
ఊరెల్లి పోతోందయ్యా, కాపాడండయ్యా!
గుంటూరు జిల్లా తురకపాలెంలో అసలేం జరుగుతోంది..
“మా ఊరికేదో జరుగుతోందయ్యా.. కాపాడండయ్యా ” అంటూ చిలకమ్మ కన్నీరుమున్నీరవుతుంటే చూపరుల గుండె తరుక్కుపోవాల్సిందే..
“ఏం చెప్పమంటారయ్యా.. మా ఇంటికి చూట్టాలొచ్చి ఎంతకాలమైందో.. మా ఊరి మొహమే చూడకుండా పోతున్నారయ్యా ” అంటూ నాగేంద్రమ్మ..
“ఏదో ఒకటి చేసి మా కాలనీని కాపాడండి బాబు.. ఊరు ఊరంతా హడలి చస్తున్నారు” అంటూ ఏసోబు..
ఇలా ఒకరా ఇద్దరా.. ఊరంతా ఇదే ఆవేదన, ఎవర్ని కదిలించినా రోదన..
ఈ ఊరి పేరు తురకపాలెం. ఉమ్మడి గుంటూరు జిల్లా. ముప్పాళ్ల మండలం. సత్తెనపల్లి నియోజకవర్గం. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం. నరసరావుపేట నుంచి సత్తెనపల్లి పోతుంటే గోళ్లపాడు ముప్పాళ్ల దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకు లోపల ఉంటుంది. సుమారు 300 గడప, 14,15 వందల జనాభా. అన్నీ ఊళ్లని చెప్పలేం గాని చాలా గ్రామాల్లో ఉన్నట్టే వీధులన్నీ మురిగ్గానే ఉంటాయి. ఆ ఊళ్లో ఎస్సీ కాలనీ. నాగార్జున సాగర్ కాల్వ పుణ్యాన మాగాణి భూములూ ఎక్కువే. అందువల్ల ఎప్పుడూ ఈకవగానే (చిత్తడి) ఉంటుంది. దానికి తగ్గట్టు ఇటీవలి వర్షాలకు ఊరి మొగదల్లో ఉన్న కుంటలన్నీ నిండి ఈగలు, దోమలు జుయ్యిన ముసురుకుంటున్నాయి. మరో పక్క జపాన్ కంపచెట్లు ఝం అంటూ మోతపెడుతుంటాయి.
సరిగ్గా వీటి పక్కనే ఈ ఎస్సీ కాలనీ ఉంది. ఇప్పుడీ కాలనీతో పాటు ఊళ్లలోనూ చావు డప్పు మోగుతోంది. అంతుబట్టని వరుస మరణాలతో ఊరు ఊరంతా బిక్కుబిక్కుమంటోంది. జనవరిలో మొదలైన ఈ మరణ మృదంగం 8 నెల్లుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి మరణించిన వారి సంఖ్య అనధికారికంగా 36కి చేరింది. అధికారికంగా చెప్పేవాళ్లు ఎవరూ లేరు. మొత్తం మీద ఈ పల్లెలో మౌనం రాజ్యమేలుతోంది. పగటిపూటే రోడ్లు వెలవెలబోతున్నాయి. రాత్రి తొమ్మిది దాటితే బయటికి అడుగుపెట్టే ధైర్యం ఎవరికి లేదు. “జ్వరం వస్తే ప్రాణమే పోతుందేమో” అన్న భయం సర్వత్రా అలుముకుంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట వినిపిస్తోంది.
అనారోగ్యంతో బాధపడుతున్న చిలకమ్మ
దీనికితోడు మూఢనమ్మకాలూ వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఈమధ్య ఊళ్లో ఉన్న బొడ్రాయిని కదిలించి వేరోచోట పెట్టడం వల్లే ఊరికి కీడు వాటిల్లిందనే వారూ లేకపోలేదు. అసలప్పట్నుంచే ఊరికి శనిపట్టిందని ఓ పెద్దామె శాపనార్ధాలూ పెట్టింది.
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వైద్యాధికారులు తురకపాలెం వెళ్లి పరిశీలించి వచ్చారు. ఇక అప్పటి నుంచి మీడియా బృందాలు వరుసగా వెళ్లి వస్తున్నాయి.
