ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచితంగా మంచినీళ్లు ఇవ్వలేరా?
x
Photo: George Institute for Global Health

ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచితంగా మంచినీళ్లు ఇవ్వలేరా?

"కిడ్నీ బాధిత ప్రజలున్న గ్రామాలకు ఇచ్చే నీళ్ళను ప్రభుత్వం ప్రజలకు అమ్మడం సిగ్గు చేటు."

“శ్రీకాకుళం రా ! వీర శ్రీకాకుళంరా !

వీర యోధులనే కన్నగడ్డ శ్రీకాకుళం రా !”
“ఉద్దానం కాదురా ! ఉద్యమాల వనం రా !”
“శ్రీకాకుళం లోన చిందినా రక్తముతో
బండలెరుపెక్కినాయీ, పోరాడ కొండలే కదిలినాయీ !”

ఈ పాటలను రాజకీయ,సామాజిక ఉద్యమాల స్పృహ కలిగిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆ పాటలు పాడుకుంటారు, ఉద్యమాల స్పూర్తితో నేటికీ అనేక మంది ఆ పాటలను మననం చేసుకుంటారు. 6 దశాబ్ధాల క్రితం 1960 దశకంలో ముందుకు వచ్చిన శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఉర్రూతలూగించింది. దేశ వ్యాపితంగా ఆదివాసీ ప్రజల పోరాటాలకు ప్రేరణగా నిలిచింది. ఈ ఉద్యమంలో వందలమంది ప్రాణ త్యాగాలు చేశారు. వేలాది మంది పోలీసు నిర్బంధానికి గురయ్యారు. లాటీ దెబ్బలకు ,తూటాలకు గురయ్యారు. వందల కేసులు ప్రజలపై మోపారు. అనేక మంది జైళ్ల పాలయ్యారు.

ఈ త్యాగాలు ఆదివాసీ ప్రజలకు అనేక హక్కులను సాధించి పెట్టాయి. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ముఖ్యంగా విద్యా, వైద్య సౌకర్యాలు మెరుగుపడడంలో, ప్రజల వ్యవసాయం, జీవనోపాధులు మెరుగుపడడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతం ఈ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. పలాస, సోంపేట సహా 7 మండలాలతో కూడిన ఈ ప్రాంత ఉద్యమానికి తామాడ గణపతి, పాణీ గ్రాహి సుబ్బారావు, పంచాది కృష్ణమూర్తి లాంటి నాయకులు ప్రాణం పోశారు. ఆ ఉద్యమంలో అమరులయ్యారు. ఈ నాటికీ ,ఆ ఉద్యమ జ్ఞాపకాలు , అమరుల త్యాగాలు, సాధించిన విజయాలు పెద్ద వయస్సు ప్రజలలో సజీవంగా ఉన్నాయి.

కానీ క్రమంగా అక్కడి ఉద్యమ సంస్థలు చీలికలకు గురయ్యాయి. బలహీన పడ్డాయి. ప్రజల ఆదరణ కోల్పోయాయి. మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ ప్రభావం, ప్రైవేటీకరణ ప్రభావం, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులలో వచ్చిన మార్పులు, హరిత విప్లవ నమూనాతో, రసాయనాల వినియోగం పెరగడం లాంటి కారణాల వల్ల , ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కొత్త అనారోగ్య సమస్యలు కూడా ప్రజలను ఆవహించాయి.

ఉద్దానం ప్రాంతంలో సాగు నీటి సౌకర్యాలు తక్కువ. జీడి, కొబ్బరి తోటలు ఎక్కువ. ఒక రకంగా అవే, ప్రస్తుతం పంటలు అని చెప్పినా ఆశ్చర్యం లేదు. జీడి తోటల నిర్వహణలో ఖర్చులు పెరుగుతున్నాయి కానీ, రైతులకు ఆదాయం స్థిరంగా ఉండడం లేదు. జీడి పిక్కలకు కనీస మద్ధతు ధరలు లేకపోవడం వల్ల, జీడి పప్పును ప్రభుత్వం సేకరించకపోవడం వల్ల ధరల నిర్ణయంలో వ్యాపారుల ఇష్టా రాజ్యం నడుస్తున్నది. అక్టోబర్ 20 న శ్రీకాకుళం జిల్లా హరిపురంలో , పలాస డివిజన్ రైతు సమస్యల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో జీడి పప్పుకు బస్తాకు ( 80 కిలోలు ) 16,000 రూపాయల కనీస మద్ధతు ధరను ప్రకటించాలనీ, ప్రభుత్వమే సేకరణ కేంద్రాలు గ్రామాలలో ఏర్పాటు చేసి రైతుల నుండీ నేరుగా జీడిపప్పును సేకరించాలనీ రైతులు డిమాండ్ చేశారు.

