పట్టు సడలకుండా పకడ్బంధీ వ్యూహం
కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు చంద్రబాబు పర్యటనలో ముఖ్య కార్యకర్తలు, కొన్ని సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు.
వైఎస్సార్‌సీపీ రూపొందించిన వ్యూహానికి ప్రతి వ్యూహం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రూపొందిస్తున్నారు. అరెస్ట్ తరువాత జైలు నుంచి విడుదలై మొదటి సారిగా తన సొంత నియోజక వర్గంలో పర్యటించారు. మూడు రోజులు సాగిన పర్యటన ఆద్యంతం ఉత్కంఠగా సాగిందని చెప్పవచ్చు.
స్థానిక సంస్థలది గెలుపే కాదు..
చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ఎలాగైనా దెబ్బతీయాలనే ఆలోచనలో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచర గణాన్ని ఉపయోగించి కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మెజారిటీ సాధించారు. దీంతో టీడీపీలో అలజడి మొదలైంది. అయినా తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, బలవంతపు రాజకీయాల ద్వారా స్థానిక సంస్థల్లో గెలిచినా అది గెలుపే కాదని, జనం తనవైపే ఉన్నారని చంద్రబాబునాయుడు చెబుతూ వస్తున్నారు.
నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన
మొదటి రోజు కుప్పం మండలంలోని బుడుంపల్లిలో సభ నిర్వహించారు. రెండో రోజు రామకుప్పం, శాంతిపురం మండలాల్లో చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ రెండు మండలాల్లో సభలు నిర్వహించారు. మూడో రోజు కుప్పం, మల్లెనూరుల్లో సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వ పనితీరుపరై విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మందీమార్బలంతో బెదిరింపులు, కేసులు పెట్టించి టీడీపీ క్యాడర్‌ను భయబ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపించారు. మల్లెనూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కనకదాసు విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. నియోకవర్గంలోని కురబలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తపేట మసీదులో ప్రార్థనలు చేసి ముస్లిమ్‌లతో సమావేశం నిర్వహించారు. కుప్పంలోని అన్నక్యాంటిన్‌ను సందర్శించి విషయాలు తెలుసుకున్నారు. కుప్పంలో క్యాకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను కార్యర్తల ద్వారా తెలుసుకున్నారు. తాను సీఎంగా ఉన్న ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా నియోజక వర్గానికి అందుబాటులో ఉండలేకపోయిన మాట వాస్తవమని అంగీకరించారు. ఇక నుంచి నేను మీ మధ్యనే ఉంటానని హామీ ఇచ్చారు.
జనసేన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం
కుప్పం నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. సుమారు వంద మంది జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. కుప్పంలో జనసేన కార్యకర్తలు అందరూ టీడీపీ నుంచి వెళ్లిన వారే కావడం విశేషం. పొత్తులో జనసేన టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కార్యకర్తలు చెప్పారు.
మునిసిపాలిటీగా మార్చి వైఎస్సార్‌సీపీ చేతుల్లోకి..
నగర సంచాయతీగా ఉండగా కుప్పం తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంది. నగర పంచాయతీని కాస్త మునిసిపాలిటీగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్చింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో మునిసిపాలిటీ వైఎస్సార్‌సీపీ చేతుల్లోకి పోయింది. 25 వార్డులు మునిసిపాలిటీలో ఉంటే అందులో 19 వార్డులు వైఎస్సార్‌సీపీ చేతుల్లో ఉన్నాయి. మునిసిపాలిటీలో రూ. 64 కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు నిర్మించారు. రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మించారు. వైఎస్సార్‌సీపీకి ఇది మేజర్ అచీవ్‌మెంట్‌గా చెప్పవచ్చు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే 2019లో కొంత మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కుప్పానికి దగ్గరలో ఉన్న పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కావడం వల్ల అక్కడి నుంచి పెద్దిరెడ్డి అనుచరులు కుప్పంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ గత ఎన్నికల్లో గట్టిగా పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 89 మంది సర్పంచ్‌లు ఉంటే 64 మంది వైఎస్సార్‌సీపీ వారు ఉన్నారు. నలుగురు ఎంపీపీలు, నలుగురు జడ్‌పీటీసీలు, 74 మంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచారు.
కేసులన్నీ ఎత్తేస్తాం..
టీడీపీ అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తామని చంద్రబాబు చెప్పారు. మీరంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిర్వహించిన సభల్లో వేల మంది ప్రజలు పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన టీడీపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. గత ఎన్నికల్లో చంద్రబాబు సుమారు 65వేలకు పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో దీనిని లక్షకు తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Next Story