సంఖ్యలు చెబుతున్న కథ..
గ్రామం మొత్తంలో గత 8 నెలల్లో నమోదైన మరణాలు 36 దాకా ఉన్నాయి.
జనవరి–మార్చి మధ్య ఐదుగురు
ఏప్రిల్ లో ఇద్దరు
మే నెలలో ముగ్గురు
జూలైలో 10 మంది
ఆగస్టులో 10 మంది
సెప్టెంబర్లో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్టు చెబుతున్నారు.
ఈ చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ కాలనీకి చెందిన వారు. దీంతో కాలనీ.. కాలనీ అంతా వణికిపోతోంది. ఇప్పటికీ చాలామంది మంచం పట్టి ఉన్నారు.
మంత్రి ఆదేశంతో ఇప్పుడు మళ్లీ ఇంటింటి సర్వే చేసి అసలు ఎన్ని మరణాలు జరిగాయో లెక్క తేలుస్తున్నారు.
జ్వరం వచ్చిందంటే వణుకే...
ప్రస్తుతం తురకపాలెంలో వినిపిస్తున్న మాట ఇది. “జ్వరం వచ్చిందంటే గుండెల్లో దడే” అంటున్నారు గ్రామస్తులు. మేరి అనే ఆమె భర్త ఇటీవల చనిపోయారు. “నిన్నటి వరకు బాగానే ఉన్నారు. ఒక్కసారిగా జ్వరం. ఆసుపత్రికి వెళ్లాం. శవంతో తిరిగొచ్చాం” అంటూ బావురుమంది ఆమె. ఇంకో ఆమె అయితే మా కాలనీలో చీమ కుట్టినా చచ్చే చావొస్తందయ్యా అంటోంది. “పొద్దున్న చీమ కుట్టింది. ఇదిగో ఇంత పుండైంది. దీనికితోడు జ్వరం, కీళ్ల నొప్పులు.. ఆగడం లేదు” అంటూ తన చేతికి అయిన పుండును చూపింది.
ఇంకో పెద్దమనిషి మాటల్లో “నాలుగు నెలలుగా చుట్టాలే రావడం లేదు. మేమూ ఎక్కడికీ వెళ్లడం లేదు” అని వాపోయారు.
మెలియాయిడోసిస్‌నా? నీటి కాలుష్యమా?
డీఎంఈ డాక్టర్ రఘునందన్ బృందం గ్రామంలో సర్వే చేసింది. 29 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలు గుంటూరు మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ ల్యాబ్‌లో పరీక్షలో ఉన్నాయి.
ఓ బ్లడ్ కల్చర్ శాంపిల్ లో మలేరియా పాజిటివ్ కనిపించింది. బుధవారం తీసిన 20 నమూనాల్లో మూడింట్లో మెలియాయిడోసిస్ అనుమానం. తుది నిర్ధారణ ఇంకా జరగలేదు. కల్చర్ ఫలితాలు రావాల్సి ఉంది.
తురకపాలెం గ్రామం
నీటి ట్యాంకుల నుంచి నీటి నమూనాలు, పలు చోట్ల మట్టి నమూనాలు సేకరణ కొనసాగుతోంది.
“మెలియాయిడోసిస్ గుర్తించి యాంటీబయాటిక్స్ త్వరగా ప్రారంభిస్తే రోగి కోలుకుంటాడు. భయపడాల్సిన పనిలేదు.” అని డాక్టర్లు చెబుతున్నా గ్రామస్తుల్లో భయం వీడడం లేదు.
ఎస్సీ కాలనీ-సమస్యల గూడు..
కాల్వల్లో పూడిక పేరుకుపోయింది. ఇళ్ల చుట్టూ దోమలే దోమలు. వర్షపు నీరు నిలిచి పరిస్థితి చెప్పనలివి కాకుండా ఉంది.
ఈ ఊరికి మరోపక్క కంకర క్వారీలు, క్రషర్లు. క్వారీ గుంతల్లో ఏళ్ల తరబడి నిలిచిన నీళ్లతో అవి చెరువుల్ని తలపిస్తున్నాయి. పేలుళ్లతో రాతిపొరలు కదలి భూగర్భ జలం కలుషితం అయ్యిందా అనే కోణంలోనూ పరీక్షలు చేస్తున్నారు.
