గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోను, సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులోను వంశీకి బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.


గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ జైలు నుంచి బయటకు రావాలని చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. విజయవాడ జైలు నుంచి ఎలాగైనా బయటకు రావాలని వంశీ ప్రయత్నాలు చేస్తోంటే.. వాటికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ చట్టపరంగానే వంశీని విజయవాడ జైల్లోనే ఉంచాలనే విధంగానే పోలీసులు, న్యాయస్థానాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు వంశీ చేస్తున్న బెయిల్‌ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. దీంతో ఇప్పట్లో వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి బచటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాయంలో డీటీపీ ఆపరేటర్‌గా పని చేసిన సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీ బెయిల్‌ కోసం పిటీషన్‌ పెట్టుకున్నారు సత్యవర్థన్‌ తరపున న్యాయవాదులు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సత్యవర్థన్‌ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్‌ను నిరాకరిస్తూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటీషన్‌ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టేసింది. సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో ఐఓకు, ప్రాసిక్యూషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌లకు న్యాయ స్థానం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బెయిల్‌ పిటీషన్‌ వాదనల సందర్భంగా కోర్టును దిక్కరించేలా వ్యవహరించారని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్‌ పిటీషన్‌ల మీద మూడు విడతలుగా ఇరు వర్గాల వాదలను న్యాయ స్థానం వినింది. అనంతరం వంశీ బెయిల్‌ పిటీషన్‌ను డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వంశీ బెయిల్‌ పిటీషన్‌కు సంబంధించి వాదనల సమయంలో విచారణాధికారి, ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపిస్తున్న సయమంలో కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సమయాన్ని వృధా చేశారని న్యాయాధికారి వెల్లడించారు. దీంతో పాటుగా కొన్ని అనవసర వ్యాఖ్యలు కూడా చేసినట్లు అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా విజయవాడ సీఐడీ కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్‌ను నిరాకరిస్తూ, ఆ పిటీషన్‌ను కూడా గురువారం కొట్టేసింది. వంశీతో పాటు నిందితులుగా ఉన్న మరో నలుగురికి కూడా బెయిల్‌ మంజూరు చేసేది లేదని, వారి బెయిల్‌ పిటీషన్‌లను కొట్టిపారేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్‌ ముగియనుండటంతో వంశీకి మరో మారు రిమాండ్‌ను పొడిగించారు. శుక్రవారంతో రిమాండ్‌ గడువు ముగియనుండటంతో వంశీని విజయవాడ జైలు నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు వంశీతో పాటు మరో నిందితుడు లక్ష్మీపతిని కూడా కోర్టులో హాజరు పరిచారు. ఏప్రిల్‌ 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వంశీకి స్థానిక కోర్టుల్లో బెయిల్‌ నిరాకరణ కావడంతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనల్లో ఉన్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.
మరో వైపు వల్లభనేని వంశీ కేసులో గన్నవరం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒక రోజు పోలీసు కస్టడీకి అనుమతులు మంజూరు చేస్తూ క్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆత్కూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఒక భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఉంగుటూరు పోలీసు స్టేషన్ లో వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. దీని మీద పోలీసులు విచారణ చేపట్టేందుకు వీలుగా కస్టడీకి అప్పగించే విధంగా అనుమతులు మంజూరు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీని మీద విచారణ చేపట్టిన గన్నవరం కోర్టు ఒక రోజు కస్టడీకి వంశీని అప్పగిస్తూ అనుమతులు మంజూరు చేసింది.
Next Story