కౌంటర్ ఇచ్చిన వీరశివుడు.. మళ్లీ జగన్ చెంతకే..
టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే సీఎం వైఎస్. జగన్ చెంతకు చేరనున్నారు. ఇది వైఎస్సార్సీపీకి లాభించే పరిస్థితి ఏర్పడింది.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ రోజుల్లో మాజీ ఎమ్మెల్యే జి. వీర శివారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు 2024లో టిడిపి టికెట్ దక్కని స్థితిలో ఆయన వైయస్సార్సీపీలో చేరనున్నారు. ఇది ఆయన కుమారునికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఇస్తుంది. అనేది కాలమే నిర్ణయించాలి. కానీ.. విభజన నాటి పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే... అది 2010 కడప ఎంపి స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఉద్దేశించి.. "కడప పౌరుషానికి.. ఢిల్లీ అహంకారానికి మధ్య జరిగే యుద్ధమిది" అని ఆ ఉపఎన్నికను అభివర్ణించారు.
కౌంటర్:
ఆ ఎన్నికల్లో ప్రచార సారథ్య బాధ్యతలు స్వీకరించిన వారిలో ఒకరైన సీనియర్ నాయకుడు జీ. వీర శివారెడ్డి.. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. " సోనియా గాంధీ వరకు ఎందుకు నాయనా.. మమ్మల్ని దాటుకొని తర్వాత పో.." అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు పాతరేయడం జరిగిపోయింది. జిల్లాలో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన జి వీర శివారెడ్డి పదేండ్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. శివారెడ్డి 2022లో వీర శివారెడ్డి.. టిడిపిలో చేరారు. కాలక్రమంలో రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. దీంతో..
ఫ్యాన్ కిందికి వీరశివా
కడప జిల్లాలో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే శివారెడ్డికి 2024 ఎన్నికల్లో కమలాపురం నుంచి పోటీ చేయాలనే ఆశ నెరవేరలేదు. ప్రొద్దుటూరులో తన అన్న వీరారెడ్డి కుమారుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత లేకుండా పోయింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో తన సోదరి, మాజీ ఎమ్మెల్యే ఏవి లక్ష్మీ దేవమ్మ, మేనల్లుడు మాజీ ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డినీ ప్రాధాన్యతలోకి తీసుకోలేదు. ఈ పరిణామాలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే జీ. వీర శివారెడ్డి .."టిడిపిలో నాకు ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇక్కడ ఉండీ ప్రయోజనం లేదు" అంటూ వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి సన్నద్ధమయ్యారు. దీంతో..
సార్వత్రిక ఎన్నికల వేళ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. కడప జిల్లాలో జి వీర శివారెడ్డితో పాటు ప్రొద్దుటూరులో మరో మాజీ ఎమ్మెల్యే కూడా టిడిపిని వీడనున్నారు. దీనివల్ల వైఎస్ఆర్సిపికి మరింత లాభించే పరిస్థితి ఏర్పడింది. టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్ల సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో పరిస్థితులు మరింత సానుకూలంగా మారినట్లు కనిపిస్తోంది.
ఫైర్ బ్రాండ్.. వీర శివ
కమలాపురం మండలం కోగటం గ్రామానికి చెందిన జి వీర శివారెడ్డి ఐదో తరగతి వరకు చదువుకున్నారు. రాజకీయాల్లో చురుకుదనమే కాకుండా ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆయన నైజం. అధికార పక్షంలో ఉన్నా సరే తన మనసులో భావాలను నిర్మొహమాటంగా చెబుతారు. ఓపెన్ మైండ్‌గా ఉండే వీర శివారెడ్డి.. కమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి 1994లో టిడిపి అభ్యర్థిగా మొదటిసారి గెలిచారు. 1999లో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం వి. మైసూరా రెడ్డి చేతిలో ఆయన ఓటమి చెందారు.
కాంగ్రెస్ హవాలో.. టిడిపి అభ్యర్థిగా
ఆ తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తీవ్రంగా ఉంది. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా బలంగా ఉన్న రోజుల్లోనే కమలాపురం నుంచి జి వీర శివారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో దివంగత సీఎం వైఎస్ఆర్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వీర శివారెడ్డి ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో శివారెడ్డి పరోక్షంగా వైఎస్ఆర్సిపి అభ్యర్థి సీఎం జగన్‌కు మేనమామ పి రవీంద్రారెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా విజయానికి దోహదం చేశారు. అయితే..
సాకారం కాని ఆశలు..
గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వెనక వీరశివారెడ్డి మనసులో కోరిక ఉండేదని చెబుతారు. తన కుమారుడు జి సునీల్ కుమార్ రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఆలోచన చేశారని చెబుతారు. గత ఎన్నికల తర్వాత తన ఇంటికి వచ్చి స్వయంగా అభినందించిన నాయకులే ఆ తర్వాత మొహం చాటేశారు. వెళ్లి అడుగుదామంటే ఫైర్ బ్రాండ్ అయినా శివారెడ్డి మనసు అంగీకరించలేదు అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఇక మరో మార్గం లేని స్థితిలో ఆయన 2022లో టిడిపిలో చేరారు.
పార్టీని బ్రతికించడానికి అవసరమైన చర్యలు తీసుకున్న ఈ వీర శివారెడ్డి 2024 ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు సునీల్ కుమార్‌కు టికెట్ రావడం కోసం ప్రయత్నించారు. నాలుగు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన ఉత్త నర్సింహారెడ్డి కుమారుడు కొత్త చైతన్య రెడ్డికి కమలాపురం టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించడంపై వీర శివారెడ్డి ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికలకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు "కోట్ల రూపాయలు కుమ్మరించిన వారికి టికెట్లు ఇచ్చారు" అని ఆరోపించారు. ‘‘నమ్ముకుని వెంట ఉన్న వారిని కాదని, రాజకీయాల్లో విఫలమైన వారికి పెద్దపీట వేస్తున్నారు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
"ప్రొద్దుటూరులో మా అన్న కుమారుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా అన్యాయం చేశారు’’ అని వీరశివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పార్టీ జెండా పట్టుకునే వారు లేని పరిస్థితుల్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి కేసులో కూడా భయపడకుండా పని చేశారని గుర్తు చేశారు. అందుకే.. టిడిపిని వదిలి వైఎస్ఆర్సిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వీరశివారెడ్డి స్పష్టం చేశారు.
కలిసొస్తున్న కాలం..
సొంత జిల్లా కడప ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వాతావరణం మరింతగా కలిసి వచ్చింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే జీ. వీరశివారెడ్డి పార్టీ మారడం వల్ల కమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి మరింత బలం పెరిగే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా అన్న కుమారుడు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి వల్ల కూడా అక్కడి వైఎస్ఆర్సిపి అభ్యర్థికి కాస్త పరిస్థితి అనుకూలించే వాతావరణం ఏర్పడింది.
కమలాపురంలో జేభరి శివారెడ్డి తో పాటు, ప్రొద్దుటూరు చెందిన మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా టిడిపిని వీడనున్నట్లు సమాచారం. వీరిద్దరి వల్ల కమలాపురం, కడపలో కొంత భాగం, ప్రొద్దుటూరు, మైదుకూరులో వీయనున్న రాజకీయ పవనాలు కొంత మేర వైయస్సార్సీపీకి అనుకూలించే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
తంబళ్లపల్లిలో ఎఫెక్ట్..!
ఇది ఇలా ఉండగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టిడిపి నాయకురాలు ఏవి. లక్ష్మీ దేవమ్మ.. కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి వీర శివారెడ్డికి స్వయానా సోదరి. లక్ష్మీ దేవమ్మ కుమారుడు మాజీ ఎమ్మెల్యే కేవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు మొండి చేయి చూపారు. దీంతో నియోజకవర్గంలో తమకంటూ ప్రత్యేక వర్గం ఉన్న ఏవీ లక్ష్మీ దేవమ్మ కుటుంబం కూడా ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నేళ్లుగా దూరంగా ఉంది. ఇప్పటికే తంబళ్లపల్లె టిడిపిలో గందరగోళం రాజ్యమేలుతోంది. ఏవి లక్ష్మి దేవమ్మ వర్గం కూడా దూరంగా ఉండటం వైఎస్ఆర్సిపికి కాస్త మేలు చేసే అంశంగానే పరిశీలకులు భావిస్తున్నారు.
దివంగత సీఎం డాక్టర్ వైయస్సార్ సమకాలీక సహచరుడైన వీరశివారెడ్డిని, ఆయన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనేది వేచి చూడాలి. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే గత ఎన్నికల్లో పరోక్ష సహకారం అందించారు. ఎన్నికల్లో ప్రత్యక్ష సహకారం అందించడం వల్ల కమలాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డికి బలం రెట్టింపు అయిందనేది పరిశీలకుల అంచనా. ఎన్నికల తర్వాత ఎవరి సహకారం ఎంతవరకు అందింది అనేది తేలనుంది. ఆ ఫలితం ఎలా ఉంటుందో వేచి చూద్దాం.