ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నటిస్తున్నారా... నటనలో జీవిస్తున్నారా... కల్పితాలు కాకుండా నిజజీవితంలో ఆయనను అంతగా ప్రేరేపించిన అంశాలు ఏమిటి?


పవన్ కళ్యాణ్ వారానికో వేషధారణతో జనం ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన మాటలు, స్టైల్ సినిమాల్లో ఎలా ఉంటున్నాయో నిజజీవితంలోనూ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే పాలనలో రెండో ఆలోచన ఏదైనా ఉందంటే అది ఆయనదేనని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో కావడం వల్ల స్వతహాగా అన్ని వయసుల వారిలోనూ అభిమానులు ఉన్నారు. అందువల్ల పవన్ ఏ పనిచేసినా అది అభిమానుల అందరి కోసమే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. సినిమాలు అంటే కల్పితాలు ఉంటాయని అందరికీ తెలుసు. రాజకీయాలు అంటే కొన్ని కల్పితాలు ఉండొచ్చు. కొన్ని నిజాలు ఉండొచ్చు. పరిపాలన అంటే అన్నీ నిజాలు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎదురవుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అందుకు తగిన విధంగా అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. యువతులు కిడ్నాప్ కు గురికావడం, ఈవ్ టీజింగ్ కు గురికావడం వంటి అంశాలపై అప్పటి కప్పుడు స్పందించారు. సినిమా స్టైల్ లోనే సమస్యలను పరిష్కరించారు. విజయవాడకు చెందిన ఒక యువతిని మోసం చేసి ఓ యువకుడు తీసుకుపోయాడని ఆ యువతి తల్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి జమ్ముకాశ్మీర్ లో ఉన్న ఆ యువతిని పోలీసుల ద్వారా రెండో రోజు ఇంటికి రప్పించారు.

తిరుపతి పట్టణంలోని ఓ వీధిలో యువతులు, ముసలి వాళ్లను కుర్రవాళ్లు వేధిస్తున్నారని పోస్టులో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పవన్ కళ్యాణ్ అప్పటి కప్పుడు పోలీసులను ఆ వీధిలోకి పంపించి అక్కడి ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇప్పంచి సినిమా స్టైల్ లోనే సమస్యను పరిష్కరించారు.

ఎన్నికల ప్రచార సమయంలో చిన్న టవల్ ను భుజంపై వేసుకుని అప్పుడప్పుడు తలకు చుట్టకుని చేగువేరా మాదిరి కనిపించారు. దేశం కోసం, నమ్మిన సిద్దాంతాల కోసం త్యాగాలు చేసిన వారిని అనుసరించే కార్యక్రమాలు చేశారు. పొలాల్లో, కార్లలో ఎక్కడంటే అక్కడ కూర్చుని భోజనాలు చేయడం, చెట్ల మధ్య తిరగటం వంటిది చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పాలనలోనూ తనదైన స్టైల్ చూపిస్తున్నారు. సమీక్షలు జరిగే సమయంలో అధికారులు చెప్పిన వన్నీ విని స్మగ్లర్ల భరతం పట్టాలని ఆదేశించారు. అడవులు నాశనం చేస్తున్న వారిని వదలొద్దని హుకుం జారీ చేశారు. గతంలో సినిమాల్లో హీరో అంటే తప్పులు చేసేవాడు కాదనే సందేశం ఉండేది. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడం కూడా హీరోయిజం కింద సినిమాలు వస్తున్నాయని పుష్ప సినిమాను ఉద్దేశించి మాట్లాడి సంచలనం స్రుష్టించారు.

ఇప్పుడు జరుగుతున్న చర్చ ఆయన వస్త్ర ధారణ గురించి. వస్త్రధారణలో ఎప్పుడూ కొత్తదనంతో పవన్ కళ్యాణ్ కనిపనిస్తారు. లాల్చీ ఫైజామాతో ఒకసారి, అమ్మ వారి దీక్షల వస్త్రాలతో మరోసారి, స్వామి వారి దీక్షల ధారణ వస్త్రాలతో మరో సారి కనిపించి పలువురిని ఆశ్చర్య పరుస్తున్నారు. సినిమాల్లో ఓ రేంజ్ లో అభిమానులు ఉన్న వారిలో ఎన్ టి రామారావు తరువాత రాజకీయాల్లోకి వచ్చిన వారిలో పవన్ రెండో మూడో వ్యక్తిగా చెప్పకోవచ్చు. పవన్ అన్న చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా సాధారణ వస్త్రాలతోనే ఎక్కువగా కనిపించారు. ముందు తరానికి సంబంధించి 1982లో పార్టీ పెట్టి, 83లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఎన్ టీ రామారావు వెరైటీ దుస్తుల్లో కనిపించే వారు. ఎన్టీ రామారావు ప్రతి అంశాన్ని అవపోషణ పట్టిన వ్యక్తిలా కనిపిస్తారు. ప్రచారంలో ఎన్నో రకాల వేషధారణలతో ప్రజలను ఆకట్టుకున్నారు. పంచకట్టులోనూ, ప్యాంటూ షర్టులోనూ, లాల్చీ ఫైజామాలోనూ, రంగురంగుల వస్త్రాల ధారణలోనూ తనకు ఎవ్వరూ సాటిరారనిపించారు. ఇవన్నీ సినిమాల్లో చేసినవి కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేసినవి. తెల్లటి పంచ, చోక్కా, మెడలో అంచు కండువాతో ఒకసారి కనిపిస్తే మరో సారి సాధారణ దుస్తుల్లో కనిపిస్తారు. కాషాయ వస్త్రాలు ధరించారు. తలపాగాతో అసెంబ్లీకి వచ్చిన రోజులు ఉన్నాయి. కాకి ప్యాంటు, షర్టు ధరించి నేను కార్మికుడినని చాటి చెప్పిన రోజులు ఉన్నాయి.

