‘హిట్ లిస్ట్’ OTT మూవీ రివ్యూ
దాతృత్వం, మానవత్వం గురించి మాట్లాడుతూ.. కోడికి కూడా అపకారం తలపెట్టని ఓ కుర్రాడికి, అతన్ని మరబొమ్మలా ఆడిస్తూ అతని చేత హత్యలు చేయించే ముసుగు మనిషికి మధ్య జరిగే కథే హిట్ లిస్ట్.
దాతృత్వం, మానవత్వం గురించి మాట్లాడుతూ.. కోడికి కూడా అపకారం తలపెట్టని ఓ కుర్రాడికి, అతన్ని మరబొమ్మలా ఆడిస్తూ అతని చేత హత్యలు చేయించే ముసుగు మనిషికి మధ్య జరిగే కథే హిట్ లిస్ట్. ఇలాంటి కథలు బోర్ కొట్టకుండా, బుర్రలోకి మరో ఆలోచన రాకుండా చేసేలా ఉండాలి. ఇలాంటి సినిమాగా తెరకెక్కించాలంటే స్క్రీన్ ప్లే చాలా ఫెరఫెక్ట్‌గా ఉండాలి. ఎంగేజ్ చేస్తూనే కథని తమకు అనుకున్నట్లుగా డైరక్టర్ నడిపి ట్విస్ట్‌లు పండించగలగాలి. ఆ నైపుణ్యం ఈ దర్శకుడు ప్రదర్శించాడా. అసలు ఈ చిత్రం కథేంటి, చూడగలమా , చూడచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
విజయ్ (విజయ్ కనిష్క) ఓ మంచి కుర్రాడు. జీవహింస మహాపాపం, నేరం అని భావిస్తూంటాడు. అందరూ వెజ్ తినాలని ప్రచారం చేస్తూంటాడు. ఎలాంటి గొడవలు లేకుండా తన అమ్మ (సితార), చెల్లి తో కలిసి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతుండే అతని జీవితం ఓ రోజు అనుకోమని మలుపు తిరుగుతుంది. ఓ చిన్న మీటింగ్ చూసుకుని వస్తూండగా.. ఒక కాల్ వస్తుంది. తన అమ్మని, చెల్లిని కిడ్నాప్ చేశానని వాళ్ళని వదిలి పెట్టాలంటే తాను చెప్పింది చేయాలి అని డిమాండ్ చేస్తాడు మాస్క్ మనిషి. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు. ఎలా వాళ్లను విడిపించుకురావాలో తెలియదు.
అదే సమయంలో ఏసిపి యెజ్హ్వెందన్ (శరత్‌కుమార్) దగ్గరలో ఉంటే ఆయనకు చెప్తాడు. ఆయన సాయింతో తన తల్లిని, చెల్లిని రక్షించుకుందామనుకుంటాడు. కానీ ముసుగు మనిషి అతని కన్నా అడ్వాన్స్‌గా ఉంటాడు. అతను విజయ్‌కి ఓ ఆఫర్ ఇస్తాడు. తను చెప్పినట్లు చేస్తే తల్లి, చెల్లిని వదిలేస్తానంటాడు. లేకపోతే చంపేస్తానంటాడు. అది మరేదో కాదు కాళీ (గరుడ రామచంద్ర) ని చంపమని చెప్తాడు . కాళీ ఆ సిటీలో పెద్ద గ్యాంగ్ లీడర్. 36 హత్య కేసులు అతనిపై ఉంటాయి. అప్పుడు విజయ్ ఏం డెసిషన్ తీసుకున్నాడు. ఏసిపి యెజ్హ్వెందన్ విజయ్‌కు ఏమైనా సాయిం చేయగలిగాడా.. అసలు మాస్క్ మాన్ ఉద్దేశ్యం ఏమిటి...విజయ్‌నే ఎందుకు టార్గెట్ చేశాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
‘హిట్ లిస్ట్’ సినిమా జేమ్స్ వాన్ భారీ హిట్ చిత్రం SAW (2004)చిత్రం ఎత్తి నేటివిటి, కరోనా వంటి అంశాలు కలిపి వండిన వంటకం. అయితే SAW చిత్రం చూడని వాళ్లకు ఈ సినిమా బాగా తీశారు. కథ, కథనం పరుగెట్టించారని అనిపిస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. ఏదైతే ఈ సినిమాకు కలిసి సొంత వంటకం చేశారో ఆ ఎపిసోడ్సే విసిగిస్తాయి. అంటే ఓ రకంగా నాన్ సింక్‌లో నడిచాయన్నమాట. న్యాయం కోసం ప్రధాన పాత్ర సినిమా మొదటి నుంచి చివరి వరకూ పరుగెడుతూ ఉంటుంది. చూసేవాళ్లకు సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌తో వీక్షక న్యాయం దక్కుతుంది. అయితే తీసిపారేసే సినిమా అయితే కాదు. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ ని ఊహించలేము. కాకపోతే ఎమోషన్ కోసం పెట్టిన కోవిడ్ ఎపిసోడ్సే విసిగిస్తాయి. అప్పుడే అనిపిస్తుంది ఈ తమిళం వాళ్లు మాత్రమే చేయగల అతి సీన్స్ అవి అని. మిగతాదంతా చక్కటి థ్రిల్లర్ గా వెళ్తుంది.
