అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం.. సొంత పార్టీలో వ్యక్తి పనేనా?
x

అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం.. సొంత పార్టీలో వ్యక్తి పనేనా?

భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై దుండగులు హత్యాయత్నం చేశారు. కారుతో ఢీకొట్టి.. మారణాయుధాలతో దాడికి ప్రత్నించారు.


ఆంధ్రలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ క్రమంలోనే నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు ఒక్కసారి పురులు విప్పుకున్నాయి. అందుకు నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌పై జరిగిన హత్యాయత్నమే నిదర్శనం. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం.. ఈ ఘటనకు ప్రధాన సాక్ష్యంగా మారింది. ఈ ఘటన అఖిలప్రియ నివాసం దగ్గరే జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తును వేగవంతం చేశామని పోలీసులు వివరిస్తున్నారు. ఈ దాడిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇది కక్ష సాధింపు చర్య అని కొందరు అంటే మరికొందరు మాత్రం ఓటమి భయంతో వైసీపీ గూండాలే ఈ పని చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగింది

మంగళవారం రాత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్.. ఆమె నివాసం బయట రోడ్డుకు అవతలి పక్క నుంచి ఇటువైపుకు వస్తున్నారు. ఇంటి దగ్గరకు వచ్చిన సమయంలో ఓ కారు అతివేగంగా వచ్చి కావాలని నిఖిల్‌ను ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో నిఖిల్ కాస్త దూరం ఎగిరి పడ్డాడు. వెంటనే కార్లోనుంచి ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలు తీసుకుని నిఖిల్‌పై దాడికి పరుగులు తీస్తూ వచ్చారు. ఇంతలో కాస్త తేరుకున్న నిఖిల్ వెంటనే లేచి అఖిల ప్రియ ఇంటిలోకి పరుగులు తీశాడు. దాంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన నిఖిల్‌ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడే చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు.

కక్ష సాధింపే కావొచ్చు: పోలీసులు

అయితే నిఖిల్‌పై జరిగిన దాడి కక్ష సాధింపు చర్యలు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ గతంలో నంద్యాలలో యువగళం యాత్ర నిర్వహించిన సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్ చేయిచేసుకున్నాడు. అందుకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏవీ సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇది వైసీపీ కుట్రే

ఇదిలా ఉంటే కొంతమంది మాత్రం ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో వైసీపీ వర్గాలే ఈ కుట్ర పన్నాయని, నిఖిల్‌పై హత్య చేయడం ద్వారా టీడీపీ వర్గాలను భయబ్రాంతులకు గురిచేయాలని భావిస్తున్నాయని తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, ఏజెంట్లపై జరిగిన దాడులు, మంగళవారం.. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి నానిపై జరిగిన దాడి నిదర్శనమని అంటున్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించలేదు. వైసీపీ వర్గాలు కూడా ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించలేదు.

వైసీపీపై అనుమానా రావాలనేనా

ఈ నేపథ్యంలోనే పోలింగ్ ముగిసిన తర్వాత ఈ దాడి జరగడంపై విశ్లేషకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతలేదనుకున్నా వైసీపీ వాళ్లు కూడా అంత బుర్ర లేని వారు కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రత్యర్థి వర్గాలపై హత్యాయత్నాలు చేయించడం వాళ్లకే మైనస్ అవుతుందని వాళ్లు కూడా ఆలోచిస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు భావిస్తున్నటలు స్వపార్టీలో పాత కక్షల కారణంగానే ఇప్పుడు దాడి చేస్తే ఆ నింద వైసీపీపై పడుతుందని, ప్రతి ఒక్కరూ వైసీపీనే అనుమానిస్తారనే సొంత పార్టీలో నిఖిల్ అంటే గిట్టని వారే ఇలా చేశారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story