భీమిలీ బీచ్‌లో వంశీ కెరటం ఎగిరేనా!
x
వంశీకృష్ణ

భీమిలీ బీచ్‌లో వంశీ కెరటం ఎగిరేనా!

పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వేటుతో ఎమ్మెల్సీ పదవి పోయింది. ఆశించిన టిక్కెట్టుపై మరో నేత కన్ను పడింది. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకు వచ్చిన కష్టం ఏంటి...?


తంగేటి నానాజీవిశాఖపట్నం: భీమిలి టిక్కెట్టుపై ఆశపడ్డారు... అది కాకపోతే విశాఖ దక్షిణ సీటు గ్యారంటీ అనుకున్నారు... ఈలోగా అనర్హత వేటుతో ఎమ్మెల్సీ పదవి పోయింది. తాను ఆశించిన దక్షిణ నియోజకవర్గ సీటుపై మరో నేత కన్ను పడింది. దీంతో ఎమ్మెల్సీ పదవి పోయినా... దక్షిణ సీటు దక్కించుకునేందుకు వైసీపీ నుంచి ఇటీవల జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కచ్చితంగా సీటు ఇస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీతోనే పార్టీలోకి వెళ్లిన వంశీకృష్ణకు పార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది.

విశాఖ దక్షిణ జనసేనలో అలజడి...

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేనలో అలజడి రేగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దక్షిణ సీటుపై జనసేన అధినేత హామీతో కొండంత ఆశ పెట్టుకున్నారు. అయితే తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు వంశీకి గుబులు పుట్టిస్తున్నాయి. పార్టీలో ఇంకా చేరకపోయినప్పటికీ ఇటీవల వైసిపి నుంచి బయటికి వచ్చిన సీతంరాజు సుధాకర్ ఇదే నియోజకవర్గ టికెట్ ను ఆశిస్తున్నారు. ఎలాగైనా ఈ టిక్కెట్టు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే దక్షిణ నియోజకవర్గ జనసేన కార్యకర్తలు సుధాకర్ కు సీటు కేటాయించాలంటూ మీడియా కు ఎక్కారు. దీంతో దక్షిణ నియోజకవర్గ జనసేనలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.

తెరపైకి సీతం రాజు...

సీతం రాజు సుధాకర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం వైసీపీ పార్టీ పదవికి రాజీనామా చేసి బయటికి వచ్చేసారు. ఈయన టిడిపిలో చేరుతారని కొన్నాళ్లు, జనసేనలో చేరుతారని కొన్నాళ్లు, కాదు బిజెపిలో చేరుతారని ఇంకొన్నాళ్ళు ప్రచారం సాగింది. అయితే ఇంతవరకు తటస్థంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన రాజకీయాల్లో మెరిసారు. తాను స్వయంగా రంగంలోకి దిగకుండా జనసేనలో తనకున్న అనుచర గణంతో పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా సీతం రాజు సుధాకర్ కు విశాఖ దక్షిణ జనసేన టికెట్ ఖరారు చేయాలంటూ దక్షిణ నియోజకవర్గ జనసైనికులు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ' సీతం రాజు సుధాకర్ కు టికెట్ ఇవ్వండి... ఆయన్ను గెలిపించి పవన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం... అంటూ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు ఎర్రం శెట్టి సురేష్, లుక్స్ గణేష్, తెలుగు అర్జునులు మీడియాకు ఎక్కారు.లేదంటే రానున్న ఎన్నికల్లో తమ వర్గం సహకరించబోయేది లేదని స్పష్టం చేశారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ టిక్కెట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

వంశీ ప్రయత్నాలు ముమ్మరం...

వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ షిప్పింగ్ కంపెనీ అధినేతగా విశాఖ వాసులకు సుపరిచితుడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీ రెండుసార్లు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009 ఎన్నికల్లో పిఆర్పి నుంచి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి టిడిపి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా జనసేనలో చేరి భీమిలి టిక్కెట్ను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా భీమిలి టికెట్టు జనసేనకు రాదని నిర్ధారణ చేసుకున్నాక... విశాఖ దక్షిణ టిక్కెట్టుపై అధినేత పవన్ కళ్యాణ్ హామీ పొందారు. దక్షిణ జనసేన టిక్కెట్టు తనదేనన్న ధీమాతో నియోజకవర్గంలో కార్యకర్తల సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సడన్ గా తెరపైకి సీతం రాజు సుధాకర్ రావడంతో తన సీటు కాపాడుకునే ప్రయత్నాల్లో వంశీ నిమగ్నమయ్యారు.


Read More
Next Story