వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైవిధ్య భరిత వర్తమానం ప్రజలకు అదించారు. అదేంటో తెలుసుకుందాం...


వర్తమాన రాజకీయాలపై ఎటువంటి ఆలోచన విజయసాయిరెడ్డికి వచ్చిందో... తన ఆలోచనను వెనుకా ముందూ చూడకుండా ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా పంచుకున్నారు. ఆ పోస్టు చూస్తే తమ పార్టీతోనే తనకు వైరాగ్యం ఉన్నట్లు అర్థమవుతుంది. పార్టీ పైనే కాదు నేటి నాయకులందరిపైనా ఆయనకు ఏహ్య భావం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి నాయకుడు అవసరమో తన మాటల్లో చెప్పారు. స్వచ్ఛమైన తెలుగు భాషను ఉపయోగించిన విజయసాయి మనసులో మాటను బయట పెట్టారు. దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్రమోదీ గానీ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ కానీ పాలకులుగా పనికి రారని ఈ పోస్టు చూసిన వారికి అర్థమవుతుంది.

నేటి రాజకీయాలను దృశ్య, శ్రవణ విశ్లేషణ చేసి చూస్తే దేశ, రాష్ట్ర ప్రజల అవసరాలను ఆకాంక్షలను ఆకళింపు చేసుకుని, లౌకిక భావజాలంతో ముందుకు నడిచే వారు కావాలన్నారు. కళాత్మక వ్యక్తీకరణతో ఆకట్టుకో గలిగిన ఉదార ఉదాత్తత, దాతృత్వపూరిత, స్వార్థరహిత, ఆస్తికుడైన గొప్ప వ్యక్తి నాయకుడుగా, పాలకుడిగా రావాల్సిన అవసరం ఉందన్నారు. అంటే ప్రస్తతం ఉన్న పాలకుల్లో విజయసాయి రెడ్డి చెప్పిన లక్షణాలు ఉన్న వారు ఎవరూ లేరని అర్థమైంది. చివరకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడైన జగన్‌లో కూడా ఈ లక్షణాలు లేవని చెప్పాలి. ఎందుకంటే మా నాయకుడిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయని ఆయన చెప్పలేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే జనంతో మమేకమై నిరంతరం వారి బాగోగుల గురించి ఆలోచించి, పాటుపడే నాయకుడు అధికారం చేపట్టాల్సిన ఆవస్యకత కనిపిస్తోందన్నారు. అంటే రానున్న జమిలీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నారా? ఇప్పుడున్న వారు ఒక్కరు కూడా జనంతో మమేకమైన నాయకులు కాదని భావిస్తున్నారా? అంటే రెండూ ఆలోచించే అన్నారని చెప్పొచ్చు. ఎప్పుడూ వైఎస్‌ జగన్‌పై ఈగ వాలకుండా మాట్లాడే విజయసాయిరెడ్డి మంగళవారం సాయంత్రం పెట్టిన పోస్టులో ఆయన చేసిన వ్యాఖ్యలు, సూచనలు, ప్రజలు ఆలోచించాలనే భావన కలిగించేలా ఉన్నాయి. ప్రజల కోసమే జీవించే జననేతకు చిత్త శుద్ధి, మంచి వ్యక్తిత్వం కావాలని, ఛాదస్తాలు ఉండకూడదని, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగు ప్రజల ఆకాంక్ష ఇదేనని ట్విటర్‌లో పేర్కొన్నారు.
అంటే ఇప్పటి వరకు పాలించిన వారు కానీ, పాలిస్తున్న వారు కానీ ప్రజల కోసం జీవిద్దామనే చిత్తశుద్ధితో లేరని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఛాదస్తాలు ఉండకూడదని చెప్పారు. అంటే ఎవరు చెప్పినా వినకుండా తాను చేసిందే మంచిదనుకోవడం కూడా ఛాదస్తంగానే బావించాల్సి ఉంటుంది. ఎవరు చెప్పినా వినేది లేదని, ఆయన అనుకున్నదే చేస్తాడని జగన్‌ గురించి అందరూ అంటుంటారు. ఆయన ఛాదస్తం వల్లే పార్టీ ఓటమి పాలైందని ఇప్పటికే పలువురు ఓటమి పాలైన నాయకులు స్పష్టం చేశారు. ఈ మాటలన్నీ తూచా తప్పకుండా జగన్‌కు కూడా వర్తిస్తాయనటంలో సందేహం లేదు. ఈ పోస్టు ద్వారా వైఎస్సార్‌సీపీకి కానీ, టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకు కానీ, ఇండియా కూటమికి కాని ఏమి చెప్పదలుచుకున్నారో చదివే వారు వెంటనే అర్థం చేసుకుంటారు. అప్పుడప్పుడూ ఆయనలోని మరో కోణం కూడా ఇలా భావ వ్యక్తీకరణతో ముందుకు రావడం విశేషం.
Next Story