నెల్లూరు టీడీపీ ఎంపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. ఇప్పటి వరకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులుగా ఉంటూ రాజీనామా చేశారు.


నెల్లూరు టీడీపీ ఎంపి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి?
x
Vemireddy Prabhakar Reddy

G. Vijaya Kumar

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి నెల్లూరు లోక్‌సభ నియోజక వర్గ టిడిపి ఎంపి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. వైసిపిలో ఇమడలేక ఆయన తన రాజ్యసభ స్థానానికి, వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేశారు. ఆ మేరకు ఆయన లేఖను ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పంపారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కూడా వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రశాంతి ప్రస్తుతం ఉత్తర భారతదేశం టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా ఉన్నారు. నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షులుగా ఉన్న వేమిరెడ్డితో ఎలాంటి సంప్రదింపులు జరప కుండా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు జరిగాయి. కొత్త వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో మనస్థాపానికి గురైన వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారు. తనకు కనీస ప్రాధాన్యత లేని చోట ఎందుకని ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లి పోయారు.

వేమిరెడ్డి తన రాజీనామాను ప్రకటించిన తక్షణమే టిడిపిలోకి రావాలని ఆ పార్టీ నేతులు బహిరంగానే ఆహ్వానం పలికారు. టిడిపి సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఇటీవల టిడిపి తీర్థం పుచ్చుకున్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి టిడిపిలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
వేమిరెడ్డి ఇంకా టిడిపిలో చేరలేదు. త్వరలో ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. నెల్లూరు ఎంపి సీటు వేమిరెడ్డికి కేటాయించే విధంగా చంద్రబాబుతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్ని ఓరల్‌గా ఖరారు చేస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు వేమిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు ఓటములు ఎలా ఉంటాయనే దానిపై చంద్రబాబు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ర్యాండమ్‌గా కొన్ని సెల్‌ఫోన్‌ నంబర్లను ఎంపిక చేసి వారికి ఫోన్లు ద్వారా అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. సానుకూలంగానే స్పందనలు వస్తున్నట్లు సర్వేలో తేలిందంటున్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి టిడిపిలోకి వెళ్లడం, నెల్లూరు పార్లమెంట్‌ స్థానం కేటాయించడం లాంఛనమే అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
వివాద రహిత రాజకీయనేతగా వేమిరెడ్డికి పేరుంది. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించే మనస్తత్వం కలిగిన నాయకుడు. కులాలకు, మతాలకు అతీతంగా దాన ధర్మాలు చేయడం, పేదలకు సహాయాలు అందించడం, తాగు నీరు సరఫరా చేయడం, పాఠశాలలు నిర్మించడం, దేవాలయాలు నిర్మించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
ఆదాలకే ఇస్తారా లేక మారుస్తారా
వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిట్టింగ్‌ ఎంపిగా ఉన్న ఆదాల ప్రభాకర్‌ రెడ్డి 2024 ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేనట్లు అతని సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. ఆయన కూడా సిఎం జగన్‌మోహన్‌ రెడ్డిపైన అసంతృప్తిగానే ఉన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వైసిపిని వ్యతిరేకించిన నేపథ్యంలో ఎంపి ఆదాలను నెల్లూరు రూరల్‌ నియోజక వర్గానికి వైసిపి ఇన్‌చార్జిగా సిఎం నియమించారు. ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధుల వివరాలను పలుమార్లు సిఎం, సిఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆయనకు శ్రమే మిగిలింది కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా నైరాశ్యంలోకి వెల్లినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే మీమాంసలో ఆదాల ఉన్నారు.
Next Story