మళ్లీ నిమ్మగడ్డ, జగన్ మెడకి చుట్టుకున్న వాన్‌పిక్
x

మళ్లీ నిమ్మగడ్డ, జగన్ మెడకి చుట్టుకున్న 'వాన్‌పిక్'

కోర్టు తీర్పుతో ఖంగుతిన్న మ్యాట్రిక్స్ ప్రసాద్, వైఎస్ జగన్


వ్యాన్ పిక్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మ్యాట్రిక్స్ ప్రసాద్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. “Vadarevu and Nizampatnam Industrial Corridor- Vanpic- కేసులో తెలంగాణ హైకోర్టు August 26న ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది.

ఈ కేసు విచారణ నుంచి మ్యాట్రిక్స్ ప్రసాద్ ఎలియాస్ నిమ్మగడ్డ ప్రసాద్, తదితరులను తప్పించాలంటూ దాఖలైన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీబీఐ మళ్లీ విచారణ జరుపనుంది. హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ తీర్పు ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.
వాన్‌పిక్ ఓడరేవుకు భూకేటాయింపుల్లో అక్రమాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే క్విడ్ ప్రోకో జరిగిందంటూ అభియోగాలు మోపింది సీబీఐ.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చర్చనీయాంశంగా మిగిలిపోతున్న కేసుల్లో వాన్పిక్ ఒకటి. ఇన్నాళ్లు మరచిపోయినట్టే ఉన్న ఈ వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
2007లో, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఈ Vanpic ప్రాజెక్ట్ ను ప్రతిపాదించారు.
దీని లక్ష్యం- ప్రకాశం జిల్లాలో వాడరేవు, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం వద్ద రెండు పెద్ద పోర్టులు, రోడ్లు, పరిశ్రమల కారిడార్ అభివృద్ధి చేయడం. వేలాది మందికి ఉపాధి కల్పించడం.
ఇందుకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం 28,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ఇది అప్పుడు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్ట్‌గా ప్రచారంలోకి వచ్చింది. దుబాయికి చెందిన రాస్‌ అల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ- రాకియా-, మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాలన్నది ఆనాటి ఒప్పందం. 2008 జూలైలో ఈమేరకు ఎంఓయూ కుదిరింది.

ఈ ఒప్పందాన్ని కుదిర్చి ఆ సంస్థలకు 28 వేల ఎకరాల భూమిని అప్పగించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన సంస్థలు- వైఎస్ జగన్ కి చెందిన పలు కంపెనీలలో 800 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఇది కచ్చితంగా క్విడ్ ప్రో కో అని ఆరోపణలు రావడంతో 2011లో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
నిమ్మగడ్డ ప్రసాద్, వాన్పిక్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా, జగన్ మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సాక్షి, బార్ట్రాన్, సండూర్ పవర్, భారతి సిమెంట్స్ వంటి కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది.
ఇందుకు ప్రతిఫలంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిమ్మగడ్డకు అపారమైన భూములు కేటాయించిందని ఆరోపించారు.
2011లో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది.
2012 మేలో జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
అదే సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయనపై సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి కేసులు నమోదు చేసింది.
వాన్పిక్ కంపెనీతో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో గడిపి, 2013 సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదల అయ్యారు.
నిమ్మగడ్డ ప్రసాద్ కొన్ని నెలలు జైలులో ఉన్నారు, తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.
అదే సమయంలో వాన్పిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు అధికారులు, వ్యాపారవేత్తలు కూడా సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు.
2011–2014లో జరిగిన జగన్ అరెస్టు–జైలు జీవితం పూర్తిగా వాన్పిక్ వంటి కేసులపైనే ఆధారపడి ఉంది. జైలు నుంచి బయటకు వచ్చిన జగన్ .. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆరోపించారు.
వైఎస్సార్ మరణం తరువాత, జగన్ సొంత పార్టీని పెట్టి 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత, ఈ కేసులు ప్రజల్లో మసకబారినా కోర్టుల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 2022 జూలై 28న- నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో నడుస్తున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
నిమ్మగడ్డ ప్రసాద్ సహా పలువుర్ని తొలగించాలన్నది ఆ క్వాష్ పిటీషన్ ఉద్దేశం. ఆవేళ హైకోర్టు వ్యాన్ పిక్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సీబీఐ వాదన కూడా విని తుది నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. గతంలో క్వాష్ చేసిన పిటిషన్ ను ఇప్పుడు మళ్లీ తిరగదోడారు. ఇప్పుడు అదే కోర్టు తన తీర్పును తిరగరాసింది.
సీబీఐ ప్రత్యేక కోర్టులో నడుస్తున్న క్రిమినల్ ప్రాసిక్యూషన్ రద్దు చేయడం కుదరదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు తర్వాత ఏమి జరగవచ్చుననేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కేసు కొనసాగుతుంది, విచారణ ఆగదు. జగన్, నిమ్మగడ్డ ను మళ్లీ విచారిస్తారు.
హైకోర్టు తాజా తీర్పుతో వాన్పిక్ మళ్లీ చర్చలోకి రావడం, రాబోయే ఎన్నికల దిశలో జగన్‌కు మరో ఇమేజ్ సమస్యగా మారే అవకాశం ఉంది.
ఈ తీర్పు వెనుక అసలు ఏమి జరిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ని మళ్లీ విచారించవచ్చునని భావిస్తున్నారు.
అయితే ఇప్పటికి ఈ కేసు నమోదై 13 ఏళ్లు కావొస్తోంది. ఇప్పుడు మళ్లీ విచారణ మొదలు పెడితే మరో పుష్కరకాలం పట్టవచ్చునని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే..
రాకియాకు, నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వు చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలోని వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి యూఏఈలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం రాస్‌ అల్‌ ఖైమాకు చెందిన రాస్‌ అల్‌ఖైమా ఇన్వెస్టిమెంట్స్ అథారిటీ- రాకియా-కు వ్యాన్‌పిక్‌ కేసులోనే మరో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు మధ్య వివాదాలు ఎడతెగకుండా కొనసాగుతున్నాయి.
నిమ్మగడ్డ ప్రసాద్‌ను భాగస్వామిగా చేర్చుకున్నందుకు తమను నిమ్మగడ్డ ప్రసాద్‌ మోసం చేశారని, తన కంపెనీల ద్వారా నిధులు గోల్‌మాల్‌ చేశారని రాకియా యూఏఈ కోర్టులో నిమ్మగడ్డకు వ్యతిరేకంగా లా సూట్‌ దాఖలు చేసి గెలిచింది.
నిమ్మగడ్డ ప్రసాద్‌ నష్టపరిహారంగా రూ.600 కోట్లు చెల్లించాలని యూఏఈ కోర్టు డిక్రీ జారీ చేసింది. ఈ డిక్రీని అమలు చేయించుకోవడంలో భాగంగా రాకియా హైదరాబాద్‌లోని వాణిజ్య కోర్టులో ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్‌ -ఈపీ- దాఖలు చేసింది. వాణిజ్య కోర్టుకు హామీ ఇచ్చి కూడా ఆస్తులను బినామీ పేర్లతో బదిలీ చేస్తున్నారని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read More
Next Story