జీడి సంవత్సరంలో ఒకే సారి కాపుకు వస్తుంది. బాగా పండింది అనుకున్నా 6-8 బస్తాలకు మించి దిగుబడి లేదు. కొన్ని సందర్భాలలో 2-3 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. ఆ ఆదాయంతో రెండు మూడు ఎకరాల రైతు కుటుంబం సంతోషంగా జీవించడం ఆసాధ్యం. జీడి తోటలలో భాగంగా ఉండి, ఎంతో కొంత ఆదాయాన్ని ఇచ్చే కొబ్బరి చెట్లు , రెండేళ్ల క్రితం వచ్చిన తిత్లీ తుఫానుకు తీవ్రంగా దెబ్బ తిని రైతులకు కొబ్బరి చెట్ల నుండీ ఆదాయం లేకుండా పోయింది . తుపాను వల్ల నష్టపోయిన చాలా మంది రైతులకు ప్రభుత్వాల నుండీ కనీస నష్ట పరిహారం కూడా అందలేదు.

జీడి తోటల రైతులకు ఆదాయం తక్కువ ఉండడం ఒక సమస్య అయితే , గత మూడు దశాబ్ధాలుగా ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఆయా రైతు కుటుంబాల ఆర్ధిక పరిస్థితిని అతలాకుతలం చేసేసింది. ఒక కుటుంబంలో ఎవరి కైనా కిడ్నీ సమస్య బయట పడితే ఇక ఆ కుటుంబ కష్టాలు ప్రారంభ అయినట్లే. ప్రతి ఇంట్లోనూ కిడ్నీ సమస్య బాధితులు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ పదుల సంఖ్యలో కిడ్నీ సమస్యతో మరణించిన సందర్భాలు ఉన్నాయి. కిడ్నీ సమస్యతో మరణించిన వారిలో 7 సంవత్సరాల వయసు నుండీ 60 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. మహిళలలో, పురుషులలో కూడా ఈ సమస్య సమానంగానే ఉంది. కిడ్నీ వైద్యం మందులతో ప్రారంభమై , డయాలసిస్ వరకూ వస్తుంది. మందులకు, వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రులకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డయాలసిస్ ప్రారంభించిన 6-9 నెలల లోపే బాధితులు మరణిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో కొన్ని వైద్య సౌకర్యాలు అభివృద్ధి చేసినప్పటికీ , అవి, మొత్తం పరిస్థితి తీవ్రతకు తగిన విధంగా లేవు.

ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు గతంలో ఉన్న పెన్షన్ ను నెలకు 10,000 రూపాయలకు పెంచింది కానీ, అది ఆయా కుటుంబాలకు పూర్తి భరోసా ఇవ్వడం లేదు. కిడ్నీ సమస్య ఉన్న గ్రామాలకు మంచి నీరు సరఫరా చేస్తున్నది . ATM కార్డు లాంటిది ఆయా గ్రామాలలో కుటుంబాలకు ఇచ్చింది. గ్రామాళ్ళలో నిర్మించిన వాటర్ ట్యాంకులలో నుండీ ఈ కార్డు ద్వారా 20 లీటర్ల బాటిల్ కు 7 రూపాయలు చెల్లించి కొనుక్కోవాలి. అంటే రోజూ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా నెలకు కనీసం 210 రూపాయలు ఆయా కుటుంబాలు నీళ్ళ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రతి రోజూ తీసుకునే నీళ్ళ బాటిల్ కేవలం మంచి నీరు గా తాగేందుకు వాడుతున్నారు. వంటకు మళ్ళీ ఆ గ్రామం లో నీళ్లే వాడుతున్నారు. దీని కోసం కూడా రెండో బాటిల్ తీసుకోవాలంటే, నెలకు మరో 210 రూపాయలు ఖర్చు చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి గురించి అట్టహాసంగా ప్రకటించుకునే ప్రభుత్వాలు కిడ్నీ బాధిత గ్రామాలకు, ప్రజలకు మంచి నీళ్ళు ఉచితంగా సరఫరా చేయలేకపోవడం సిగ్గు చేటు.

కిడ్నీ బాధితుల సంఘం , కిడ్నీ బాధిత కుటుంబాల సంఘీభావ కమిటీ లాంటివి గ్రామాలలో పని చేస్తున్నాయి. వీళ్ళు గ్రామం నుండీ ఫోన్ చేస్తే, ట్యాంకర్ ద్వారా ఒకటి రెండు రోజుల్లో నీటి సరఫరా చేస్తున్నారు. కిడ్నీ రోగ బాధితులను డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికి గ్రామాలకు 108 వాహనం వస్తున్నది. తీసుకు వెళ్లేటప్పుడు ఉచితంగా తీసుకు వెళుతున్నారు. కానీ డయాలసిస్ పూర్తయ్యాక, ఆ రోగులను ఇంటి దగ్గర వదిలి వెళ్ళడం లేదు. వాళ్ళు విడిగా వాహనం కిరాయికి మాట్లాడుకుని ఇంటికి రావలసి వస్తున్నది.డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ప్రభుత్వం ఇస్తున్న నెలకు 10,000 రూపాయల పెన్షన్ డబ్బు ప్రధానంగా రవాణా ఖర్చులకు ఖర్చు అవుతున్నదని ఆయా కుటుంబాల సభ్యులు వాపోతున్నారు.

