విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం..  హోం మంత్రి ప్రత్యేక సమీక్ష
x

విజయవాడలో రికార్డు స్థాయి వర్షపాతం.. హోం మంత్రి ప్రత్యేక సమీక్ష

రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. ముసురు పట్టినట్లు పట్టి జనజీవనాన్ని స్తంభింపజేశాయి ఈ వర్షాలు.


రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. ముసురు పట్టినట్లు పట్టి జనజీవనాన్ని స్తంభింపజేశాయి ఈ వర్షాలు. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో విజయవాడ నగరమంతా వరదలతో అల్లాడిపోతోంది. ఎక్కడ చూసినా భారీ మొత్తంలో నీరు నిలిచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగి పడితే ప్రాణ హాని జరగకుండా చూసుకోవడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. విజయవాడలో దాదాపు అన్ని కాలనీలు జలమయ్యాయి. దీంతో పాఠశాలలకు ఇచ్చిన సెలవులను పొడిగించాలా అన్న అలోచనలో కలెక్టర్, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా నగరమంతా సేకరిస్తున్న సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఉన్నతాధికారులు. సర్కార్ కూడా ఈ వర్షాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

రికార్డు స్థాయిలో వర్షపాతం..

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం విజయవాడలో రికార్డు నమోదు చేసింది. 30 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షపాతం కురిసింది లేదని అధికారులు చెప్తున్నారు. ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ స్థాయి వర్షం కారణంగానే పలు కాలనీల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిందని అధికారులు చెప్తున్నారు. జలమైన ప్రాంతంలోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి చర్యలను వేగవంతం చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ వర్షాల వల్ల విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలు కష్టతరమవుతున్నాయి. నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితులపై హోం మంత్రి వంగలపూడి అనిత.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

294 గ్రామాలకు ముంపు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 294 గ్రామాలు ముంపుకు గురయ్యాయని, ఆ గ్రామాలకు చెందిన 13,227 మందిని హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు హోం మంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అని వివరించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై ఆరా తీశారు. అన్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల కారణంగా ఇంత వరకు 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 13,227 మందిని తరలించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 61 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసామని ఆమె వివరించారు.

9 మంది మృతి

‘‘ఇప్పటివరకు వర్షాల కారణంగా తొమ్మిది మంది మరణించారు. పోలిస్ , ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల బృందాలు ముంపు ప్రాంతాల్లోని 600 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 9 ఎస్డీఆర్ఎఫ్, 8 ఎన్డీఆర్ఎఫ్ మొత్తం 17 బృందాలు 7 జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అవసరమైన 05 బోట్లు , 01 హెలికాప్టర్ సిద్ధంగా ఉంచాం. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అధిక వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని నిర్దేశించారు’’ అని చెప్పారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికి అవసరమైన 05 బోట్లు , 01 హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంచామని అన్నారు.

నష్టం తగ్గింది

‘‘రెవెన్యూ,పోలిస్,ఇరిగేషన్, పంచాయతీరాజ్,మున్సిపల్,వైద్య, విద్యుత్ మొదలగు ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పనిచేసి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవడం వలన ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించి ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నాం. రాయనపాడు రైల్వే స్టేషన్లో వరద నీరు చేరినందున తమిళనాడు ఎక్సప్రెస్ ను నిలుపుదల చేసిన కారణంగా ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు ఆర్టీసి బస్సుల ద్వారా తరలించేందు ప్రత్యామ్నయ ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు ఆహారం , త్రాగు నీరు ఏర్పాటు చేశాం. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నందున ప్రజలు వాటిని దాటే విషయంలో ప్రభుత్వ హెచ్చరికలు పాటించాలి. ప్రభుత్వానికి అందరూ సహకరించాలి’’ అని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Read More
Next Story