అమ్మ ఇక లేదు...
x

అమ్మ ఇక లేదు...

‘ఎన్నడూ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రోత్సహించలేదు. ఉద్యమ పథం నుండి తప్పుకోమని ఎన్నడు కోరలేదు.’


అమ్మ లేదు....

మా అమ్మ పూంతోటం కృష్ణ రాధమ్మ నిన్న రాత్రి అనకాపల్లిలో10.45నిముషాల సమయంలో ఆఖరి శ్వాస విడిచింది.

ఆ క్షణాలాలో మేము అమ్మ దగ్గరే వున్నాను.

ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల కమ్యూనిస్ట్, ప్రజాతంత్ర ఉద్యమాలకు తమ చిన్న ఇంటిని ఒక అనధికార కార్యాలయంగా అమ్మ- నాన్న నిలిపారు.

1959 లో అనకాపల్లిలోని లింగముర్తి హలులో, సాంప్రదాయ వివాహ పద్ధతికి భిన్నంగా , కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పికె శంకర్, రాధమ్మలకు " సంస్కరణ వివాహం" జరిగింది. ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అనకాపల్లిలో నిర్వహించిన ఈ సంస్కరణ వివాహం ఆనాడు ఒక సంచలనం అయ్యింది. భారత కమ్యుూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ పేరును ఆనాటి కమిషన్ పార్టీ నాయకులు నాకు పెట్టారు.

ఇద్దరికీ చదువు రాకపోయినా, వారిద్దరూ కటిక పేదరికంలో పుట్టి పెరిగినా, ఆ పేదరికంలో నుంచి తాము వ్యక్తిగతంగా బయటపడ్డారు. అయితే సుఖంగా జీవించాలని ఎన్నడు భావించలేదు. సమాజంలో ఎవరూ పేదరికంలో ఉండకూడదని ఆశించి అందుకు తమ పరిధిలో, తమ శక్తి మేరకు జీవితమంతా కృషి చేస్తూ వచ్చారు.

విప్లవోద్యమానికి గట్టి నైతిక మద్దతుదారుగా ఉంటూ, తమ ఇంటిని విప్లవకారులకు హబ్ గా మార్చేశారు. తమ కుమారుడిని ప్రజా ఉద్యమం లోకి పంపినందుకు పికె శంకర్ ను పలుమార్లు చట్ట విరుద్ధమైన నిర్బంధంలో ఉంచారు. దీని వల్ల ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. 1985 లో 55 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించారు. ఆనాటి సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ రాష్ట్ర కమిటీ ఒక తీర్మానం ద్వారా ఆయనను తమ అమరవీరునిగా గుర్తించిoది.

భర్త అడుగుజాడలలో, ఆ విలువలతో చివరి నిమిషం వరకు రాధమ్మ జీవించారు.

గత నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

నాన్న కూడా అనకాపల్లిలోనే చనిపోయారు.

మా కళ్ళ ముందే ఒక్కొక్క రోజు మృత్యువు ఓడిలోకి జారిపోతూ వచ్చారు. తనకు పూర్తిగా మాట ఆగిపోవడానికి ముందు, నన్ను ఒక విప్లవ గేయం పాడమని అమ్మ కోరింది. పాట మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడం నాకు సాధ్యం కాలేదు. చరణం ఆఖరిలో అమ్మ నా చేతిని తన చేతిలోకి తీసుకుని, శక్తినంతటినీ కూడ దీసుకొని, నా చేతిని తన చేతిని కలిపి పిడికిలి బిగించినట్టుగా పైకి లేపింది.

ఎన్నడూ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రోత్సహించలేదు. ఉద్యమ పధo నుండి తప్పుకోమని ఎన్నడు కోరలేదు.

మా అమ్మకు పుట్టినరోజు తెలియదు. తనకు జరిగిన వివాహకు తేదీనే పుట్టిన రోజుగా భావిస్తూ ఉంటుంది. అప్పటికి తన వయసు 17 సంవత్సరాలు.

ఆ ప్రకారం చూస్తే అమ్మ వయసు 83 సంవత్సరాలు.

గత ప్రభుత్వంలో వాలంటీర్స్ వచ్చి తనకు వృద్ధాప్య పెన్షన్ రాస్తామని వివరాలు కోరగా అమ్మ నిరాకరించింది. ఆ పెన్షన్ను ఎవరైనా పేదవారికి ఇవ్వమని వారికి చెప్పింది. తన జీవితం నిండా ఇలాంటి అనేక ఉదాహరణలు ఉంటాయి.

నా సోదరి విజయలక్ష్మి, ఆమె రెండో కుమార్తె పద్మ మా అమ్మను కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు.

63 ఏళ్ల వయస్సు వచ్చిన కొడుకుకి జాగ్రత్తలు చెప్పే 83 ఏళ్ల అమ్మ ఇక లేదు.

కామ్రేడ్ శంకర్ - కామ్రేడ్ రాధమ్మలకు జోహార్లు.

వారి కడుపున పుట్టినందుకు గర్విస్తున్నాము.


పూoతోటం శంకర అజయ్ కుమార్

(ప్రస్తుతం గౌరవ సలహాదార్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి సంఘం. ఫ్రీ లాన్స్ జర్నలిస్టును)

R. విజయ లక్ష్మి

(ప్రజాఉద్యమ కార్యకర్తలు)

Read More
Next Story