మహిాళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యూహం ఏమిటి? ఆమె తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు. అందుకు రూట్ ఎలా సెట్ చేసుకున్నారు?
మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ నెలాఖరు లోపు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మ సాధారణ ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉండగా మీడియా అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. అధికారం చేపట్టి జగన్ ముఖ్యమంత్రి కాగానే మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా కొనసాగారు. అందరిలాగానే పార్టీలో ఆమెకు మంచి ప్రయారిటీ ఇచ్చారని పార్టీలోనే చాలా సార్లు చర్చకు వచ్చింది. అయితే ఆమె వైఎస్సార్సీపీ వీడిన తరువాత జగన్ నియంత అంటూ విమర్శలు చేశారు. తాను తప్ప ఏ ఒక్కరినీ రాజకీయంగా ఎదగనివ్వరని స్పష్టం చేశారు.
మహిళా సమస్యలపై తాను పోరాడుతూనే ఉంటానని పలు సార్లు చెప్పారు. వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అత్యాచారానికి గురైన మహిళల పేర్లు వెల్లడించి వారిని మంరింత కుంగిపోయేలా చేశారని, ఆయన ఒక మాజీ పోలీస్ అధికారి అయి ఉండి కూడా ఇలా చేయడం ఏమిటని ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ కు మాధవ్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకేననే చర్చ అప్పటిలో సాగింది. పలు సందర్భాల్లో ఆమె మీడియా వారితో మాట్లాడే టప్పుడు మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఇంకా టీడీపీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని, ఉంటే మీకు చెబుతానని చెప్పారు. అంటే తప్పకుండా తెలుగుదేశంలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారని అప్పటికే చాలా మందికి అర్థమైంది.
ఇప్పటికి మూడు సార్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని కలిసారు. తెలుగుదేశం పార్టీలో చేరే విషయమై ఆమె చిన్నీతో చర్చించినట్లు సమాచారం. నేరుగా చంద్రబాబును కలిసి పార్టీలో చేరకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ను కలిసి పార్టీలో చేరాలనే ఆలోచనలో ఆమె ఉన్నారు. ముందు లోకేష్ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ముఖ్యమంత్రిని కలవచ్చనే ఆలోచనలో ఉన్నారు. లోకేష్ తో ఎంపీ చిన్నీకి మంచి సంబంధాలు ఉన్నందున ఎంపీ ద్వారా పార్టీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. విజయవాడలోని ఎంపీ ఆఫీస్ లో పద్మ ఎంపీని కలవడం వల్ల తప్పకుండా చేరుతారని ఎప్పుడనే దాని కోసం కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.
ఇటీవల విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేస్తూ చంద్రబాబుకు వయసు మళ్లిందని, ప్రభుత్వ బాధ్యతలు పవన్ కళ్యాన్ కు అప్పగిస్తే బాగుంటుందన్నారు. దీనిపై పద్మ స్పందించారు. ముందు జగన్ ను పార్టీ అధ్యక్ష పదవి వాళ్ల అమ్మ విజయమ్మకు ఇవ్వమని చెప్పండి. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడొచ్చు అంటూ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్సార్సీపీ వారిని వదలకుండా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈమె మంచి మాటకారి అయినందున పార్టీలోకి తీసుకుంటే మహిళా సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చనే ఆలోచనలో తెలుగుదేశం వారు ఉన్నారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు తెలుగుదేశం పార్టీలో వాసిరెడ్డి పద్మ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.