చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీని విమర్శించడంలో వంశీ, కొడాలి ప్రసిద్ధి చెందారు. ఒంటి కాలితో లేచి తీవ్ర వ్యాఖ్యలు చేసే వారు.


ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని మిత్ర ధ్వయంకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరిద్దరు మంచి స్నేహితులు కావడం కూడా అందుకు ఓ కారణం. తొలుత వీరు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టినా మిత్రులుగానే జంటగానే చేసుకుంటూ వచ్చారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జూ. ఎన్టీఆర్ మంచి మిత్రులు కూడా. వీరు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే నాటికి పెద్ద ఎన్టీఆర్‌ లేక పోయినా.. ఒకే సామాజిక వర్గానికి చెందిన పార్టీ కావడంతో ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెట్టారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కోసం పని చేశారు. కొడాలి నాని గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. వల్లభనేని వంశీ మాత్రం 2009లో విజయవాడ పార్లమెంట్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. కొడాలి నాని అదే గుడివాడ నుంచి 2009లో కూడా టీడీపీ అభ్యర్థిగానే గెలుపొందారు.

తర్వాత రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడం.. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా ఏర్పడటం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం, వంశీ మాత్రం అదే టీడీపీలోనే కంటిన్యూ కావడం జరిగింది. తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా.. కొడాలి నాని మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గుడివాడ నుంచి గెలుపొందారు. తర్వాత 2019 ఎన్నికల్లో కొడాలి నాని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి గెలుపొందగా, వంశీ గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొడాలి నానికి మంత్రి పదవి దక్కింది. టీడీపీ ఓడి పోవడంతో గన్నవరం నుంచి గెలిచిన వంశీ జగన్‌ ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతూ ఆ పార్టీలో చేరారు.
అప్పటి వరకు వేరే పార్టీలో ఉంటున్నా.. వీరిద్దరి మధ్య స్నేహ బంధం మాత్రం ఏ ఢోకా లేకుండా కొనసాగింది. వంశీ టీడీపీని వీడటంలో కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. ఒకే పార్టీలోకి వచ్చిన ఈ మిత్ర ధ్వయం జూలు విదిల్చారు. వీరిద్దరు టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్‌లైన ఒంటి కాలితో లేవడం మొదలెట్టారు. సందర్భం వచ్చినప్పుడల్లా జూలు విదుల్చుతూ వారిపైన తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. సన్నాసి, పప్పు అంటూ చంద్రబాబు, లోకేష్‌లపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు అసెంబ్లీలోను, ఇటు ప్రెస్‌ మీట్లలో వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబుపైన దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీల మీద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులంతా చేసిన విమర్శలు ఒక ఎల్తైతే.. కొడాలి నాని, వల్లభనేని వంశీ చేసిన విమర్శలు ఒక ఎత్తుగా మారింది. వీరిద్దరి విమర్శలే అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరి మీదా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరి వ్యాఖ్యలకు చంద్రబాబు మీడియా ముఖంగా ఏకంగా కన్నీళ్లు పెట్టకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు, లోకేష్‌కు, టీడీపీ శ్రేణులకు ఈ మిత్ర ధ్వయం ప్రధాన టార్గెట్‌ అయ్యారు.
2024 ఎన్నికల ముందు చేపట్టిన యువగళం పాద యాత్రలో కొడాలి నాని, వల్లభనేని వంశీల మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం సన్నాసిని, గన్నవరం సైకోని కడ్రాయర్ల మీద రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం ఖాయమని కొడాలి నాని, వల్లభనేని వంశీలను ఉద్దేశించి లోకేష్‌ శపథం చేశారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మీద కేసులు తెరపైకి తెచ్చారు. లా విద్యార్థులు, వలంటీర్ల ద్వారా కొడాలి నానిపై కేసులు పెట్టించారు. చంద్రబాబు, లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదు చేశారు. అదే మాదిరిగా వల్లభనేని వంశీ మీద కూడా కేసులు తెరపైకి తెచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపైన దాడితో పాటు కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం వంటి కేసులు తెరపైకి తెచ్చారు.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు తప్పవని భావించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏపీని వదిలి హైదరాబాద్‌కి వెళ్లి పోయారు. కొడాలి నాని గుడివాడను, వల్లభనేని వంశీ గన్నవరాన్ని వదిలి పెట్టి హైదరాబాద్‌కి మకాం మార్చారు. తొలుత వీరిద్దరి మీద కేసులు తెరపైకొచ్చినా.. అరెస్టుల వరకు వెళ్లలేదు. కొద్ది రోజులయ్యాక వీరి పని చూడచ్చు అనుకున్నారేమో కానీ తాజాగా వీటిని బయటకు తీశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి అరెస్టు తప్పదని భావించారు. ఈ నేపథ్యంలో తొలుత వల్లభనేని వంశీ ఎపిసోడ్‌ను తెరపైకి తెచ్చారు. వంశీని అరెస్టు చేయడంతో ఇక మిగిలింది కొడాలి నానినే అని.. ఆయన అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్‌ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.


Next Story