ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారధి 2024 మేలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న పార్థసారధికి పెనమలూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పెనమలూరు నుంచి బోడె ప్రసాద్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉండటంతో నూజివీడు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పార్థసారధిని చంద్రబాబు ఎన్నికల రంగంలోకి దించారు. ఈయన వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు సచివాలయాన్ని మారుస్తున్న తరుణంలో విజయవాడ బందర్ రోడ్డులోని తన సొంత స్థలంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు అక్కడి నుంచి జరిగేలా వ్యవహరించారు. ఆ తరువాత తాడేపల్లిలో రాష్ట్ర కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు.
పార్థసారథి 1965 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కరకంపాడులో రాజకీయ కుటుంబంలో జన్మించారు . ఆయన తండ్రి కొలుసు పెదారెడ్డి రాజకీయ నాయకుడు.1991, 1996లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి కృష్ణా జిల్లా ఉయ్యూరు నియోజకవర్గం నుంచి 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో నియోజకవర్గం రద్దయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, వెటర్నరీ యూనివర్శిటీ శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన కె రోశయ్య మంత్రి వర్గంలోనూ అదే శాఖలో కొనసాగారు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 2009 ఎన్నికల్లో పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ పునర్నిర్మాణంలో సారధికి సెకండరీ ఎడ్యుకేషన్ శాఖను కేటాయించారు. పరీక్షలు, ఎపి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సెకండరీ ఎడ్యుకేషన్‌కు చివరి మంత్రి. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉద్యమాలు చేసిన వారిలో ఒకరు.
2014లో పార్థసారథి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2014లో మచిలీపట్నం నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయాడు. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఆయన పెనమలూరు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు.
ఆనం రాజకీయ ప్రయాణం..
ఆనం రామనారాయణ రెడ్డి 1952 జూలై 10న నెల్లూరులో జన్మించారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆనం వెంకటరెడ్డి దంపతులకు నెల్లూరులో జన్మించారు. రాజకీయ నాయకుడు అయిన ఆనం వివేకానంద రెడ్డి సోదరుడు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి బీకాం బీఎల్ పట్టా పొందారు.
1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. మొదట ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.
1985లో నెల్లూరు జిల్లాలోని రాపూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మళ్లీ రెండో సారి ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో ఆయన ఏపీ శాసనసభ ఎన్నికల్లో రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. 2004 శాసనసభ ఎన్నికలకు రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ ఎన్నికయ్యారు. 2007లో మొదట వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2009 వరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు.
డీలిమిటేషన్ వల్ల 2009లో ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. జూలై 2009 నుంచి ఆయన 2012 వరకు కొనసాగిన వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019లో ఆయన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2023లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆయనను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2024లో దాదాపు 3 దశాబ్దాల తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యునిగా పోటీ చేసి ఎన్నికయ్యారు.