ప్రొఫెసర్‌ శాంతమ్మ.. అమెరికా ఉపాధ్యక్షుని భార్యకు ఏమవుతారు?


ఉషా చిలుకూరి.. ఈమె పేరు ఇటీవల కాలంలో బాగా పాపులరైంది. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీమణి ఆమె.. ఆ దేశ రెండో ప్రథమ మహిళ కావడమే అందుకు కారణం. ఇంతకీ ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్‌తోనూ, ముఖ్యంగా విశాఖపట్నంతోనూ ముడిపడి ఉన్నాయి. జేడీ వాన్స్‌ దంపతులు సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో అధికారిక పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార యంత్రాంగం ఉషా చిలుకూరి పూర్వీకులు పుట్టిన ఊరితో పాటు ఆమె బంధుగణం పుట్టుపూర్వోత్తరాలపై ఆరా తీస్తోంది!

ఉషా చిలుకూరి తాత వాళ్ల ఊరు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని వడ్లూరు. ఉష తాత అన్నదమ్ములు నలుగురు. వారిలో నాలుగో సోదరుడు రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ కుమార్తె ఉష. రాధాకృష్ణ దంపతులు 1980లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 1986 జనవరి 6న కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో రాధాకృష్ణ, లక్ష్మి దంపతులకు ఉష జన్మించారు. అక్కడే పెరిగారు. ఉన్నత విద్యనభ్యసించారు. ఉష అమెరికాకు చెందిన జేడీ వాన్స్‌ను వివాహమాడారు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాకు అధ్యక్షుడిగాను, జేడీ వాన్స్‌ ఉపాధ్యక్షుడిగాను ఎన్నికయ్యారు. దీంతో ఒక్కసారిగా భారత్‌లో ఉష పేరు మార్మోగి పోయింది. మన ఉష.. అమెరికా రెండో ప్రథమ పౌరురాలైంది. జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడయ్యాక ఆ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఏప్రిల్‌ 21 నుంచి 24 వరకు భారత్‌లో అధికారిక పర్యటనకు వస్తున్నారు. సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో వాన్స్‌ దంపతులకు గౌరవ విందు ఇస్తున్నారు. 22న రాజస్థాన్‌లోని జైపూర్‌ కోటను, 23న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అనంతరం 24న వీరు అమెరికాకు తిరుగు పయనమవుతారు.
అప్రమత్తమైన అధికారులు..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉష దంపతులు భారత్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఉష పూర్వీకుల సొంతూరు వడ్లూరులో చిలుకూరి కుటుంబీకుల గురించి వివరాలు సేకరించారు. వారి నేపథ్యం అడిగి తెలుసుకున్నారు. దాదాపు 70 ఏళ్లకు ముందు ఆ ఊరిలో ఉష తండ్రి, తాత వ్యవసాయం చేసే వారని, ఆ ఊళ్లో సాయిబాబా గుడి కట్టేందుకు స్థలాన్ని దానంగా ఆ కుటుంబీకులే ఇచ్చారని వడ్లూరు గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడా ఊళ్లో ఉష కుటుంబ సభ్యులెవరూ లేరు.
ప్రొఫెసర్‌ శాంతమ్మ
ఉష పెదనాన్నమ్మ శాంతమ్మతో భేటీ..
ఇక ఉష పెద నాన్నమ్మ ప్రొఫెసర్‌ చిలుకూరి శాంతమ్మ విశాఖలోనే స్థిరపడ్డారు. ఇప్పుడు శాంతమ్మ వయసు 97 ఏళ్లు. సెంచరీకి చేరువలో ఉన్న ఆమె ఇప్పటికీ విశాఖకు 50 కిమీల దూరంలో ఉన్న సెంచూరియన్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. మరోవైపు వేదిక్‌ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లోని స్పెక్ట్రోస్కోపీ, భరధ్వాజ మహర్షి విమాన శాస్త్రంపైనా ఆమె సుదీర్ఘ పరిశోధనలు సాగిస్తున్నారు. ఉష చిలుకూరి బంధువులెవరైనా విశాఖలో ఉన్నారా? అని ఆరా తీసిన అధికారులకు ప్రొఫెసర్‌ శాంతమ్మ ఉన్నారని తెలుసుకున్నారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారి ఒకరు సోమవారం విశాఖ అక్కయ్యపాలెం అబీద్‌నగర్‌లో ఉంటున్న ప్రొఫెసర్‌ శాంతమ్మ ఇంటికి వచ్చారు. ఉషా చిలుకూరి మీకేమవుతారు? ఎలాంటి బంధుత్వం ఉంది? ఆమెను ఎప్పుడైనా కలిశారా? జేడీ వాన్స్‌ అమెరికా ఉపాధ్యక్షుడయ్యాక ఉషా చిలుకూరి మీతో మాట్లాడారా? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ఉషా చిలుకూరి తమ పూర్వీకుల గురించి ఆరా తీస్తే చెప్పడం కోసం మీ నుంచి ఈ వివరాలు తెలుసుకోవడానికి వచ్చామని అ అధికారి చెప్పి వెళ్లిపోయారు.
ఉష పెద నాన్నమ్మ శాంతమ్మతో ధ పెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధి కోటేశ్వరరావు బొల్లం
నా పాఠాలు మా ఉషాకు నచ్చాయట..
నా మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ కూతురే ఉష. ఉష బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడే చూశాను. ఆ తర్వాత చూడలేదు. అమెరికాలోనే పుట్టి.. అక్కడే పెరిగింది. అక్కడే బాగా చదువుకుంది. ఎప్పుడైనా ఇండియా వచ్చినా విశాఖ వచ్చినట్టు నాకు గుర్తు లేదు. ఉష మేనత్త, నా బావగారి కుమార్తె శారద చెన్నైలో మత్తు వైద్యురాలిగా ఉన్నారు. ఉషకు ఆమెతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉష భర్త జేడీ వాన్స్‌ ఉపాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారానికి కూడా శారద వెళ్లారు. అమెరికా దేశపు రెండో ప్రథమ మహిళ అయ్యాక ఉష నా గురించి మా బంధువులను అడిగి తెలుసుకుందట. సెంచూరియన్‌ యూనివర్సిటీలో నేను చెబుతున్న ఫిజిక్స్‌ పాఠాలు, నేనిచ్చే లెక్చర్స్‌ ఆమెకు బాగా నచ్చాయని చెప్పిందట. ఇప్పుడు ఉషా దంపతులు మన ఇండియా పర్యటనకు వస్తున్నారని అధికారుల ద్వారా నిన్ననే తెలిసింది. వాళ్ల పర్యటనలో విశాఖ గాని, ఆంధ్రప్రదేశ్‌ గాని లేదు. ఉంటే నన్ను కలవడానికి వచ్చేవారే అని ప్రొఫెసర్‌ శాంతమ్మ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Next Story