విజయవాడ ఈస్ట్ ఎవరికి?
ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రధానంగా ఉంటారు.
విజయవాడ ఈస్ట్ నియోకవర్గంలో ఏ పార్టీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రధానంగా ఉంటారు. వీరితో పాటు మిగిలిన పార్టీల వారు కూడా ఉంటారు. విజయవాడ ఈస్ట్ నియోకవర్గంలో కమ్మ, కాపు వర్గాలకు చెందిన వారు గెలుస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలైంది. రెండు దఫాలుగా టీడీపీ అభ్యర్థి గెలిచారు.
వైఎస్సార్‌సీపీ సీటు దక్కేదెవరికి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుతం దేవినేని అవినాష్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈయనకంటే ముందు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన బొప్పన భవకుమార్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. దేవినేని అవినాష్‌ను వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకున్న తరువాత భవకుమార్‌ను తప్పించి అవినాష్‌ను రంగంలోకి దించారు. అభ్యర్థిగా అవినాష్ ఉంటారా? మారుస్తారా? అనేది తేలలేదు. బొప్పన భవకుమార్‌కు విజయవాడ సిటీ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అసంతృప్తితో ఉన్న భవకుమార్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించలేదు.
కాగా వంగవీటి రాధాకృష్ణను తిరిగి వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకుని విజయవాడ ఈస్ట్ టిక్కెట్ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే రాధా వస్తారా? రారా అనేది కూడా సందిగ్ధంగా ఉంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు మంచి మిత్రుడు. అలాగే సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీగా ఉన్న తలశిల రఘురామ్‌కు కూడా మంచి స్నేహితుడు. వీరందరి ద్వారా టాక్స్ జరుగుతున్నట్లు సమాచారం. రాధా వైఎస్సార్‌సీపీ తరుపు పోటీ చేస్తే ఈస్ట్ నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.
1985లో రాధా తండ్రి వంగవీటి మోహనరంగా ఈ నియోకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తరువాత భర్త మరణంతో రెండు సార్లు వంగవీటి రత్నకుమారి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2004లో తూర్పు నుంచి వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంటే వరుసగా నాలుగు సార్లు తండ్రి, తల్లి, కుమారుడు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.
టీడీపీ టిక్కెట్ గద్దెకు దక్కుతుందా?
ఎన్‌టీఆర్ జిల్లాలో ఏకైన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ సారి టిక్కెట్ రామ్మోహన్‌కు టీడీపీ ఇస్తుందా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది. గద్దె రామ్మోహన్‌ను పెనమలూరు అభ్యర్థిగా మార్చాలనే ఆలోచనలో చంద్రబాబునాయుడు ఉన్నారని సమాచారం. ఒక వేళ అదే జరిగితే పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు ఎక్కడ అవకాశం కల్పిస్తారనేది కూడా చర్చల్లోకొచ్చింది. 2014 ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణపై గెలుపొందారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్‌పై గెలుపొందారు. తిరిగి మూడో సారి కూడా ఈస్ట్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
పొత్తులో విజయవాడ ఈస్ట్ జనసేనకు కేటాయించే అవకాశం
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చంద్రబాబు ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. రెండు సార్లు గెలిచినందున రామ్మోహన్‌పై కాస్తోకూస్తో వ్యతిరేకత ఉంటుందని, అటువంటప్పుడు జనసేనకు కేటాయిస్తేనే మంచిదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
జనసేనకు కేటాయిస్తే విజయవాడ ఈస్ట్ నుంచి పీఆర్‌పీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉంది. పీఆర్‌పీ తరపున 2009లో దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)పై పోటీచేసి రవి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ గిట్టకపోవడంతో 2018లో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు సీటు ఇస్తానంటే జనసేనలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఒక వేళ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వంగవీటి రాధా రంగంలో ఉంటే యలమంచిలి ఉంటారా? తప్పుకుంటారా? అనేది ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాదా యలమంచిలి రవికి స్వయానా మేనల్లుడు.
వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఏమిటి?
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కొనసాగింది. ఈ సారి ఆ పరిస్థితి లేదనేది పరిశీలకుల అంచనా. రెండు సార్లు విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఈ సారి కూడా జనసేనకు విజయవాడ ఈస్ట్ కేటాయించకుంటే తెలుగుదేశం పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే జనసేనకు కేటాయిస్తే జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనే ప్రచారం కూడా సాగుతున్నది.
Next Story