ఆంధ్రా ఎన్డీయే ప్రశాంతంగా ముందుకు సాగేనా?
x

ఆంధ్రా ఎన్డీయే ప్రశాంతంగా ముందుకు సాగేనా?

ప్రధాని మోదీ పవన్‌ కు చెప్పిన హిమాలయ యాత్ర అర్థం ఏమిటి?


-తెలకపల్లి రవి

ఇటీవలి కాలంలో ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై చర్చ పెరగడానికి చాలా కారణాలున్నాయి. 2024 ఎన్నికల్లో జగన్‌ సర్కారును గద్దెదించాలంటే కలిసి పోటీ చేయడం అనివార్యమన్న పిలుపుతో ముందుకు వెళ్లిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వందశాతం సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి గా ప్రతిష్టితుడవడం ఒక కీలక పరిణామం.ఇవన్నీ నిజమైనప్పటికీ పాలక ఎన్డీఎ కూటమిలో ప్రశాంతత అంతగా కనిపించడం లేదు.ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అనేక కారణాల వల్ల ఆయనకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్టు కనిపించారు. చంద్రబాబు వారసుడైన నారా లోకేశ్‌ స్థానానికీ ఆయన పై ఫోకస్‌కూ వైరుధ్యం వల్లనే భిన్న సంకేతాలు వస్తున్నాయని అని అనేక మంది అంటున్నా అదే ఏకైక సమస్య కాదు. ఎందుకంటే ఆ వారసత్వ వాస్తవం పవన్‌ కళ్యాణ్‌కే గాక దేశమంతటికీ తెలుసు. లోకేశ్‌ కన్నా ముందు నారా భువనేశ్వరిని రెండో స్థానంలోకి తేవాలనే బలమైన ఆలోచన కూడా టిడిపికి వుంది.ఇటీవల ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి కూడా. అందువల్ల ఇది పవన్‌ రేపటి స్థానానికి సంబం ధించిన సమస్య మాత్రమే కాదను కోవాలి. లోతైన రాజకీయ వ్యూహాత్మక కారణాలే దీనివెనక వున్నాయి.తన రాజకీయ భవిష్యత్తును బిజెపితో ముడి పెట్టుకున్న పవన్‌ సనాతన మంత్రాన్ని తీసుకోవడం అందుకోసమే.
ఢల్లీి ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు,పవన్‌ కళ్యాణ్‌లతో ప్రధాని మోడీ ముచ్చటించిన తీరు దేశమంతా చూసింది. పవన్‌ విలాసంగా వినోదంగా స్పందించగా చంద్రబాబు వినమ్రంగా ప్రత్యేక గౌరవంతో ప్రతిస్పందించడం కూడా చూసింది,ఇది యాదృచ్చికమేమీ కాదు.నిజానికి ఈ ఘట్టానికి ముందు పవన్‌ మూడు అడుగులు గుర్తు చేసుకోవాలి.దక్షిణాది తీర్థయాత్ర(అది కూడా బిజెపికి సవాలుగా వున్న కేరళ,తమిళనాడులలో),మహాకుంభలో స్నానం మమతాబెనర్జీతో సహా వ్యతిరేక పార్టీలపై దాడి, వెంటనే ఢల్లీిలో ప్రత్యక్షం.దీనివెనక వున్న ప్రణాళిక దానికి మోడీ ప్రోత్సాహం ప్రత్యేకంగా చెప్పాలా? ఆ వేదికపై ఆయన అడిగిన ప్రశ్న కూడా మతానికి యాత్రలకు సంబంధించిందే కావడం గమనించవచ్చు.బహుశా ఆయన కూడా అచ్చంగా ఇలాగే కేదారనాథ్‌ గుహలోనో అమరనాథ్‌లోనో ప్రత్యక్షం కావడం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.కనుక ఇదిఇది కేవలం ఆంధ్ర ప్రదేశ్‌కో తెలంగాణకో మాత్రమే పరిమితమైన సమస్య కూడా కాదు.