ఊళ్లో కొనసాగుతున్న వైద్య శిబిరం..
ఆగస్టు 29 నుంచి ఊళ్లో వైద్య, ఆరోగ్య శిబిరం నడుస్తోంది. ఇప్పటివరకు 1,200 మందిని స్క్రీనింగ్ చేశారు.
చిన్న గాయాలు సైతం పుండ్లుగా మారి ప్రాణాంతకం ఎందుకవుతున్నాయో పరీక్షలు చేస్తున్నారు.
30 ఏళ్లు దాటిన వారిలో 30 శాతం మందికి బీపీ, 10 శాతం మందికి షుగర్ వ్యాధి ఉన్నట్టు నిర్దారించారు.
నాసిరకం మద్యం వాడకం వల్ల కిడ్నీలు చెడిపోయిన వారినీ గుర్తించారు.
గుంటూరు జనరల్ ఆస్పత్రిలో తురకపాలెం వాసుల కోసం 10 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
ఊరందరికీ ఇంటి వద్ద ఆరోగ్య పరీక్షలు, షుగర్, బీపీ, కిడ్నీ ప్రొఫైల్ చెక్ చేస్తున్నారు.
పారిశుధ్య విభాగాలు కాల్వలు శుభ్రపరిచే పనిలోకి దిగారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. నిల్వ నీటిని తోడేస్తున్నారు.
అవసరమైన వారికి సైకియాట్రిక్ కౌన్సెలింగ్ కూడా ప్రారంభించారు.
మీడియా కదిలే వరకు కదలని ప్రభుత్వ యంత్రాంగం..
పత్రికల్లో ఈ ఊరి వ్యవహారం వచ్చేంత వరకు మరణాల తీవ్రతను అధికారులు ఖాతరు చేయలేదు. మలేరియా బృందాలు ఇంటింటికెళ్లినట్టు రికార్డులు ఉన్నా ఊళ్లో చావుల సంగతి వైద్యాధికారులకు తెలియలేదు. ఇప్పుడు దళాలు దళాలుగా డాక్టర్లు, ఇతర సిబ్బంది, యంత్రాంగం—అందరూ కదులుతున్నారు.
“ఇప్పుడేం చేయాలి?”.. తక్షణ కార్యాచరణ..
నీరు–మట్టి పరీక్షలు: ప్రాథమిక ఫలితాలు వచ్చిన వెంటనే తాగునీరు క్లోరినేషన్, బ్లీచింగ్ శాశ్వత ప్రోటోకాల్‌గా అమలు.
వైద్య లైన్-లిస్ట్: ప్రతి జ్వరం కేసు, గాయపుండి కేసు ట్రాకింగ్. అదే వ్యక్తి మళ్లీ జ్వరం వస్తే వేగంగా పై స్థాయికి రిఫర్.
యాంటీబయాటిక్ ప్రోటోకాల్: మెలియాయిడోసిస్ అనుమానం ఉన్న కేసులకు తక్షణ చికిత్స, గ్రామ శిబిరంలో అందుబాటు.
నిల్వ నీటి నిర్మూలన: క్వారీ గుంతలు, చెరువుల్లో డీ వాటరింగ్, లార్వ నివారణ.
క్వారీ గుంతల్లో నిలిచిన నీళ్లు
హానికర మద్యం నియంత్రణ: గట్టిగా తనిఖీలు, డీ-అడిక్షన్ కౌన్సెలింగ్, కమ్యూనిటీ అవేర్‌నెస్.
కమ్యునిటీ హెల్ప్‌లైన్: 24×7 నంబర్—జ్వరం, శ్వాస, గాయాలు, పుండ్లు వంటి లక్షణాలపై వెంటనే స్పందన.
మానసిక ఆరోగ్యం: కుటుంబాలు కోలుకోవడానికి నిరంతర కౌన్సెలింగ్, సపోర్ట్ గ్రూపులు.
గ్రామమంటే కేవలం కంచె, చెట్లు, ఇళ్లే కాదు—మనుషుల ప్రాణాలు కూడా.. తురకపాలెం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంది. ఊరెళ్లిపోతోందయ్యా… కాపాడండి” అనే కేక గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడా ఊరికి ఇవ్వాల్సింది ధైర్యం, తక్షణ వైద్యం.
Next Story