జగన్‌ ప్రజాదరణ కలిగిన నాయకుడు..నా లాంటి వాళ్లు వీడినా జగన్‌కు ఏమీ కాదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.


విజయసాయిరెడ్డి ప్రకటించిన ప్రకారం వరుసగా రాజీనామాలు చేసుకుంటూ వస్తున్నారు. తొలుత తన రాజ్య సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి తన రాజీనామా పత్రం సమర్పించారు. దీంతో ఒక పదవికి రాజీనామా చేయడం పూర్తి అయింది.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించానని, దాన్ని ఆయన ఆమోదించినట్లు తెలిపారు. తనకు ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశానన్నారు. రాజ్యసభ సభ్యత్వానికే కాకుండా పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి కూడా దూరంగా ఉండాలని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో కాకుండా అంతకుముందు 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను నెగ్గి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ సారి 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్‌ సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని, తన లాంటి వాళ్లు వెయి మంది పార్టీ వీడినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమీ కాదని, జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న ఆదరణ తగ్గదనేది తన ఉద్దేశమని చెప్పారు. తన రాజీనామా నిర్ణయాన్ని ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్‌లో మాట్లాడి వివరించినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేల బలమే ఉందని, తన రాజీనామాతో కూటమి లబ్ది పోందుతుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయాల నుంచి ఒక సారి తప్పుకున్న తర్వాత భవిష్యత్‌లో ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం సబబు కాదన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఏమి ఉంటుందన్నారు. ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తర్వాత రాజీనామా పత్రం సమర్పిస్తానని వెల్లడించారు. హిందూ ధర్మాన్ని వ్యక్తిగా, వెంకటేశ్వర స్వామిని పూజించే వ్యక్తిగా అబద్దాలు చెప్పను.. అలా అబద్దాలు చెబుతాను అని ఎవరైనా నమ్మితే.. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా అని తెలిపారు.
జగన్‌తో ఏమైనా విభేదాలున్నాయా అనే దానిపై ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ కుటుంబంతో సంబంధం ఇప్పటిది కాదని, రాజారెడ్డి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయని, ఏ నాడు ఆ కుటుంబంతో తనకు విభేదాలు లేవని, భవిష్యత్‌లో కూడా విభేదాలు తలెత్తే చాన్స్‌ లేదని స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసుల ఒత్తిడి నేపథ్యంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారా.. అనే దానిపై ఆయన మాట్లాడుతూ.. 2011 ఆగస్టు 10న అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2011లో ఎన్నో ఆశలు పెట్టినా.. తనను అప్రూవర్‌గా మారాలని ఎంత బలవంతం పెట్టినా.. దైవాన్ని నమ్ముకున్న వ్యక్తిగా.. వైఎస్‌ కుటంబంతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తిగా తాను అప్రూవర్‌ కావడానికి నిరాకరించానని చెప్పొకొచ్చారు. అదే పరిస్థితి ఈ రోజు కూడా. వెన్నుపోటు రాజకీయాలు చేయను అని స్పష్టం చేశారు.
కాకినాడ పోర్టు షేర్లు గురించి ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనపైన పెట్టిన తొలి కేసు కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ కేసు. దీనిలో తనను రెండో అక్యూజ్డ్‌గా చేర్చారు. అయితే ఇంత వరకు తనను సీఐడీ అధికారులు పిలవలేదు. ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. అలా విచారణకు ఈడీ అధికారులు పిలిచినప్పుడు తనకు కేవీరావుకు మధ్య ఉన్న సంబంధాల గురించి చెప్పానన్నారు. కేవీరావు ఎప్పుడైనా కలిస్తే నమస్తే అని పలకరించుకోవడమే కానీ ఆయనతో తనకు ఎలాంటి వ్యక్తిగ సంబందాలు కానీ, ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. తనపై ఆరోపణలు తప్పుడు ఆరోపణలని స్పష్టంగా ఈడీ అధికారుల ముందు చెప్పానన్నారు. కేవీరావును రమ్మనండి.. నేను వస్తాను.. ఇద్దరం కలిసి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పారు. కేవీరావు చెప్పేది నిజమైతే.. తాను విక్రాంత్‌రెడ్డిన కేవీరావు వద్దకు పంపినట్లు కేవీరావు తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాలని ప్రశ్నించారు. తాను తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, అలాంటివేమీ జరగలేదని స్పష్టం చేశారు. కాకినాడ సీపోర్ట్సు కేసుకు సంబంధించి తనకు ఎప్పుడు ఎవ్వరూ ఏమీ చెప్ప లేదు..తనకు తెలియదు..కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే తనకు ఈ కేసు గురించి తెలిసిందన్నారు.
Next Story