వేలు కాదు.. లక్షలు పెట్టి కొన్నారు. అన్నీ టేకు, ఇతర విలువైన వాటితో చేసినవే. ఆగస్టు నెలాఖరు వరకు అపురూపంగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మునిసిపాలిటీ చెత్తలా మార్చేసింది బుడమేరు.
ఆగస్టు నెలాఖరు వరకు ఇంట్లో ఫర్నచర్ అంతా సేఫ్‌గానే ఉంది. కుటుంబ సభ్యులంతా వీటిని అపురూపంగానే చూసుకున్నారు. డబుల్ కాట్ మంచాలు, డైనింగ్ టేబుళ్లు, ఎయిర్ కూలర్‌లు, ఏసీలు, డ్రెసింగ్ టేబుళ్లు, సోఫో సెట్లు, స్లీప్‌వెల్, కుర్లాన్ బెడ్లు, ఎల్‌ఇడీ టీవీలు, డబుల్ డోర్, సింగిల్ డోర్ ఫ్రెజ్‌లు, కంప్యూటర్ టేబుళ్లు, కంప్యూటర్ చైర్లు, మడత మంచాలు, దూది పరుపులు, నవారు మంచాలు, చెక్క కుర్చీలు, ఫైబర్ పిల్లోలు, దూది దిండ్లు ఇలా ఇంట్లోకి కావలసిన వస్తువులన్నివేలు, లక్షలు వెచ్చించి కొన్నవే. కూలీ నాలీ చేసుకునే వాళ్లు రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొన్నుకున్నవే. ఉద్యోగస్తులు, మధ్యతరగతి ప్రజలు ఇన్‌స్టాల్‌మెంట్‌లో సమకూర్చుకున్నవే. అన్ని వేలు, అన్ని లక్షలు పెట్టి సమకూర్చుకున్న విలువైన వస్తువులపైన కన్నెర్ర చేసేందేమో తెలియదు కానీ తన వరద నీటితో బుడమేరు వరద నీటితో అప్పేసింది. నాని పోయి వాసన పట్టేశాయి. దీంతో అవన్నీ పనికి రాకుండా పోయాయి. బుడమేరు వరద ప్రళయంలో చిక్కుకొని చీకుపట్టి పోయాయి. మునిసిపాలిటీ చెత్తకింద మారి పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు కొన్ని వేల వస్తువులను బుడమేరు తన వరదలతో పొట్టన పెట్టుకుంది.
మొన్నటి వరకు వరద నీటి ప్రవాహంతో నిండిపోయిన విజయవాడ సిటీ అజిత్‌సింగ్‌నగర్ ఇప్పుడు ఒక డంప్ యార్డ్‌గా మారిపోయింది. సింగ్‌నగర్, కండ్రిక, పాయకాపురం, సుందరయ్యనగర్, రాజరాజేశ్వరావుపేటలు, పైపుల రోడ్డు ఇలా ముంపునకు గురైన అనేక ప్రాంతాల నుంచి అజిత్ సింగ్ నగర్ పైపుల రోడ్డు ఏరియాలో నూజివీడు రహదారిపై కుప్పలుగా వేస్తున్నారు. అక్కడ నుంచి దానికి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధంగా మారింది.
దాదాపు 400 ట్రాక్టర్లలతో వరదలో పాడైపోయిన ఫర్నచర్‌ను తరలిస్తున్నారు. నగరంలోనే కాదు ముంపునకు గురైన చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా పాడైపోయిన ఫర్నచర్‌ను ఇక్కడకు చేరవేస్తున్నారు. దాదాపు 50కుపైగా టిప్పర్లతో ఈ ప్రాంతంలో డంపైన వస్తువులను దాదాపు 50కుపైగా టిప్పర్లతో మేజర్ డంపింగ్ యారై్డన వాంబేకాలనీలోని ఎక్సెల్‌ప్లాంట్‌కు తరలిస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రాంతాలతో పాటు ముంపునకు గురైన ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాంతాలు, గన్నవరం, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు వంటి ఏరియాల నుంచి కూడా ఇక్కడకు తరలిస్తున్నారు.
