ఆంధ్రాలో షర్మిల గర్జన

షర్మిల పేరు వినగానే ఏపీలో వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం నాయకుల్లో దడ మొదలైంది. ఆమె మాటల దాడికి ఇరు పార్టీల్లోని నాయకులకు దిమ్మ దిరుగుతోంది. దిక్కుతోచడం లేదు.


ఆంధ్రాలో  షర్మిల గర్జన
x
YS SHARMILA IN TENALI RACHABANDA

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి రాకెట్‌లా దూసుకొచ్చిన వైఎస్‌ షర్మిల అన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. గతంలో ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడును కూడా వదలటం లేదు. ఈ రెండు పార్టీలను ఏకి పారేస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ దుమ్ము దులుపుతున్నారు. ఈ దుమ్ము దులిపే కార్యక్రమం ఎంత వరకు వచ్చిందంటే వైఎస్సార్‌ సోషల్‌ మీడియా వారు షర్మిల వైఎస్‌ఆర్‌ కూతురే కాదని, ఇంటి పేరు మార్చుకోవాలని, అనిల్‌ భార్యగా గుర్తింపు తెచ్చుకోవాలని ట్రోల్స్‌ మొదలు పెట్టారు. ఆమె ఈ ట్రోల్స్‌ను కూడా తిప్పికొట్టింది. చేతకాని వారు చేసే పనులు ఇవని కొట్టిపారేశారు.



సమస్యలపై ఏకరువు
షర్మిల ప్రసంగాల్లో రాష్ట్ర సమస్యలపై ఏకరువు పెడుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ఇసుక కుంభకోణం, మధ్యం వ్యాపారం, మెగా డీఎస్సీ అంటూ మోసం, అమ్మ ఒడి అందరికీ అని ఒక్క బిడ్డకే ఇవ్వడం వంటి మాటలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నారు. ఇక చంద్రబాబు, జగన్‌ కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన దానిపై ఆమె విరుచుకు పడుతున్నారు. ఈరోజు తెనాలిలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ సమస్యలు తీరుస్తానని, అలా జరగని పక్షంలో అధికార పార్టీ మెడలు వంచి పనులు చేయిస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల మధ్య కూర్చుని మాట్లాడారు. కొత్త చట్టాలతో భూ కబ్జాలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు.
కాంగ్రెస్‌కు పునరుజ్జీవం
కాంగ్రెస్‌ పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు వైఎస్‌ షర్మిల ప్రయత్నిస్తున్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకుని వారి ద్వారా జనాన్ని సమీకరించి సభలు, సమావేశాలకు వచ్చేలా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ నాయకుల వెంట కనిపించని జనం షర్మిల వెంట కనిపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ అభ్యర్థుల అభ్యర్థనలను అధిష్టానానికి పంపించారు. వారి నుంచి జాబితా రాగానే వారి పేర్లు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు. మరి కొందరు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెలో ఉంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న వారిని లైన్‌లోకి తీసుకొచ్చారు. ఈనెల 11 వరకు సభలు రాష్ట్రంలో నిర్వహించనున్నారు. ఇది రెండో సారి ప్రచార యాత్రగా చెప్పొచ్చు. మొదటి సారిగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చుట్టుకొచ్చిన షర్మిల బుధవారం రెండో దఫాయాత్ర బాపట్ల నుంచి మొదలు పెట్టారు.
Next Story