ఆ తరువాత ఇప్పుడు రాజకీయాల్లో రకరకాల వస్త్రధారణలతో కనిపిస్తున్నది పవన్ కళ్యాణ్. అధికారం చేపట్టిన తరువాత వారాహి అమ్మవారి దీక్ష 11 రోజులు చేపట్టి వారణాసి వెళ్లి అక్కడ దీక్ష విరమించారు. అప్పుడు పసుపు పచ్చ చొక్కా, పంచ కట్టుకున్నారు. నుదిటిపై పెద్ద పొడవాటి బొట్లును పెట్టారు. ఆహారంలో కూడా నియమాలు పాటించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. యోగాలు నాలుగు ఉంటాయి. అందులో భక్తి యోగం, ముక్తి యోగం, జ్నానయోగం, ఖర్మయోగం ఉంటాయి. భక్తితో వారాహి అమ్మవారిని కొలిచి తన భక్తిని నిరూపించుకున్నారు. ముక్తి కోసం ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. జ్నానయోగానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివానని, ఎందరో మహాను భావుల గురించి తెలుసుకున్నానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ప్రస్తుతం ఖర్మయోగంలో ఉన్నట్లున్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, అందుకు ప్రయాశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించి దీక్షను మొదలు పెట్టారు. ఈ దీక్ష కూడా 11 రోజుల పాటు ఉంటుంది. ఈ దీక్షలో వేసుకున్న దుస్తులు లైట్ పసుపు పచ్చ రంగులో ఉణ్నాయి. పంచ, చొక్క ధరించారు. దీక్షల సందర్భంగా గడ్డం తీయరు. క్రాప్ కూడా చేయించరు. ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత జుట్టు ఎక్కువగా జూలు కనిపిస్తోంది. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ మెట్లను కడిగి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అది కూడా ఒక ప్రత్యేక ఎపిసోడ్ లా కనిపించింది.

రాజకీయ నాయకుడైన తరువాత అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయన మాట్లాడిన మాటలు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా ఉంది. అవేంటంటే...

సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే. ప్రతిసారీ కూర్చోబెట్టి మేము డిఫైండ్ చేసుకోలేం. కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేమేమి చేస్తాం.

ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్రా వాళ్లకి. ఎప్పుడు ఆంధ్రా అనే భావన వస్తుందో నాకు తెలియదు. కులం ప్రాతిపదిక కొంతకాలం వరకు జరిగింది. 2019 తరువాత కులం కూడా పోయింది. సొంత కులాన్ని కూడా వెనకేసుకు రావటం లేదు. ఆంధ్ర భావన ఎలాగూ లేదు. కనీసం కుల భావనన్నా తెచ్చుకోని బాగు చేయండి ఈ రాష్ట్రాన్ని. నేను మనస్పూర్తిగా అభినందిస్తా.

నాకు కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిష్టియనబ్బా. నాకూతురు తల్లి రష్యన్ చర్చిలో బాప్టిజం తీసుకుంటామంటే తీసుకోమని చెప్పా.

మానాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగించిన దీపంలో సిగరెట్ వెలిగించి దేవుడు లేడు, దెయ్యం లేడని చెప్పేవాడు.

గొడవలు పెట్టేది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చెయ్యరు. వాళ్లకు రాదు.

ఈ రోజున బీఫ్ మాంసం గురించి ఇంత చర్చ జరుగుతుంటే నాకనిపించింది. బీఫ్ తినాలంటే తిని ముందుకెళతాం తప్ప దాన్ని వేరేలా చూడము. అంటే తిండి ఏది తిన్నామన్నది కాదు. శాఖాహారమే తింటే అందరు గొప్పోళ్లు అయిపోతారంటారు. మరి గుజరాత్ లోని గోద్రాలో ఎందుకు అంత ఘోరం జరిగింది.

నాకు జీసెస్ క్రైస్ట్ అంటే ఎందుకు ఇష్టమో చెబుతాను. నా డైరీలో రాసుకున్నా. నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు పరుగెత్తబోతే మోకాలుకు రక్తం వచ్చింది. నాకు కాలు నొప్పనిపించింది. అప్పుడు నాకు మేరీ మాత గుర్తొచ్చింది.

నాకు ఇష్టమైన చేగువీర పుట్టిన రోజు. రాజకీయాల్లో పోరాట స్పూర్తిని తెలియజేసిన మహాను భావుల్లో చేగువీర స్పూర్తి.

ముస్లిమ్ ల వద్ద ప్రార్థనలో మాట్లాడుతూ గడ్డం పెంచుకుంటే ఆనందం. టోపీ నేను ఇష్టంతో పెట్టుకున్నా అన్నారు.

ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పేదే జైభీమ్ అనే నినాదం. రాజకీయాల్లోకి, సినిమాల్లోకి రాక ముందు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అర్థం చేసుకున్న వాడిని. చదివిన వాడిని. షోషల్ బ్యాక్వర్డ్ నెస్ ను పోగొట్టాలన్న మహాను భావుడు అంబేద్కర్.

Next Story