
మట్టి నుంచి వందల కోట్లు పిండుకున్న వంశీ ముఠా!
"తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు"నంటే ఇదేనేమో! గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మహా ఘనాపాటి అని ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది.
"తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు"నంటే ఇదేనేమో! టీడీపీ మాజీ నాయకుడు, వైసీపీ ప్రస్తుత నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మహా ఘనాపాటి అని ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. చిన్నవయసులో ఇంతటి ప్రతిభాపాటవాలను వంటబట్టించుకున్న వంశీ.. అచ్చంగా మట్టి నుంచే కొన్ని వందల కోట్లు కొల్లగొట్టారని నిఘా విభాగం నిగ్గుతేల్చింది. ఇంతకాలం ఈ నిఘా విభాగం ఏమైందన్న అనుమానాల్ని పక్కన బెడితే ఇప్పుడు పాలకులు మారారు గనుక దాని దృష్టి కోణం కూడా మారి ఉంటుంది. అది వేరే కథ.
వంశీ ఎలా దోచేశారంటే...
దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం.. డిటెక్టివ్ నవలను మించిన కథనాన్ని వెల్లడించింది. ఈ వంశీమోహన్ అనే మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏర్పాటు చేసుకున్న మాఫియా ముఠా- మన్ను, మశానం, రాళ్లూ రప్పలు, కంకర వంటి వాటిని చక్కెరలాగా బొక్కేశారు. గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాల ద్వారా రూ.200 కోట్లకు పైగా కొల్లగొట్టారు.
ఈ తవ్వకాల కోసం, తొవ్విన మట్టిని రవాణా చేయడ కోసం, ఎవరైనా అడ్డం వస్తే నయానా బయానా బెదిరించడం కోసం అన్ని హంగులున్న ఓ ముఠాను తయారు చేసుకున్నాడు. మొత్తం 13 మంది ఈ ముఠాలో ఉన్నారు. వీరందరూ వంశీకి అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులు. ఈ 13 మందికి 13 రకాల బాధ్యతలను అప్పగించారు. ఒకడు స్థలం చూసొస్తాడు, ఇంకొడడు జేసీబీలు తీసుకువస్తాడు, ఇంకొకడు లారీలకు ఎక్కిస్తాడు, ఇంకొకడు డబ్బులు వసూలు చేస్తాడు.. ఇలా ప్రభుత్వ శాఖల మాదిరిగా వంశీ మోహన్ కూడా రకరకాల దందా శాఖల్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ తవ్వకాల నెట్‌వర్క్‌ను తయారు చేశారు.
ఈ గ్యాంగ్ లోని వ్యక్తులు, వారి పని విభజన ఇలా ఇంది.
1. ఎస్.రమేష్: లాజిస్టిక్స్.
2. కె.శ్రీను: తవ్వకాలు జరిగే స్థలాల నిర్వహణకు కార్మికులను, యంత్రాలను సమకూర్చడం
3. ఎం.వెంకటేశ్: మట్టి, గ్రావెల్, రాళ్లు రవాణా
4. కడియాల సతీష్‌కుమార్: అక్రమ తవ్వకాల పర్యవేక్షణ
5. సలివేంద్ర రామకృష్ణ: అక్రమ తవ్వకాలు, వాటి రవాణా పర్యవేక్షణ
6. అన్నె రాజేశ్: తాత్కాలిక పర్మిట్ల తయారీ
7. పడమటి సురేష్: గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాల్లో భాగస్వామి
8. షేక్ నాగుల్‌మీరా: రవాణాలో కీలక భాగస్వామి
9. దేవిరెడ్డి కిరణ్‌రెడ్డి: రాజకీయనేతలతో, అధికారులతో లాబీయింగ్
10. కిల్లా శివకుమార్, 11. ఎన్.మోహన్‌కుమార్, 12. 4బీ కన్‌స్ట్రక్షన్స్, 13. ఆర్తా వెంచర్స్ లిమిటెడ్ లాంటి వాళ్లు అక్రమ తవ్వకాల్లో కీలకపాత్ర పోషించేవారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం చెబుతోంది.
వీళ్ల దందా ఎలా సాగిందంటే...
బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాలు వీరి కార్యస్థలం. ఈ మండలాల పరిధిలో 24,60,347 ఘనపు మీటర్ల మట్టి, గ్రావెల్, 6,07,746 ఘనపు మీటర్ల రాయి అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నారు. వంశీతో పాటు ఈ దందాలో భాగస్వాములైన వారందరిపైనా క్రిమినల్ కేసులు నమోదుచేసి, సీఐడీతో విచారణ జరిపించాలని సిఫార్సు చేసింది. మొత్తం 200 కోట్లకు పైగా వీరి నుంచి వసూలుచేయాలని సిఫార్సు చేసింది. వంశీ అనుచరులు నకిలీ, కాలం చెల్లిన పర్మిట్లు సేకరించేవారు. వాటిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలు జరిపారు. అధికారులెవరైనా తనిఖీలకొస్తే లంచాలిచ్చేవారు. మాట వినకపోతే ఏలా దారికి తెచ్చుకోవాలో వీళ్లకు బాగా తెలుసు. మట్టి, గ్రావెల్ లోడులతో వెళ్లే వాహనాలను చెక్‌పోస్టులు లేని దారుల్లో పంపించేవారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు వినియోగించేవారు. వంశీ దీన్ని ఓ వ్యవస్థీకృత మాఫియాగా నడిపించారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సమర్పించిన నివేదికలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి
Next Story