దర్శకుడు ఒక ఇంట్రస్టింగ్ కథాంశాన్ని తీసుకొని సాధారణ థ్రిల్లర్‌గా మార్చారు. ప్రారంభం పాత్రల పరిచయాలు , ఆసక్తిలేని సన్నివేశాలతో సుదీర్గంగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ ఫైట్ సీన్ , ముసుగు మనిషి ఉద్దేశాలు ఏమిటి అనే ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌లు, తదుపరి ఏమిటనే ఆసక్తిని కలిగించి సినిమాని నిలబెట్టాయి. సెకండాఫ్ మెల్లగా చిక్కుముడులను విప్పడం ప్రారంభించినప్పటి నుండి, స్క్రీన్ ప్లే డ్రాప్ అవుతూనే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వచ్చిన శరత్‌కుమార్ దే కథ అన్నట్లు చూపించి మిస్ లీడ్ చేయటం ఇబ్బందిగానే అనిపిస్తుంది.
టెక్నికల్ గా ...
దర్శకత్వం క్రైమ్ థ్రిల్లర్ కు సరపడా షాట్స్ తో బాగానే డిజైన్ చేసుకున్నారు. ఇక పాటల్లో సి.సత్య సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. టెన్స్ గా ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలాంటి సినిమాకు అత్యవసరం. కానీ అందుకు తగినట్లు లేదు. సినిమాటోగ్రాఫర్ కె. రామచంద్రన్ ఇరుకైన ప్లేస్‌లలో నడిచే కథకు సరపడ కెమెరా యాంగిల్స్, లైటింగ్ బాగా చూసుకున్నారు. చిత్రం పెద్ద మైనస్ ఎడిటింగ్ స్టైల్. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్స్‌కు తగినట్లు గా పాట్రన్ మార్చి చెయ్యలేకపోయారు, ముఖ్యంగా లాస్ట్ సీన్ ని సాదా సీదాగా ముగించినట్లు అనిపిస్తుంది. ఆ సీన్ మామూలుగా మొదలై పొరలుగా ఒక్కోటి విడుతూంటుంది. అరుణ్ శంకర్ దురై ఆర్ట్ డైరక్షన్ మాత్రం ఫెరఫెక్ట్.
చూడచ్చా
క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లకి మంచి కాలక్షేపమే. వీకెండ్ ఓ లుక్కేయవచ్చు
ఎక్కడుంది
అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది
నటీనటులు : విజయ్ కనిష్క, శరత్ కుమార్, సముద్రఖని, గౌతమ్ వాసుదేవ మీనన్, మునిష్కాంత్ కింగ్స్ లే, సితార, స్మృతి వెంకట్, రామచంద్ర రాజు (కే జి ఎఫ్ గరుడ), రామచంద్రన్, ఐశ్వర్య దత్త, అభి నక్షత్రం.
ఎడిటర్ : జాన్ అబ్రహం
మ్యూజిక్ : సి. సత్య
డి ఓ పి : కే. రామ్ చరణ్
కథ : ఎస్. దేవరాజ్
దర్శకత్వం : సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్
నిర్మాత : కె. ఎస్ రవికుమార్