ఎమ్మెల్సీగా తొలి పర్యటన ఆ నియోజకవర్గంలోనే ఎందుకు? ఇప్పటికే పార్టీ ఆవిర్భావ సభలో వర్మపై సెటైర్లతో దుమారం. నాగబాబు పర్యటనలో జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు పిఠాపురంపై ప్రేమా? లేక ఆ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై పగా? కొన్నాళ్లుగా నాగబాబు వ్యవహార శైలిని చూస్తున్న వారికి ఇలాంటి సందేహాలే పుట్టుకొస్తున్నాయి. తన సోదరుడు పవన్ కల్యాణ్ గెలుపునకు కారణమైన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై నాగబాబుకు ఎందుకింత ద్వేషం? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజకీయ పునర్జన్మనిచ్చింది పిఠాపురం నియోజకవర్గం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరాల్లో పోటీ చేసిన పవన్ ఆ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీంతో 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అనివార్యమైంది. ఈసారి కూడా గెలవకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. వీటన్నిటినీ బేరీజు వేసుకుని, దూరదృష్టితో ఆలోచించిన పవన్.. టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. ఆ ఎన్నికల్లో పోటీకి తన సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అప్పటికే టీడీపీలో బలమైన నాయకునిగా ఉన్న అక్కడి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి వర్మకు ఆ పార్టీలో టిక్కెట్టు దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వర్మను బుజ్జగించి ఆ సీటును పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తున్నామని, ఆ స్థానంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని చెప్పి ఒప్పించారు. అందుకు ప్రతిఫలంగా వర్మకు తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని కూడా బహిరంగంగా హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను గెలిపించే బాధ్యతను కూడా వర్మకే అప్పగించారు. పిఠాపురం నుంచి సుమారు 71 వేల ఓట్ల మెజార్టీతో వపన్ గెలిచారు. ఈ భారీ మెజార్టీయే వర్మకు ఇబ్బంది తెచ్చిపెట్టిందన్న వాదన వినిపిస్తోంది.
రచ్చ తెచ్చిన ‘ఖర్మ’ వ్యాఖ్యలు..
సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొన్నాళ్ల వరకు పిఠాపురంలో జనసేన, టీడీపీ నాయకులు సఖ్యతగానే ఉన్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ గెలుపునకు తానే దోహదపడ్డానని వర్మ ఒకట్రెండు పర్యాయాలు చెప్పకున్నారు. అది పవన్, నాగబాబులకు రుచించలేదు. ఈ నేపథ్యంలో గత నెలలో పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వర్మనుద్దేశించి నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి పిఠాపురం ఓటర్లు, జన సైనికులు, పవన్ చరిష్మా.. కారణం తప్ప.. మాలో ఎవరైనా ఇంకెవరైనా? పవన్ విజయానికి నేనే దోహదపడ్డాను అని అనుకుంటే వారి ఖర్మ’ అని నాగబాబు కుండబద్దలు కొట్టారు. ఇక అప్పట్నుంచి ఆయన వ్యాఖ్యలు టీడీపీ, జనసేనల్లో పెనుదుమారాన్ని రేపుతూనే ఉన్నాయి. దీనిపై వర్మ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారు. మరోవైపు వర్మ వర్గీయులు మాత్రం నాగాబాబు వ్యాఖ్యలపై మండిపడుతూనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు నాగబాబు వ్యాఖ్యలపై అటు టీడీపీ కూడా ఏమంత స్పందించలేదు. పైగా వర్మనే తగ్గాలని మంత్రి లోకేష్ పరోక్షంగా సూచించడం కూడా ఆయన వర్గీయులకు మింగుడు పడడం లేదు. తొలి దఫాలోనే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీ అమలు కాకపోవడం, వర్మకు దక్కాల్సిన ఎమ్మెల్సీ నాగబాబుకు కట్టబెట్టడం వంటి పరిణామాలు వర్మసహా ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎమ్మెల్సీగా తొలి పర్యటన పిఠాపురం నుంచే..
