లోకల్‌ అధికారుల నుంచి నాన్‌లోకల్‌ అధికారులకు ఈ కేసు చుట్టుకుంది. బీహార్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిని విచారించనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో మరో ఐపీఎస్‌ అధికారిని తెరపైకి తెచ్చారు. సునీల్‌ నాయక్‌ అనే మరో ఐపీఎస్‌ అధికారి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఇతను బీహార్‌ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ప్రకాశం జిల్లా పోలీసులు సునీల్‌ నాయక్‌కు నోటీసులు జారీ చేశారు. ఫ్యాక్స్‌తో పాటు వాట్సప్‌ ద్వారా సునీల్‌ నాయక్‌కు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో గుంటూరు సీఐడీ రీజినల్‌ కార్యాలయంలో తనపై కస్టోడియల్‌ టార్చర్‌ జరిగిందని, దీనికి కారకులైన అధికారులు, నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ గత కొన్ని రోజులుగా జరుగుతోంది. రఘురామకృష్ణరాజును నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ రీజినల్‌ కార్యాలయానికి తీసుకొచ్చిన సమయంలో ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ కూడా వచ్చారని, రఘురామకృష్ణరాజు కేసును ప్రస్తుతం విచారణ జరుపుతున్న అధికారులు ధృవీకరించారు. రఘురామ కేసులో ఇప్పటి వరకు చేపట్టిన విచారణలో నమోదు చేసిన వాంగ్మూలాలా ఆధారంగా సునీల్‌ నాయక్‌ పాత్ర ఉందనే కారణంగా ఆయనను విచారణకు పిలిపించాలని నిర్ణయించారు.
బీహార్‌ కేడర్‌కు చెందిన సునీల్‌ నాయక్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్‌ మీద వచ్చారు. సీఐడీ డీఐజిగా సునీల్‌ నాయక్‌ నాడు ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్‌ నాయక్‌ తిరిగిన హోం కేడర్‌ బీహార్‌కు వెళ్లిపోయారు. బీహార్‌లో ప్రస్తుతం ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అగ్నిమాక శాఖలో డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. సునీల్‌ నాయక్‌కు విచారణకు రావాలని పంపిన నోటీసుల విషయాన్ని అతని ఉన్నత అధికారులకు కూడా ఏపీ పోలీసులు తెలియజేశారు. రఘురామకృష్ణరాజు కేసు దర్యాప్తు అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌ నుంచి ఈ కేసును ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్‌ నేతృత్వంలో రఘురామకృష్ణరాజు విచారణ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు కేసు తెరపైకి వచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన రఘురామ భీమవరం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయనకు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు కీలక పదవిలో కూర్చోబెట్టారు. ఎంతో మంది టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యేలను కాదని కొత్తగా చేరిన రఘురామకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవిని కట్టబెట్టారు. కేవలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో, నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడం, బెయిల్‌ రద్దు చేయాలని జగన్‌పై కేసులు వేయడం, పిటీషన్‌లు వేయడంతో రఘురామ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ స్థానంలో రఘురామ ఉంటే జగన్‌కు కూడా ఇబ్బందిగానే ఉంటుందనే ఎత్తుగడతోనే ఆయనకు డిప్యూటీ స్పీకర్‌ ఇచ్చారనే టాక్‌ కూటమి శ్రేణుల్లో ఇప్పటికీ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి రావడంతో రఘురామ కేసు ఊపందుకుంది. ఏకంగా డిప్యూటీ స్పీకర్‌ స్థానంలో ఉండటంతో పోలీసులు రఘురామ కేసుపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. విచారణను వేగవంతం చేశారు.
Next Story