ప్రతి వారం రెండు మూడు సార్లు డయాలసిస్ చేయించాల్సిన స్థితిలో ఉన్న రోగి ఇంట్లో ఉంటే, ఆయా కుటుంబాలలో మిగిలిన సభ్యులు కూడా ఆ రోగిని అంటిపెట్టుకుని ఉండాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఆ మేరకు శ్రమ చేసుకుని జీవించే కుటుంబాలలో ఆదాయం గణనీయంగా పడిపోతున్నది.

అసలు కిడ్నీ సమస్య ఎందుకు వస్తున్నదో ఇప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ధారించలేదని బాధిత కుటుంబాలు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఒక ప్రాంతం మొత్తాన్ని శ్మశాన వాటికగా మార్చే జబ్బు విషయంలో అవసరమైన పరిశోధనలు జరిగి, ఇంత కాలంలో సరయిన కారణాలను అన్వేషించి, ప్రజలకు వివరించక పోవడం , కారణాలు బయటపడితే, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే, దశాబ్ధాలుగా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రభుత్వాలకు కారణాలు తెలిసినా ప్రజలకు నిజాలు చెప్పడం లేదనీ, పరిష్కారాలు చెబితే, ప్రైవేట్ వైద్య రంగానికి దెబ్బ తగులుతుందని, ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన దశలో ఈ ప్రాంతంలో ప్రభుత్వం ప్రత్యేక పరిశోధన శాలలను ఏర్పాటు చేస్తే ,ఎప్పుడో ఈ సమస్యకు పరిష్కారం లభించేది. కానీ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం ఇచ్చే చర్యలు తప్ప, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆ పని వెంటనే చేయాలి.

మంచి నీళ్ళు తాగాలని ప్రభుత్వం ప్రచారం చేసినందుకు , పొలానికి వెళ్ళే రైతులు, కూలీలు కూడా గతానికి భిన్నంగా రోజూ రెండు లీటర్ల నీళ్ళు పని సమయంలో తాగుతున్నామని చెప్పారు. ఫారం కోళ్లలో ఉపయోగించే యాంటీ బయాటిక్స్ , గ్రోత్ హార్మోన్స్ వల్ల సమస్యలు ఉన్నాయని ప్రచారం జరగడంతో, ఎక్కువమంది ఫారం కోళ్ళ చికెన్ తినడం మానేసి . నాటు కోళ్ళ మాంసం తింటున్నామని చెప్పారు. జీడిమామిడి తోటలలో ఉపయోగించే రసాయన ఎరువులు, ఎండో సల్ఫాన్, మోనో క్రోటో ఫాస్ లాంటి పురుగు విషాలను ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని ప్రచారం జరిగినందున , వాటి వాడకం తగ్గించి , ఇతర క్రిమి సంహారకాలను వాడుతున్నట్లు రైతులు చెప్పారు.

వీటి ఫలితాలు కొంత కనిపిస్తున్నప్పటికీ, ఇంకా పూర్తి సమస్య పరిష్కారం కాలేదు. నిజంగా ఇప్పటికీ ప్రచారం లో ఉన్నవి మాత్రమే సమస్యకు కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నవా అనేది మాత్రం నిర్ధారణ కాలేదు. ఈ తాత్కాలిక ఉపశమన చర్యలు, ఫలితాలు కూడా అన్ని గ్రామాలలో ఒకే విధంగా లేవు. కాబట్టి వాటిని శాస్త్రీయంగా నిర్ధారించలేము.

ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి కుటుంబానికి కనీసం 100 లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేయాలి. వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే ప్రభుత్వం వైద్య పరీక్షలు, మందులు, డయాలసిస్ వైద్యం అందించాలి. డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్ళే బాధితులను వైద్యం పూర్తయ్యాక మళ్ళీ ఉచితంగా ఇంటిదగ్గర దిగబెట్టాలి.

జీడి మామిడి తోటలలో రసాయన పురుగు విషాలు,రసాయన ఎరువుల వాడకం మానేసి సేంద్రీయ ఉత్పత్తి పద్ధతులను ప్రోత్సహించేలా ,ప్రభిత్వం CNF లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం డిజైన్ చేయాలి. అమలు చేయాలి. సేంద్రీయ వ్యవసాయం తో జీడి తోటలలో సగటు దిగుబడులు తగ్గుతాయనే రైతుల భయాలను పోగొట్టడానికి, రైతులకు మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలి.

ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్యకు పరిష్కారం లభించే వరకూ, కేవలం డయాలసిస్ చేయించుకుంటున్న వారికే కాకుండా, కిడ్నీ సమస్య బయట పడిన ప్రతి ఒక్కరికీ నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందించాలి.డయాలసిస్ బాధితులు ఆకాలంలో మరణించినప్పుడు ,ఆ కుటుంబాలలో పిల్లల చదువులు ఆగిపోకుండా, ప్రభుత్వం తగిన సహాయం అందించాలి.

ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్య రాజకీయ పార్టీల స్వంత ప్రయోజనాల నినాదంగా మారిపోకూడదు. అది ప్రజల సమస్య. సామాజిక సమస్య. ఒక ప్రాంత ఆర్ధిక సమస్య. అందువల్ల ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.


Read More
Next Story