గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15లక్షల మందికిపైగా భక్తులు తరలి రావచ్చని అంచనా. 25లక్షలకుపైగా లడ్లూ సిద్దం చేశారు.


దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలకొన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వా దేవస్థానం ముస్తాబైంది. గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 12వ తేదీ శనివారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనాల కోసం భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నలుమూల నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి తగ్గ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి కొండ దిగువన వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

భక్తులు ఒక సారి క్యూ లైన్‌లోకి ప్రవేశించిన తర్వాత దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు నడచి వెళ్లి ఘాట్‌ రోడ్డ మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం దేవాలయం మెట్ల మార్గానికి పక్కనే తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా మహామండపంలో ర్యాంప్, మెట్ల మార్గం ద్వారా కిందకు దిగేందుకు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఈ మార్గం గుండా దిగే భక్తులకు మధ్యలో అన్నదాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న కనకదుర్గనగర్‌లో లడ్డూ ప్రసాదాల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 12 వరకు కొనసాగుతాయి. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

మొదటి రోజైన గురువారం శ్రీఆబాలాత్రిపుర సుందరీ దేవీ అలంకారంలోను, శుక్రవారం శ్రీ గాయత్రీ దేవీ అలంకారంలోను, శనివారం అన్నపూర్ణా దేవీ అలంకారంలోను, ఆదివారం శ్రీలలితా త్రిపుర సుందరీ దేవీ అలంకారంలోను, సోమవారం శ్రీ మహా చండీదేవీ అలంకారంలోను, మంగళవారం శ్రీ మహాలక్షీదేవీ అలంకారంలోను, బుధవారం శ్రీ సరస్వతీదేవీ అలంకారంలోను, గురువారం శ్రీ దుర్గాదేవీ అలంకారంలోను, శుక్రవారం శ్రీ మహిషాసుర మర్ధినిదేవీ అలంకారంలోను, శనివారం శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అలంకారంలోను భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
నవరాత్రుల సందర్బంగా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనాల కోసం భక్తులను అనుమతిస్తారు. అయితే తొలి రోజైన గురువారం ఉదయం 9 గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులతో పాటు ఈ నెల 13, 14 వరకు అంతరాలయం దర్శనాలను పూర్తిగా ఆపేస్తున్నట్లు దేవాలయ యంత్రాంగం ప్రకటించింది. కేవలం ముఖ మండప దర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. దరస నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతి రోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు అమ్మవారి మహానివేదన, పంచహారతులు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులకు దర్శనాలను నిలపివేస్తారు. మహానివేదనాలు, పంచహారతులు పూర్తి అయిన తర్వాత తిరిగి అమ్మవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.
విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం దరసరా ఉత్సవాలకు పేరుగాంచింది. దీంతో భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదాలను కూడా పెద్ద ఎత్తునే సిద్ధం చేశారు. దాదాపు 25లక్షల లడ్డూలను ముందస్తుగా సిద్ధం చేశారు. భక్తులకు వీటిని విక్రయించేందుకు 18 కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. కొండ దిగువన కనకదుర్గానగర్‌లో 10, తక్కిన కౌంటర్లను మిగతా ఘాట్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
భారీగా తరలి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం కోసం ఐదు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వీటిల్లో రెండు ఉచిత దర్శనం చేసుకునే క్యూ లైన్లు కాగా, తక్కినవి రూ. 100, రూ. 300, రూ. 500 టిక్కెట్ల క్యూలైన్లు. టిక్కెట్ల విక్రయ కేంద్రాలను 15 చోట్ల ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో రిసెప్షన్, టోల్‌గేటు, ఓం టర్నింగ్‌పాయింట్‌లతో పాటుగా కలెక్టర్‌ కార్యాలయం, స్టేట్‌ గెస్ట్‌హౌస్, బస్టాండ్, రైల్వే స్టేషన్, అన్ని ఘాట్లలో ఏర్పాటు చేశారు. సాధారణ భక్తుల దర్శనాలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. అందులో భాగంగా వీఐపీ, వీవీఐపీ, వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో దర్శనం చేసుకునేందుకు సమయం కేటాయించారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాట్లు చేపట్టారు. మూడు షిఫ్టులలో 5,200 మంది పోలీసులు విధుల్లో ఉంటారు. ఆలయంలో 200 సీసీ కెమేరాలను కూడా ఏర్పాటు చేశారు. కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల వద్ద మోనటరింగ్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లు 24 గంటల పాటు మోనటరింగ్‌ చేయనున్నారు. దీని కోసం సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.
భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలోను దృష్టి సారించారు. 150 తాత్కాలిక మరుగు దొడ్లను ఏర్పాటు చేశారు. సీతమ్మవారి పాదాలు, బస్టాండ్, రాజీవ్‌గాంధీ పార్క్, కృష్ణవేణి ఘాట్, కుమ్మరిపాలెం, టీటీడీ పార్కింగ్‌ స్థలం, కెనాల్‌ రోడ్డు, భవానీ ఘాట్‌ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు. స్నానాల గదులను కూడా ఏర్పాటు చేశారు. పున్నమి ఘాట్లలో 700 షవర్లను ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలను సమర్పించుకునేందుకు కేశ ఖండన శాలను కూడా ఏర్పాటు చేశారు. సీతమ్మపాదాల వద్ద దీనిని ఏర్పాటు చేశారు. మూడు షిప్టులల్లో 600 మంది క్షురకులు విధుల్లో ఉంటారు.
Next Story