‘విశాఖ ఉక్కుకు కొత్త సమస్యేమీ కాదు’.. విషయం కేంద్రం దృష్టికి వచ్చిందన్న మంత్రి
x

‘విశాఖ ఉక్కుకు కొత్త సమస్యేమీ కాదు’.. విషయం కేంద్రం దృష్టికి వచ్చిందన్న మంత్రి

విశాఖ ఉక్కు ఇప్పటికే ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటూ దినదిన గండంలా కొనసాగుతోంది. తాజాగా మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు విశాఖ ఉక్కుకు కోకింగ్ కోల్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.


విశాఖ ఉక్కు ఇప్పటికే ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటూ దినదిన గండంలా కొనసాగుతోంది. తాజాగా మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు విశాఖ ఉక్కుకు కోకింగ్ కోల్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. కోకింగ్ నిల్వలు అడుగంటుతున్న క్రమంలో ఉత్పత్తి నిలిచిపోకుండా నివారించడానికి విశాఖ ఉక్కు యాజమాన్యం ఆపసోపాలు పడుతోంది. గతంలో ఈ నిల్వలు సమృద్ధిగా ఉండేవి. కానీ కొంతకాలంగా కర్మాగారం టైమ్ బాగోక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతుండటంతో విదేశాల నుంచి రావాల్సిన కోకింగ్ కోల్ సరఫరా ఆగిపోయింది. తమకు బకాయిలు చెల్లిస్తేనే బొగ్గు అని సరఫరా చేసే సంస్థలు పట్టుబట్టడంతో ఏం చేయాలో అర్థం స్థితిలోకి వెళ్లింది విశాఖ ఉక్కు. ఈ క్రమంలోనే తన ఆశలన్నీ కేంద్ర ప్రభుత్వంపైనే పెట్టుకుంది విశాఖ ఉక్కు యాజమాన్యం. కేంద్రం సహాయం అందిస్తే కానీ తాము సర్వైవ్ కాలేమని, వెంటనే కేంద్ర స్పందించి తమకు నిధులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయినా దేనిపై ఇప్పటివరకు కేంద్రం స్పందించకపోవడం సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. విశాఖ ఉక్కుకు కోకింగ్ కోల్ కొరత సమస్య కొత్తదేమీ కాదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం దృష్టికి వచ్చిన సమస్య

‘‘విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు కొరత రావడం ఇదేమీ మొదటి సారి కాదు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటాం. బొగ్గు కొరత ప్రభావం ఉత్పత్తిపై తీవ్రంగా పడుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చింది’’ అని వెల్లడించారు. అంతేకాకుండా విశాఖ ఉక్కులో ఉత్పత్తి కొనసాగేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని, ఇప్పటికే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు కూడా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తానంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన ప్రకటనపై స్పందించడానికి భూపతిరాజు నిరాకరించారు.

ఇప్పటికే వరద సాయం

‘‘ఏపీని వరదలు ముంచెత్తాయి. వాటి కారణంగా వాటిల్లిన నష్టాన్ని పూరించడానికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. వరద నష్టానికి సంబంధించిన నివేదికలు కేంద్రానికి అందాయి. ఏపీని సాధ్యమైనంత మేర ఆదుకోవడానికి కేంద్రం సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే ఏపీలో జరిగిన నష్టాలపై నిధులు విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. అదే విధంగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం కూడా నిధులు తప్పకుండా విడుదల చేస్తుంది’’ అని భరోసా ఇచ్చారు.

విశాఖ ఉక్కు బొగ్గుకు ఇప్పుడేమైంది?

ఇలావుండగా ఐదారు నెలల క్రితం విశాఖ స్టీల్స్టాంట్ కోసం గంగవరం పోర్టుకు విదేశాల నుంచి నౌకలో 1.5 లక్షల టన్నుల ముడి సరకు వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న ఈ స్టీల్ ప్లాంట్కు కోకింగ్ కోల్ సరఫరా చేస్తున్న సింగపూర్కు చెందిన ఓ సంస్థ తమకు రావలసిన రూ.250 కోట్ల బకాయిలు చెల్లించేదాకా ఈ సరకును ప్లాంట్కు పంపించకుండా నిలువరించాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు అటాచ్మెంట్ ఇవ్వడంతో అప్పట్నుంచి ఆ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులోనే ఉండిపోయింది. దీనిపై కోర్టు నుంచి తీర్పు వెలువడాల్సి ఉంది. ఇంతలో ప్లాంట్లో ఉన్న కోకింగ్ కోల్ నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా విశాఖ పోర్టుకు కోకింగ్ కోల్ పంపేలా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ కోకింగ్ కోల్ను పంపిన సంగతి తెలుసుకున్న మరో సరఫరా సంస్థ సింగపూర్ సంస్థ మాదిరిగానే కోర్టుకెక్కి అడ్డుపుల్ల వేసింది. ఫలితంగా ఆ కోకింగ్ కోల్ (60-80 వేల టన్నులు)ను కూడా అటాచ్ చేయడంతో డెలివరీకి బ్రేకు పడింది. మరో సంస్థ ద్వారా కొంతమేర కోకింగ్ కోల్ను విశాఖ పోర్టుకు రప్పించుకుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు లారీలు / ట్రిప్లర్లలో ప్లాంట్కు రవాణా చేయడానికి వీలు పడలేదు. ఇలా ప్రధానమైన ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ (ఐసీసీ) సరఫరాకు దారులు మూసుకు పోతుండడంతో రోజు రోజుకూ సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది.

సింగపూర్ సంస్థతో చర్చలు..

మరోవైపు ముంచుకొస్తున్న సంక్షోభంతో సింగపూర్ సంస్థతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఆ సంస్థకు చెల్లించాల్సిన రూ.250 కోట్లలో ప్రస్తుతానికి రూ.180 కోట్లు చెల్లించడానికి, మిగిలిన సొమ్ముకు స్టీల్ ఇస్తామని యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలకు ఆ సంస్థకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇరువర్గాలు పరిష్కారానికి ఆమోదం తెలపడంతో దీనిపై కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సరకు కోర్టు అటాచ్మెంట్లో ఉండడం వల్ల విడుదలకు కొంత సమయం పట్టనుంది.

Read More
Next Story