెలిసిన వెంటనే కర్ణాటక మంత్రి శివారజ్.. డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. గేటు రిపేర్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, వెంటనే గేటు మరమ్మతుల పనులను చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితులను చెన్నై, బెంగళూరు నుంచి ఒక నిపుణుల బృందం వచ్చి పరిశీలించి.. దిశానిర్దేశం చేస్తుందని, అక్కడ స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని మంత్రి వివరించారు. ఇప్పటికే కర్ణాటక ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడి పరిస్థితులను పరిశీలించి మిగిలి గేట్‌లకు, డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని తేల్చారు. 19వ నెంబర్ గేటు ఎలా, ఎందుకు ఊడిపోయిందన్న అంశంపై దృష్టిపెట్టినట్లు వారు చెప్పారు.

అప్పుడే పునరుద్దరణ

డ్యామ్‌ను ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు మూస్తున్న క్రమంలో గేటు కొట్టుకుపోయింది. దీనిపై స్పందించిన అధికారులు.. ప్రాజెక్ట్ నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్దరణ పనులు ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగానే కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఈ ఘటన ప్రభావం కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ఉండనుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన చేసింది. అత్యవసర సహాయం కోసం 1070112, 18004250101 నెంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది.

ఆరా తీసిన చంద్రబాబు

తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్న క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. అధికారులు డ్యామ్ దగ్గరకు వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, అక్కడి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అప్రమత్త చర్యలు చేట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాలను తనకు కూడా అందించాలని వారిని తెలిపారు. ఈ అంశంపై మంత్రులు నిమ్మల రామానాయుడు, భరత్ కూడా స్పందించి.. తగిన చర్యలు తీసుకుంటున్నామని, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.

Read More
Next Story