రెండు రోజుల క్రితమే నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వెంటనే ఎమ్మెల్సీగా తన తొలి పర్యటనను పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టారు నాగబాబు. ‘ఖర్మ’ వివాదం ఇంకా సద్దుమణగక ముందే ఆయన పిఠాపురంలో పర్యటనకు ఎంచుకోవడం ఉద్దేశపూర్వకమేనన్న భావన టీడీపీ శ్రేణుల్లో ఏర్పడింది. రెండు రోజుల పర్యటనలో తొలిరోజు శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో వర్మ వర్గీయుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తమ నేత వర్మను పిలవకుండా ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు ఒకదశలో నాగబాబు కారును చట్టుముట్టడానికి ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. . జై టీడీపీ, జై వర్మ.. వర్మ నాయకత్వం వర్థిల్లాలి.. అంటూ వర్మ అనుచరులు నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా జై జనసేన, జై పవన్ కల్యాణ్, జై నాగబాబు అంటూ నినాదాలు అందుకున్నారు. దీంతో ఇరువర్గాలను శాంతింపచేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇక రెండోరోజు శనివారం కూడా అదే సీన్ రిపీట్ అయింది. కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న నాగబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అయితే జనసేన అభిమానులు వారిని ధీటుగా ఎదుర్కొన్నారు. మరోవైపు టీడీపీ ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్, నాగబాబుల ఫోటోలు గాని, జనసేన ఫ్లెక్సీల్లో చంద్రబాబు, వర్మల ఫోటోలు గాని లేవు. అంతేకాదు.. నాగబాబు పర్యటనలో వర్మ కనిపించలేదు. వర్మను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నా పిఠాపురంలో తమకేమాత్రం ప్రాధాన్యత ఉండడం లేదని వాపోతున్నారు. మున్ముందు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ హవాను తగ్గించి, నాగబాబు ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగమే ఇదంతా అని వీరు ఆరోపిస్తున్నారుఇప్పటికే నాగబాబు వర్మపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ, జనసేన అభిమానుల మధ్య తలెత్తిన విభేదాలను దష్టిలో ఉంచుకుని నాగబాబు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ పర్యటనకు తలదన్నేలా పోలీసులు అప్రమత్తం కావడం విశేషం!
వర్మపై నాగబాబుకు ఎందుకంత కోపం?
ఇక వర్మపై నాగబాబుకు ఎందుకంత కోపం? అన్న దానిపై తలో రకంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో నాగబాబును వర్మ అంతగా పట్టించుకోలేదని, పైగా ఎన్నికల ఖర్చు, ఓటర్లకు పంచేందుకు ఇచ్చిన సొమ్ము కూడా సక్రమంగా పంపిణీ చేయలేదన్న అనుమానం పవన్, నాగబాబులకు ఉందని చెబుతున్నారు. ఎన్నికల వేళ దీనిపై గట్టిగా నిలదీస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందన్న భావనతో మిన్నకుండి పోయారని అంటున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా పవన్‌కు 71 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ గెలుపులో వర్మ కృషి ఏమంత లేదని, పవన్ కు ఉన్న సెలబ్రిటీ ఇమేజితో పాటు జనసైనికుల కష్టం ఉందని, అత్తెసరు మెజార్టీ వచ్చి ఉంటే అది వర్మ ప్రభావం అయి ఉండేదనన్న నిర్ధారణకు వచ్చారు. ఈ పరిస్థితులను, ఎన్నికల్లో వర్మ వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాగబాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు తన మనసులోని మాటను సభా వేదికపై నుంచి ఖర్మ వ్యాఖ్యలు చేశారని ఈ సంగతి తెలిసిన నియోజకవర్గం వాసులు చెప్పకుంటున్నారు. మొత్తమ్మీద రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు కలిసి మెలసి ఉంటున్నా పిఠాపురంలో మాత్రం ఆ రెండు పార్టీల శ్రేణులు ఉప్పు, నిప్పులా ఉంటున్నారు.
Next Story