కాకర్ల సురేష్‌కు ఉదయగిరి టిడిపి టిక్కెట్ రావడంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) కీలక పాత్ర పోషించింది.
ఎన్‌ఆర్‌ఐ సురేష్‌ను వరించిన టిక్కెట్
సేవా కార్యక్రమాలే సురేష్‌కు రక్షగా నిలిచాయా
ఇద్దరు సీనియర్‌లను కాదని సురేష్‌ను బాబు ఎందుకు ఎంపిక చేశారు
జి విజయ కుమార్
టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయగిరి అసెంబ్లీ స్థానాన్ని కాకర్ల సురేష్‌కు కేటాయించారు. సురేష్ అమెరికాలోని నార్త్ కరోలీనా రాష్ట్రం ర్యాలీ నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ. రెండేళ్ల క్రితం నుంచి ఉదయగిరి నియోజక వర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాకర్ల ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం, పాఠశాలలకు సహాయం, ఆరోగ్య శిబిరాలు నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ ప్రాంత ప్రజలకు చేరువయ్యారు. తానాలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు సీటు రావడంలో తానా కీలక పాత్ర పోషించింది.
ఎవరీ సురేష్..
ఉదయగిరి నియోకజకవర్గంలోని వరికుంటపాడు యర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. కాకర్ల వెంకటసుబ్బారాయుడు, ప్రమీల దంపతుల ప్రథమ సంతానం. తండ్రి విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసరుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సురేష్ బుచ్చిరెడ్డిపాలెంలో హైస్కూలు స్టడీ, అక్కడే గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్, విజయవాడ శిద్దార్థ ఇంజనీరింగ్ కలేజీలో బీటెక్, అనంతరం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించి అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రానికి తానా అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాలోని తెలుగువారి కోసం ఏర్పాటు చేసిన తానాలో టీమ్‌స్క్వేర్ వింగ్‌కు సేవలందించి వెయ్యిమందిపైగా కుటుంబాలకు సాయం అందించారు. అక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి బాగా స్థిరపడ్డారు. ఈయన తమ్ముడు కాకర్ల సునీల్ కుటుంబ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఏవైనా సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని భావించిన సురేష్ రెండేళ్ల క్రితం అమెరికా నుంచి సొంతూరుకు చేరుకున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చి చంద్రబాబు దృష్టిలో పడ్డారు.
ఇద్దరు సీనియర్ నేతలను కాదని..
సీనియర్ నేతలైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను కాదని తెలుగుదేశం పార్టీ తరఫున కొత్త అభ్యర్థిని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఉదయగిరి టిడిపి రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. తొలి నుంచి ఆ పార్టీ వెంట నడుస్తున్న టిడిపి కేడర్ ఎవరి పక్షాన నిలువాలనే దానిపై తేల్చులేక పోతున్నది.
కాంగ్రెస్‌ను ఓడించిన వారిలో బొల్లినేని రామారావు ఒకరు
ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. దాదాపు ఆరు పర్యాయాలు కాంగ్రెస్ గెలుపొందింది. దీనిని బద్దలు గొట్టి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెలాడించారు. రెండు సార్లు టిడిపి అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో బొల్లినేని రామారావు ఒకరు. 1999లో కంభంæవిజయరామిరెడ్డి విజయం సాధించగా 2014లో బొల్లినేని వెంకటరామారావు గెలుపొందారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆయన విజయం సాధించారు. 3,622 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఓడి పోయారు. బొల్లినేని వెంకటరామారావు ఉదయగిరి నిజయోక వర్గంలో మంచి పట్టున్న నేత. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో సానుకూలత ఉంది. 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు తనకే ఉదయగిరి టికెట్ కేటాయిస్తారని ధీమాతో ఉన్నారు. దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో కలత చెందారు. ఆయన వర్గీయులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్మెంట్ కోరినా దొరకలేని, ఇటీవల బొల్లినేని తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నిరసన గళాన్ని బహిరంగంగానే వినిపించారు. బోరున విలపించిన ఆయన ఉదయగిరి నుంచి తప్పకుండా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
చంద్రశేఖర్‌రెడ్డిపై దృష్టే పెట్టని చంద్రబాబు
సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో ఇటీవల టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేశారు. తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్‌ఆర్ మరణానంతరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ పార్టీ తరఫున 2012 బై ఎలక్షన్‌లోను, 2019లోను గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన టిడిపిలోకి మారారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇస్తారని ఆశించి భంగ పడ్డారు.
సురేష్ గెలుపు కోసం పని చేస్తారా ?
మహామహులైన ఇద్దరు సీనియర్ నేతలను కాదని యువనేత అదీ కూడా ఒక ఎన్‌ఆర్‌ఐకి సీటు ఖరారు చేయడంతో ఇద్దరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతల అనుచరులు, కార్యకర్తలు కొత్త అభ్యర్థి కాకర్ల సురేష్‌కు మద్దతు తెలిపి ఆయన గెలుపు కోసం పని చేస్తారా లేదా అన్నది ఆ నియోజక వర్గంలోని టిడిపి శ్రేణుల్లో ప్రశ్నార్థకంగా మారింది.
Next Story