కాస్త వెనక్కు వెళితే తిరుపతి లడ్డూ సమస్యపై ప్రాయశ్చితదీక్ష,తొక్కిసలాట ఘటనపై క్షమాపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సనాతన రాజకీయాల ప్రతినిధిగా ముందుకురావడమే గాక ప్రభుత్వ పరంగానూ తన మాట ప్రత్యేకంగా వినిపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లతో సహా మిగిలిన వారు వ్యవహరించిన మాట్లాడిన తీరుకు ఇది కొంత భిన్నం,(ఇప్పుడు తాజాగా శ్రీవారి ఆలయంలోనే ఉద్యోగిని దుర్భాషలాడిన టిటిడి సభ్యుడిపై ఏం స్పందిస్తారో చూడాలి) చంద్రబాబుఅనుభవంపై అపారగౌరవం ప్రకటిస్తూనే తన స్వంత ముద్ర కోసం పవన్‌ ప్రత్యేక చర్యలు తీసుకోవడం అందరికీ అర్థమవుతున్నది, కనీసం మూడునాలుగు సందర్భాలలోహోం శాఖ పనితీరుపై వ్యాఖ్యానాలు విసుర్లు సాగించడం కూడా యాదృచ్చికం కాదు. లోకేశ్‌ పాత్రపై పదేపదే చర్చ రావడం కూడా ఇందులో భాగమే. మా వల్ల మళ్లీ అధికారంలోకి వచ్చి మమ్మల్నే నిర్లక్ష్యం చేస్తున్నారని జనసేన నాయకులు అంటుంటే మీ 11 శాతరి ఓటింగుమించిన పదవులు,వనరులు, ఫోకస్‌ ఇచ్చామనేది టిడిపి వారి వాదన, పైగా పవన్‌ కళ్యాణ్‌ ప్రతి సందర్భంలోనూ మిగిలిన వారందరికీ అతీతుడుగా వున్నట్టు ఫోకస్‌లో వుండే ప్రయత్నం చేస్తున్నారని టిడిపిలో కీలక స్థానాల్లో వున్నవారే సందేహిస్తున్నారు.
ఈ వాదోపవాదాలను అలా వుంచి ఉపముఖ్యమంత్రి దక్షిణభారత తీర్థయాత్ర చేశారు.అది కూడా వామపక్షాలకు నిలయమైన కేరళతోనూ, ఎన్డీఎ మరీ అధ్వాన్నంగా వున్న తమిళనాడుతోనూ మొదలెట్టారు. అంటే బిజెపి దక్షిణాది విస్తరణ వ్యూహానికి,పవన్‌ కదలికలకు స్పష్టమైన సంబంధం వుందనుకోవాలి.ఆయన తదుపరి చిత్రం హరిహర వీరమల్లు చిత్రం కూడా కాషాయ పరంపరలో ఔరంగజేబ్‌పై పోరాటం వంటి కథనంతో వస్తుందట. వ్యక్తిగతంగా,సనాతన పరంగా పవన్‌ కళ్యాణ్‌ బిజెపినేతలతో పూర్తిగా కలసి వ్యవహరిస్తున్న స్థాయి టిడిపి రెండు విధాల కష్టమే.బిజెపితో కలిసినా ముస్లిం ఓట్లు కాపాడుకోవాలని చంద్రబాబు పాచికలు వే స్తూనే వుంటారు. తాజాగా తాను రాజకీయాలకు దూరంగా వుంటానంటూనే చిరంజీవి పెద్ద పెద్ద నాయకులతో కలసికొన్ని సేవలు పనులు సాధించడానికి ప్రయత్నిస్తుంటానని అవకాశం అట్టిపెట్టుకున్నారు. మేము చంద్రబాబు కుటుంబాన్నే శాశ్వతంగా మోయలేము కదా అని జనసేన వారంటేమీ చాటున బిజెపి అల్లుకుపోతే ఎలా అనే ప్రశ్న టిడిపి నేతలది.పాలక పార్టీల ప్రయోజనాల ఘర్షణ దాంతోపాటే సామాజిక సమీకరణాల సంఘర్షణ వీటి వెనక వుందనేది కాదనలేని నిజం.
తన హిందూత్వ ఎజెండాతో బిజెపి ఇక్కడే ప్రవేశిస్తుంది, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారు టిడిపి అయినా ఎపికి పెద్దగా ఒరగబెడుతున్నదేమీ లేదు.పైపెచ్చు కష్టకాలంలోజగన్‌ నుంచి కాపాడి చంద్రబాబును మళ్లీ గద్దెక్కించినందుకు తమను మోయవలసిందేనన్న ఆలోచనలో బిజెపిది.పురంధేశ్వరి హయాంలో చంద్రబాబు తమ పార్టీని అదుపు చేస్తున్నారనే ఆగ్రహం బిజెపి నేతలది.కేంద్రంలో నడ్డా తర్వాతి అద్యక్షుడు నిర్ణయమై ఆ తర్వాత ఎపి,తెలంగాణ బిజెపి అద్యక్షుల ఎన్నిక కూడా జరిగితే గానీ ఈ విషయంలో స్పష్టత రాదు. ఎక్కడైనా సరే పొత్తు పెట్టుకున్న పార్టీలను నెమ్మదిగా చప్పరించడం బిజెపి వ్యూహంగా వుంటొంది.ఇక్కడ వారికి పవన్‌ కళ్యాణ్‌ ఆకర్షనీయమైన తోడుగా వున్నారు. రజనీకాంత,్‌ చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ల కోసం ప్రయత్నించి విఫలమైన బిజెపికి ఇది చాలా ఇష్టమైన పరిణామం.మీరు హిమాలయాలకు వెళతారా అని మోడీ అడిగారనేది వాస్తవానికి దిశా నిర్దేశమే కావచ్చు


Read More
Next Story