గుంటూరు జిల్లా కాజా గ్రామం నుంచి గన్నవరం సమీపంలోని పెద్ద అవుట్‌పల్లి వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వేస్తున్నారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయవాడ నగర మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకుడిగా వంగవీటి రంగా విజయవాడ ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా, గౌరవంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు షర్మిల లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వంగవీటి రంగా ఎంతో సేవ చేశారు. పేదలకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. సామాజిక న్యాయం కోసం వంగవీటి రంగా ఎంతో కృషి చేశారు. అణగారిన వర్గాల కోసం, వారి సంక్షేమం కోసం రంగా చాలా కృషి చేశారు. పోరాటాలు చేశారు. భూమి లేని పేద వారికి భూమి పంపిణీ చేశారు. అలా సేవలు అందించి పేద ప్రజల గుండెల్లో వంగవీటి రంగా చిరస్థాయిగా నిలిచి పోయారు. పేద ప్రజల నాయకుడిగా ముద్ర వేసుకున్న మహోన్నత నాయకుడు వంగవీటి రంగా అని, ఆమె అభివర్ణించారు.
విజయవాడ ప్రజలకు, పేదల పక్షాన నిలబడి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ విజయవాడ వెస్ట్ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహన్ రంగా బైపాస్ జాతీయ రహదారిగా పేరు పెట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. రంగా పేరు పెట్టే విధంగా ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపించడంతో పాటు కేంద్రాన్ని ఒప్పించి అనుమతులు తీసుకొని రావాలని సీఎం చంద్రబాబును షర్మిల కోరారు. గుంటూరు జిల్లా కాజా గ్రామం నుంచి గన్నవరం సమీపంలోని పెద్ద అవుట్‌పల్లి వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వేస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ నిర్మాణం సాగుతోంది. దాదాపు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావచ్చింది. మరి కొన్ని రోజుల్లో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని సీఎం చంద్రబాబును కోరడం చర్చనీయాంశంగా మారింది.
Next Story