వంగవీటి రాధాకు గుండెపోటు, ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ కాపు నాయకుడు, స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ కాపు నాయకుడు, స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం (సెప్టెంబర్ 26) తెల్లవారుజామున ఆయన గుండెల్లో నొప్పిగా ఉందనడంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన డాక్టర్లు- స్వల్పంగా గుండెపోటు వచ్చినట్టు తేల్చారు.
వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీ చేరిన వంగవీటి రాధా కృష్ణ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. రాధ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
రాధాకు గుండెపోటు వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు విజయవాడలోని ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని తెలుసుకుంటున్నారు. రాజకీయ నాయకులు, మిత్రులు కూడా రాధా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణకు ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంనకు చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె పుష్పవల్లితో పెళ్లి అయింది. విజయవాడలోని పోరంకి మురళీ రీసార్ట్స్‌లో జరిగిన ఈ పెళ్లికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తదితరులు హాజరయ్యారు. వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి దంపతులను ఆశీర్వదించారు. పవన్ కల్యాణ్‌తోపాటు మాజీమంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇతర నేతలు సైతం వంగవీటి రాధా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలనుకున్నప్పటికీ టికెట్ రాకపోవడంతో విరమించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కలవరపాటుకు గురయ్యారు.
Next Story