ఎంతో ఖరీదైన డబుల్ కాట్ మంచాలు, ఫ్రెజ్‌లు, కూలర్‌లు, టీవీలు, ఏసీలు అన్నీ చెత్తకింద వస్తున్నాయని, ఒక్కో వస్తువును చూస్తోంటే చాలా బాధేస్తోందని, ఎంతో కష్టపడి వీటిని కొనుక్కొని ఉంటారని, వరద ముంపుతో ఇవన్నీ చెత్తకింద మారిపోయని డంపింగ్ నుంచి టిప్పర్లకు లోడ్ చేసే బుల్డోజర్ డ్రైవర్ రమేష్ నాయక్ చెప్పారు. గత మూడు రోజుల నుంచి ఇక్కడే పని చేస్తున్నానని వేల వస్తువులు చెత్త కింద మారిపోవడం బాధగా అనిపిస్తోందన్నారు.
చెత్తగా మారిపోయిన ఈ ఖరీదైన పరుపులు, మంచాలు, టీవీలు, ఫ్రెజ్‌లు చూస్తోంటే మనసంతా బాధతో నిండి పోతోందని, పది రోజుల క్రితం వరకు ఎంతో ఉపయోగపడిన ఈ వస్తువులు వరదల కారణంగా చెత్తగా మారి పోయాయని, వైర్లు, ఐరన్, స్టీలు, రాగి వస్తువులు ఏమైనా దొరుకుతాయోమనని ఏరుకొనేందుకు వచ్చిన తన పేరును చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి చెప్పారు. కేజీ రాగి రూ. 400 వరకు ఉందని, ఐరన్ రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉందని, వైర్లకు కూడా మంచి రేట్లు ఉన్నాయని, వాటిని ఏరుకొని అమ్ముకుంటే తమ కుటుంబ గడుస్తుందని, ఇదే వృత్తి చేసుకుంటూ బతుకుతున్నామని అందుకే ఇక్కడకు వచ్చానని చెప్పారు. నిన్న(గురువారం) ఒక రూ. 400 వరకు వచ్చిందని, ఈ రోజు కూడా ఏమైనా దొరుకుతుందోమే అనే ఆశతో వచ్చానన్నారు. చాలా మంది వస్తున్నారని ఎవరకు ఏది నచ్చితే వాటిని ఏరుకొని పోతున్నారని చెప్పారు.
గత రెండు రోజుల నుంచి పాడైపోయిన వస్తువులను తోలుతున్నట్లు ట్రాక్టర్ డ్రైవర్ శ్రీను చెప్పారు. సింగ్‌నగర్ నుంచి లోడ్‌లు తోలుతున్నానని, ఏలూరు, గన్నవరం, నూజీవీడు నుంచి కూడా పాడైపోయిన వస్తులను ఇక్కడ డంప్ చేస్తున్నట్లు చెప్పారు. సింగ్ నగర్‌లోనే దాదాపు పాతిక ట్రాక్టర్ల వరకు ఇలాంటి వస్తువులను ఇక్కడకు తీసుకొస్తున్నాయని, ఈ రోజు ఉదయం నుంచి తన బండిని ఒక్కడ అద్దెకు పెట్టినట్లు మరో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వరరావు చెప్పారు.
రాళ్లు కొట్టి ఐరన్ వేరుకుంటున్నానని, ప్లాస్టిక్ వస్తువులు తీసుకోవడం లేదని ఐరన్ అయితే మంచి రేటు వస్తుందని, కేజీ రూ. 25 వరకు ఉంటుందని చెత్తను ఏరుకొని జీవించే పంజాబ్ నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడిన విజయ్ సింగ్ చెప్పారు. ఈ ప్రాంతంలో డంపింగ్ చేస్తున్నట్లు తనకు ఈ రోజే ఇక్కడకు వచ్చానని, పాడైపోయిన మంచాలు, ఇతర వస్తువులకు ఏమీ విలువ ఉండదని, అందుకే ఐరన్ వస్తువుల కోసం వచ్చానన్నారు.